Saturday, November 23, 2024

రేషన్ డీలర్లతో మంత్రి గంగుల కమలాకర్ చర్చలు సఫలం

- Advertisement -
- Advertisement -

సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటన
22 సమస్యలపై 20 పరిష్కారానికి సానుకూలం
గౌరవ వేతనం, కమీషన్ పెంపు సిఎం దృష్టికి

హైదరాబాద్: రాష్ట్రంలో రేషన్ డీలర్లతో సోమవారం పౌరసరఫరాల శాఖ మంత్రి జరిపిన చర్చలు ఫలించాయి. ప్రభుత్వం ముందు డీలర్లు 22 సమస్యలు పెట్టగా అందులో 20సమస్యల పరిష్కారం పట్ల ప్రభుత్వం సానుకూలత వ్యక్తం చేసింది. దీంతో వచ్చే నెల 5నుంచి జరపతలపెట్టిన సమ్మెను విరమిస్తున్నట్టు రేషన్‌డీలర్లు ప్రకటించారు. ఈ సందర్బంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ పేద ప్రజలకు నిత్యావసర సరుకులను సకాలంలో అందించవలసిన కనీస బాధ్యత, కర్తవ్యం తెలంగాణ ప్రభుత్వానికి ఎంతైతే ఉందో రేషన్ డీలర్లపై కూడా అంతే వుందని అన్నారు.

పేద ప్రజలకు నిత్యావసర సరుకులు అందించడం ఒక సామాజిక బాధ్యత అనే విషయాన్ని డీలర్లు మరవద్దని, ఈ బాధ్యతను విస్మరించి రేషన్ బియ్యం పంపిణీకి ఆటంకం కలిగించేలా రేషన్ డీలర్లు సమ్మెకు పిలుపునివ్వడం బాధాకరం అన్నారు. వచ్చే నెల 5వ తేది నుండి రేషన్ డీలర్ల సమ్మెకు పిలుపునిచ్చిన నేపథ్యంలో సచివాలయంలోని తెలంగాణ రేషన్ డీలర్ల ఐక్యకార్యాచరణ కమిటి నేతలతో చర్చలు జరిపారు. ఈ సమావేశంలో శాసనసభ్యులు వినయ్ భాస్కర్, పద్మాదేవేందర్ రెడ్డి, పౌరసరఫరాల శాఖ కమీషనర్ వి.అనిల్‌కుమార్, జెఎసి చైర్మన్ నాయికోటి రాజు, వైస్ ఛైర్మన్ బంతుల రమేష్‌బాబు, కన్వీనర్ దుమ్మాటి రవీందర్, కోౠకన్వీనర్ గడ్డం మల్లికార్జున్ గారు పాల్గన్నారు.

ఈ సమావేశంలో జెఎసి ఇచ్చిన 22 డిమాండ్లపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా మంత్రిగారు మాట్లాడుతూ రేషన్ డీలర్ల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని హామీ ఇచ్చారు. మొత్తం 22 సమస్యలపై 20 సమస్యల పరిష్కారినికి సానుకూలంగా ఉన్నామని ఇందుకు సంబధించి వారం రోజుల్లో ఉత్తర్వులు జారీ చేస్తామని, గౌరవ వేతనం, కమీషన్ పెంపు ఈ రెండు సమస్యలను ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు.

సమ్మెను విరమిస్తున్నాం….
మంత్రి కమలాకర్ ఇచ్చిన హామీ మేరకు సమ్మెను విరమిస్తున్నట్లు మంత్రి సమక్షంలో జెఎసి ప్రతినిధులు ప్రకటించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పై సంపూర్ణ నమ్మకం వుందని, ముఖ్యమంత్రి తమ సమస్యలను పరిష్కరిస్తారని ఆశతో సమ్మెను విరమిస్తున్నట్లుజేఎసి చైర్మన్ నాయికోటి రాజు ప్రకటించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News