యాదాద్రి భువనగిరి: యాదగిరిగుట్ట పట్టణ పరిధిలోని వైటీడీఏ స్థలంలో వంద పడకల ఆస్పత్రికి ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు, రాజ్యసభ సభ్యులు లింగయ్య యాదవ్, ప్రభుత్వ విప్ గొంగిడి సునితామహేందర్ రెడ్డి, కలెక్టర్ పమేలా సత్పతి, డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి లతో కలిసి శంకుస్థాపన చేశారు. అంతకు ముందు మంత్రి తన కుటుంబసభ్యులతో కలిసి శ్రీ లక్ష్మీనరసింహస్వామిని వారిని దర్శించుకున్నారు.
ఆలయానికి విచ్చేసిన దంపతులకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు చేసి, మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయ అధికారులు మంత్రి హరీష్ రావు కుటుంబసభ్యులకు వేద ఆశీర్వచనం చేసి, తీర్థప్రసాదాలు అందజేశారు. యాదాద్రి ఆలయానికి మంత్రి హరీష్ రావుతో పాటుగా ఎంపీ బడగుల లింగయ్య యాదవ్ , జెడ్పీ ఛైర్ పర్సన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి, ఆలేరు ఎమ్మెల్యే సునీత మహేందర్ రెడ్డి కూడా స్వామివారిని దర్శించుకున్నారు.