సిద్దిపేట: రింగ్ మేన్ రేపటి సిద్ధిపేటకు ఓ వరమని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి అన్నారు. రూ.50 కోట్లతో ఈ స్కీమ్ చేపట్టినట్లు, పది తరాలకు సరిపడేలా కొత్త సంవత్సరం నుంచి మల్లన్నసాగర్ ద్వారా సిద్ధిపేటకు తాగునీరు అందించనున్నామని మంత్రి హరీశ్ పేర్కొన్నారు. పట్టణంలోని 3వ వార్డు పరిధిలోని మిలాన్ గార్డెన్ సమీపంలో 10వేల లీటర్ల సామర్థ్యం కలిగిన మంచినీటి ట్యాంక్ నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మల్లన్న సాగర్ నుంచి సిద్ధిపేట పట్టణానికి రూ.50 కోట్ల రూపాయలతో తాగునీటి సౌకర్యం కోసం పనులు చేపట్టడం జరిగిందని, డిసెంబర్ నెలాఖరులోగా పనులు పూర్తవుతాయని తెలిపారు. సిద్ధిపేట ప్రజలకు స్వచ్ఛమైన, పరిశుభ్రమైన శుద్ధి చేసిన తాగునీరు అందించేలా మల్లన్నసాగర్ నుంచి గ్రావిటీ ద్వారా పట్టణ ప్రజలకు అవసరమైన తాగునీటిని అందించేలా ఈ పథకాన్ని చేపట్టినట్లు వెల్లడించారు.
గతంలో రెండు జిల్లాల పరిధిలో యశ్వాడ లిఫ్టు ద్వారా తాగునీరు తేవడంలో విద్యుత్తు, ఇతరత్రా అవాంతరాలు ఏర్పడి పట్టణ ప్రజలకు తాగునీటి సరఫరాలో ఇక్కట్లు కలిగేవనీ, అలాంటి అవాంతరాలు ఏమీ లేకుండా 50 టీఏంసీలు కలిగిన కొమురవెళ్లి మల్లన్నసాగర్ లో 10 టీఏంసీలు తాగునీరు ఎప్పుడూ నిలిచి ఉంటుందని, ఆ నిలిచిన 10 టీఏంసీల స్వచ్ఛమైన, శుద్ధి చేసిన అవసరమైన తాగునీటిని సిద్ధిపేట ప్రజలకు అందిస్తున్నట్లు మంత్రి వివరించారు. ఈ యేడు డిసెంబరు నెలలో పనులు పూర్తి చేసి, కొత్త సంవత్సరంలో మల్లన్నసాగర్ ద్వారా సిద్ధిపేట చుట్టూ రింగ్ మేన్ ద్వారా ఏలాంటి అంతరాయం లేకుండా తాగునీటి సరఫరా ఉంటుందని మంత్రి హరీశ్ పేర్కొన్నారు. ప్రజలంతా నీటిని పొదుపుగా వాడుతూ తాగునీటి వృథాను ఆరికట్టాలని పిలుపునిచ్చారు.