హైదరాబాద్: గాంధీ ఆసుపత్రి ఎదుట ఏర్పాటు చేస్తున్న గాంధీ విగ్రహాన్ని మంత్రులు తన్నీరు హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ బుధవారం పరిశీలించారు. మంత్రులతో పాటు డిఎంఈ ఎమెష్ రెడ్డి, ప్రిన్సిపాల్ సెక్రటరీ అరవింద్, ఆసుపత్రి సూపరిండెంట్ రాజారావు ఉన్నారు. అక్టోబర్ 2 వ తేదీన విగ్రహావిష్కరణ జరుగనుంది. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. గాంధీ ఆసుపత్రి వద్ద 16 ఫీట్ ల గాంధీ విగ్రహం ఏర్పాటు చేస్తుండటం సంతోషమన్నారు. కోవిడ్-19 సమయంలో గాంధీ ఆస్పత్రి అత్యద్భుత సేవలు అందించిందని కొనియాడారు. ఆక్టోబర్ 2వ తేదీన ముఖ్యమంత్రి కెసిఆర్ చేతుల మీదుగా ఉదయం 10 గంటలకు విగ్రహం ఆవిష్కరణ జరుగుతుందన్నారు. అనంతరం ఆసుపత్రి ప్రాంగణంలో భారీ బహిరంగ సభలో సిఎం మాట్లాడతారని మంత్రి చెప్పారు. నెల్సన్ మండేలా లాంటి వారు గాంధీ చూపిన అహింసా మార్గాని అవలంభిస్తున్నారని చెప్పారు.
కెసిఆర్ సైతం 14 ఏళ్ళు అహింసా మార్గంలో రాష్ట్ర సాధన ఉద్యమం చేపట్టి తెలంగాణను సాధించారని చెప్పారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. మహాత్ముడి జయంతి సందర్భంగా అక్టోబర్ 2న సికింద్రాబాద్ లో గాంధీకి సిఎం నివాళులు అర్పిస్తారు. అక్కడి నుంచి గాంధీ ఆసుపత్రికి వచ్చి… గాంధీ ఎదుట ఏర్పాటు చేసిన 16 అడుగుల మహాత్ముడి విగ్రహం ఆవిష్కరిస్తారు. అనంతరం సభలో మాట్లాడతారు. హెచ్ఎమ్ డిఎ ఆధ్వర్యంలో గాంధీ విగ్రహం ఏర్పాటు చేశారని తలసాని తెలిపారు. దేశానికి స్వాతంత్రం తెచ్చిన గాంధీని వదిలి గాడ్సేని కోలుస్తున్న వ్యవస్థను చూస్తున్నామన్నారు. స్వతంత్ర వజ్రోస్థావల్లో గాంధీ సినిమా ప్రదర్శిస్తే లక్షల మంది వీక్షించారని మంత్రి తలసాని పేర్కొన్నారు.