Thursday, January 23, 2025

పసికందు ఆకలి తీర్చిన మంత్రి హరీశ్‌రావు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ‘పసిపాప ఆకలి తీర్చేందుకు పది కిలోమీటర్ల ప్రయాణం’ పేరిట ఒక పత్రికలో వచ్చిన వార్త చూసి చలించిపోయిన మంత్రి హరీశ్ రావు ఆ పాపను ఆదుకునేందుకు ముందుకు వచ్చారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం మారుమూల ప్రాంతమైన రాజుగూడకు చెందిన కొడప పారుబాయి జనవరి 10 ఇంద్రవెల్లి పిహెచ్‌సిలో ఆడబిడ్డకు జన్మనిచ్చారు. 10 రోజులకే ఆ తల్లి అనారోగ్యంతో కన్ను మూసింది. అప్పటి నుంచి పాప ఆకలి తీర్చేందుకు తండ్రి జంగుబాబు, తాత బాపురావు పడరాని పాట్లు పాడుతున్నారు. బిడ్డ ఆకలి తీర్చేందుకు పాల ప్యాకెట్ కోసం రోజూ 10 కిలోమీటర్లు ప్రయాణించి పాల ప్యాకెట్ కొని తీసుకువస్తున్నారు. గూడెంలో ఎవరికి ఆవు గానీ, మేక గానీ లేకపోవడం సమస్యగా మారింది.

ఈ విషయంపై ప్రచురితమైన వార్త చూసిన మంత్రి హరీశ్ రావు తక్షణం ఆ బిడ్డకు సాయం అందించాలని అధికారులను ఆదేశించారు. బిడ్డకు పాల కొరత లేకుండా ఉండేలా ఆవును సమకూర్చాలని సూచించారు. మంత్రి ఆదేశాల మేరకు, సమీప పిహెచ్‌సి సిబ్బంది ఆ పసికందు వద్దకు వెళ్లి పాల ప్యాకెట్లు, అవసరమైన పౌష్ఠికాహారం ప్యాకెట్లు అందించారు. ఆ బిడ్డ ఆరోగ్య పరిస్థితిని సమీక్షించారు. తండ్రి కోరిక మేరకు శాశ్వత పరిష్కారంగా, పాలిచ్చే ఆవును కొనుగోలు చేసి అందజేశారు. బిడ్డకు ఇక పాలు లేవనే సమస్య ఉండబోదని, ఎలాంటి ఆరోగ్య సమస్యలున్నా తమకు తెలియజేయాలని వైద్య సిబ్బంది బిడ్డ తండ్రి, తాతకు భరోసా ఇచ్చారు.

పత్రికలో వచ్చిన వార్తకు స్పందించి పసికందుకు పాలు అందించేందుకు ఆవును సమకూర్చడం పట్ల మంత్రి హరీశ్ రావుకు కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. బిడ్డను బాగా చూసుకుంటామని, మంత్రి అందించిన ఆవును గొప్ప బహుమతిగా భావిస్తామని తెలిపారు. ఇక ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ కాగా, మంత్రి హరీశ్ రావు స్పందించడంపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News