విజేతలను, సిఎస్‌బీ ఐఏఎస్ అకాడమీ
డైరెక్టర్ బాలలతను సత్కరించిన మంత్రి
మనతెలంగాణ/హైదరాబాద్ : సివిల్స్ ఫలితాల్లో ర్యాంకులు సాధించిన పలువురికి రాష్ట్ర ఆర్థికశాఖ, వైద్యారోగ్యశాఖ మంత్రి టి.హరీశ్‌రావు బుధవారం తన నివాసంలో అల్పాహార విందు ఇచ్చారు. సిఎస్‌బీ ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్, మెంటార్ మల్లవరపు బాలలత నేతృత్వంలో సివిల్స్ ర్యాంకర్లు సుధీర్ రెడ్డి (ర్యాంక్- 69), అరుగుల స్నేహ (136), బి. చైతన్య రెడ్డి (161), రంజిత్‌కుమార్ (574), స్మరణ్‌రాజ్ (676) మంత్రి హరీశ్‌రావును కలిశారు. ఈ సందర్భంగా వారిని మంత్రి హరీశ్‌రావు ఘనంగా సత్కరించారు. సివిల్స్‌లో ర్యాంకులు సాధించి తెలుగువారందరికీ గర్వకారణంగా నిలిచారని ఈ సందర్భంగా మంత్రి వారిని అభినందించారు. స్వయంగా ఐఏఎస్ అయిన బాలలత, నగరంలో ఐఏఎస్ శిక్షణ సంస్థ సీఎస్‌బీ అకాడమీని ఏర్పాటుచేసి ఇప్పటివరకు వంద మందికిపైగా సివిల్స్ విజేతలను తీర్చిదిద్దడం గర్వకారణమన్నారు.
సిఎస్‌బీ అకాడమీ నుంచి భవిష్యత్తులో మరింత మంది విజేతలు రావాలని ఆకాంక్షించారు. తెలంగాణ గర్వించేలా, దేశం మెచ్చేలా ప్రజలకు సేవలందించాలని పేక్కొన్నారు. బాలలత లాంటి మెంటార్స్ సలహాలు, సూచనల వల్ల విజయ అవకాశాలు మరింత చేరువ అవుతాయన్నారు. పోలియో మహమ్మారి రూపంలో వైకల్యం కలిగినా, గెలుపు మీద కసితో రెండు సార్లు సివిల్స్ ర్యాంకు సాధించడం గొప్ప విషయమని బాలలతను మంత్రి అభినందించారు. దేశం కోసం సివిల్స్ విజేతలను తయారు చేయాలని సంకల్పించి ఎంతో మందిని తీర్చిదిద్దుతున్నారని ప్రశంసించారు. సివిల్స్ విజేతలను సన్మానించి ప్రోత్సహించినందుకు మంత్రికి బాలలత కృతజ్ఞతలు తెలిపారు.
ఇంటర్వ్యూలో తెలంగాణపై ప్రశ్నలు
సివిల్స్ విజేతలతో కలిసి మంత్రి అల్పాహారం చేస్తూ, సివిల్స్ ఇంటర్వ్యూ జరిగిన తీరు గురించి ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా విజేతలు ఇంటర్వూ గురించి వివరించారు. తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి, ఇక్కడి విప్లవాత్మకమైన విధానాలు, రైతు బంధు, రైతు బీమా, మిషన్ కాకతీయ వంటి పథకాలు, అవి సాధించిన ఫలితాలపై ప్రశ్నలు అడిగినట్లు అభ్యర్థులు వివరించారు. ప్రతి ఇంటికి తెలంగాణ ప్రభుత్వ పథకాలు చేరువయ్యాయని, తమ సొంత అనుభవాలను ఇంటర్వ్యూలో వివరించినట్లు ఒక విజేత వివరించారు. ఒక ప్రశ్నకు సమాధానంగా, తెలంగాణలో జరిగిన అభివృద్ధిని,జిడిపి, జిఎస్‌డిపి, తలసరి ఆదాయంలో సాధించిన పురోగతిని చెబితే, ఇంటర్వ్యూ కమిటీ ఆశ్చర్యం వ్యక్తం చేసిందని మరొక అభ్యర్థి మంత్రికి తెలిపారు. గతంలో కంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ప్రశ్నలు ఎక్కువగా అడిగినట్లు తాము గమనించినట్లు వివరించారు.
మీ గెలుపు ఎంతో మందికి ఆదర్శం…
ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో దూసుకుపోతున్నట్లే, జాతీయ స్థాయిలో అవకాశాలు అందిపుచ్చుకోవడంలో ఇక్కడి యువత భాగస్వామ్యం పెరుగుతుందని మంత్రి సంతోషం వ్యక్తం చేశారు. సివిల్స్ ఫలితాల్లో మహిళలు గతంలో కంటే ఎక్కువ ఫలితాలు సాధించడం మంచి పరిణామం అని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ప్రస్తుతం పెద్ద మొత్తంలో ఉద్యోగాల భర్తీ చేస్తున్నదని, పోటీ పరీక్షల కోసం కష్టపడుతున్న అభ్యర్థులందరికి మీ విజయం నూతనోత్సాహాన్ని అందిస్తుందని చెప్పారు. సివిల్స్ విజేతలతో దాదాపు గంట సమయం మాట్లాడిన మంత్రి హరీశ్ రావు, విజేతల కుటుంబ నేపథ్యం, ప్రిపరేషన్ తీరు, ఎదుర్కొన్న సవాళ్లు తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు.