హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి అరెస్ట్ పై తెలంగాణ మంత్రి తన్నీరు హరీశ్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు అరెస్ట్‌ను ఆంధ్రప్రదేశ్‌లో రెండు రాజకీయ పార్టీల మధ్య ఘర్షణగా మంత్రి హరీశ్‌రావు అభివర్ణించారు. ఈ విషయంలో బీఆర్‌ఎస్ ప్రమేయం లేదని ఆయన ఉద్ఘాటించారు. ఒక న్యూస్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో, చట్టం తన పనిని అనుసరిస్తుందని పునరుద్ఘాటించారు. ఈ సందర్భంగా మంత్రి బిజెపిపై మండిపడ్డారు. మాట నిలబెట్టుకోని పార్టీ బిజెపి అన్నారు. ఓటమి భయంతోనే బిజెపి జమిలికి ప్లాన్ చేస్తున్నట్లు మంత్రి ఆరోపించారు. జనాన్ని నమ్ముకున్న బిఆర్ఎస్ కు జమిలితో నష్టం లేదన్నారు.
ఎన్నికలు ఎప్పుడు వచ్చిన మేం సిద్ధం అన్నారు మంత్రి హరీశ్. కుట్రతోనే కవితను బిజెపి ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నిస్తోందన్నారు. ప్రజలను మోసం చేసిన పార్టీ కాంగ్రెస్ అని ఆయన పేర్కొన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ను నమ్మే పరిస్థితి లేదన్నారు. అటు చంద్రబాబు అరెస్ట్‌కు వ్యతిరేకంగా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో నిరసనలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌లోని విప్రో సర్కిల్‌లో ఐటీ ఉద్యోగులు బుధవారం పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. చంద్రబాబుపై వైఎస్ఆర్సిపి చర్యలను ఖండిస్తూ టెక్ నిపుణులు టిడిపి అధినేతకు మద్దతుగా వీధుల్లోకి వచ్చారు.