సిద్దిపేట జిల్లా: సిద్దిపేట కేంద్రంలోని పోలీస్ కన్వెన్షన్ హాల్ లో టీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న రాష్త్ర వైద్య ఆరోగ్య, ఆర్ధిక శాఖ మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ… బిజెపి నాయకులకు ఒక శాపం ఉన్నట్టున్నది. నిజం మాట్లాడితే వాళ్ల తల వేయి ముక్కలవుతుందనే శాపం ఉన్నట్లుంది. అందుకే వాళ్లు అబద్ధం తప్ప నిజం మాట్లాడరు. నిన్న పాలమూరు మీటింగులో బిజెపి జాతీయ అధ్యక్షుడు నడ్డా గారు అబద్ధాల పురాణం మరోసారి చదివి పోయిన్రు. బిజెపి మంత్రులకు, బిజెపి నాయకులకు మధ్య సమన్వయ లోపం బయటపడింది. కేంద్ర బిజెపిలో ఆధిపత్య పోరు కూడా ఉన్నట్లు కనిపిస్తున్నది. గడ్కరీ, ఇతర మంత్రులు ఒక మాట చెపితే, నాయకులు మరో మాట చెబుతున్నారు. బిజెపిది పార్లమెంటులో ఓ మాట, పాలమూరులో ఇంకో పాట. నిన్న నడ్డా గారు ప్రధానంగా ఐదు విషయాలు ప్రస్తావించారు.
మీ ముందు బీజేపీ అబద్ధాల పురాణం మీ ముందు ఉంచుతున్నా…
1. కాళేశ్వరం ద్వారా ఒక్క ఎకరానికి నీరు రాలేదు
2. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగింది
3. కేంద్ర పథకాలను రాష్ట్ర పథకాలుగా ప్రచారం చేసుకుంటున్నరు
4. బిజెపి అధికారంలోకి వస్తే పాలమూరు ప్రాజెక్టులు పూర్తి చేస్తాం
ఇవన్నీ అబద్ధాలే….
కాళేశ్వరం ద్వారా ఒక్క ఎకరానికి నీరు రాలేదు. నేను నడ్డాని కోరుతున్న. మేమే ఖర్చులు భరిస్తాం. రాష్ట్రమంతా తిప్పుతాం. మీరే నేరుగా రైతులతో మాట్లాడండి. తెలంగాణలో 33 జిల్లాలుంటే దాదాపు 20 జిల్లాల ప్రజల సాగునీటి, తాగునీటి అవసరాలను కాళేశ్వరం ప్రాజెక్టు తీర్చుతుంది. క్షేత్ర పర్యటన చేసి నిజా నిజాలు తేల్చడానికి మేము సిద్ధం. రావడానికి మీరు సిద్ధమా? అని ప్రశ్నించారు.
– నడ్డా వస్తారో.. ఎవరు వస్తారో రండి… మా సిద్దిపేట
– నేను చెప్ప మా రైతులు చెపుతారు..
ఎక్కడో ఎందుకు మా సిద్దిపేట కు వచ్చి చుడు.. 50 గ్రామాల్లో కాళేశ్వరం నీళ్లు చూపిస్తాం.. పంట పొలాల్లో… కాలువల్లో గళ గళ పారుతున్న గోదావరి జలాల గురించి నేను కాదు మా మా రైతు లు చెపుతారు. బిజెపి రాష్ట్ర నాయకులు అవగాహన లేకుండా, అక్కసుతో రాసిచ్చిన స్క్రిప్టును చదివి అభాసు పాలు కావడం కన్నా గ్రామాల్లో పర్యటించి నిజాలు తెలుసుకుని మాట్లాడితే మీ లాంటి ఢిల్లీ నాయకులకు గౌరవంగా ఉంటుంది. నడ్డా గారి అబద్ధాలు, అంతకు రెండు రోజుల ముందే కేంద్ర మంత్రి గడ్కరీ గా ప్రశంసలు చూస్తుంటే, కేంద్ర మంత్రులకు, బిజెపి నాయకులకు మధ్య సమన్వయం లోపం, సమాచార లోపం చాలా స్పష్టంగా కనిపిస్తున్నది. ఇద్దరూ వేర్వేరుగా మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా తెలంగాణ సస్యశ్యామలం అవుతున్నదని, తెలంగాణ దేశానికే గ్రోత్ ఇంజిన్ అని గడ్కరీ ప్రశంసిస్తే, నడ్డా గారు అడ్డదిడ్డం మాట్లాడారు. గడ్కరీ కేంద్ర మంత్రి మాత్రమే కాదు, బిజెపికి చాలా కాలం అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. మరి నడ్డా, గడ్కరీ మాటలను ఖండించినట్లా? అని అన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగింది. టిఆర్ఎస్ పార్టీకి ఏటిఎంలా మారింది అని నోటికొచ్చినట్లు మాట్లాడిన్రు. దీనికి అసలు మేము సమాధానం చెప్పాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే సాక్షాత్తూ కేంద్ర జలశక్తి మంత్రి బిశ్వేశ్వర్ తుడు నిండు పార్లమెంటులోనే చాలా స్పష్టంగా చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టులో ఎలాంటి అవినీతి, అక్రమాలు జరగలేదు. అన్నీ పారదర్శకంగా జరిగాయి అని కేంద్ర మంత్రి చెప్పారు. మరి కేంద్ర మంత్రి గారు అవినీతి లేదు అంటే, బిజెపి నాయకులు మాత్రం అవినీతి అంటున్నారు. మంత్రిదో మాట, బిజెపి అధ్యక్షుడిదో మాట. పార్లమెంటులో ఓ మాట, పాలమూరులో ఓ పాట పాడుతున్నారని మంత్రి హరీశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేంద్ర పథకాలను రాష్ట్ర పథకాలుగా ప్రచారం చేసుకుంటున్నామట. ఇంతకంటే అధ్వాన్నమైన ఆత్మవంచన మరోటి లేదు. ఆత్మవంచన చేసుకోవడంలో బిజెపి నాయకులు ఒకరితో ఒకరు పోటీ పడుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం దాదాపు 600 కార్యక్రమాలు అమలు చేస్తున్నది. మీ కేంద్ర ప్రభుత్వం కనీసం 60 కార్యక్రమాలైనా అమలు చేస్తున్నదా? మీ బిజెపి పాలిత రాష్ట్రాల్లో వాటిలో సగమైనా అమలవతున్నాయా? ఏ రాష్ట్రానికైనా పోయి క్షేత్ర పర్యటన చేద్దాం.కేంద్ర పథకాలను రాష్ట్ర పథకాలుగా ప్రచారం చేసుకుంటున్నారని చెబుతున్నారు కదా? చెప్పండి మా పథకాల్లో మీ వాటా ఎంతో చెప్పండి.
– కాళేశ్వరం ప్రాజెక్టుకు మీరు ఎన్ని నిధులు ఇచ్చారు?
– పాలమూరు ప్రాజెక్టుకు ఎన్ని నిధులు ఇచ్చారు?
– మిషన్ భగీరథలో మీ సాయం ఎంత?
– రైతుబంధులో మీ వాటా ఎంత?
– రైతు బీమా కోసం మీరు ఎన్ని డబ్బులు ఇచ్చారు?
– వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇవ్వడానికి మీరు పెట్టిన ఖర్చు ఎంత?
– ఆడపిల్ల పెండ్లి కి ఇచ్చే లక్ష రూపాయాలు కల్యాణ లక్మి పథకానికి మీరు ఏమైనా ఇచ్చారా? రాష్ట్రంలో 10 లక్షల మందికి ఇస్తున్నాం..- కేసీఆర్ కిట్స్ లో మీరు ఏమైనా ఇచ్చారా?- దళిత బంధు పథకంలో మీరు భాగస్వామ్యం తీసుకున్నారా? – పొద్దున లేస్తే మత ఘర్షణలు పెడతారు కదా? దేవుడిపై మీకే భక్తి ఉన్నట్లు చెబుతారు కదా? యాదాద్రి అభివృద్దికి మీరు ఎన్ని డబ్బులు ఇచ్చారు. అసలు తెలంగాణలో ఏ గుడికైనా మీరు ఒక్క రూపాయి ఇచ్చారా? వీటికి సమాధానం చెప్పాలని నేను డిమాండ్ చేస్తున్నాను. – తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే పథకాలకు కేంద్రం నుంచి వచ్చే సాయం సున్నా. అయినా సరే గప్పాలు కొట్టడం తగదు. తెలంగాణ రాష్ట్రానికి అదనంగా ఎలాంటి సాయం చేయకపోగా, మన రాష్ట్రానికి రావాల్సిన న్యాయమైన, రాజ్యాంగపరమైన నిధులు కూడా కేటాయించడం లేదు. గతంలోనే అనేకసార్లు చెప్పాం. మన రాష్ట్రం నుంచి పోతున్నది ఎంత? మనకు తిరిగి వస్తున్నది ఎంత? దీనికి సమాధానం లేదు. రాష్ట్రం కేంద్రానికి ఇస్తున్నదా? కేంద్రం రాష్ట్రానికి ఇస్తున్నదా? లెక్కలు కావాలంటే మీకు పంపుతాం. మీ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ను అడిగినా చెబుతారు. అంటే కేంద్రానికి ఒక నీతి… రాష్టానికి ఒక నీతి నా… వాళ్ళు తప్పులు … రాష్ట్రాలకు పరిమితుల అని మంత్రి ఫైర్ అయ్యారు. నిధులు ఇవ్వకపోగా, తెలంగాణ రాష్ట్రానికి రాజ్యాంగబద్ధంగా, న్యాయంగా రావాల్సిన అప్పులను కూడా ఆపుతూ, ఆర్.బి.ఐ.ని ప్రభావితం చేస్తూ రాష్ట్ర ప్రగతిని అడ్డుకుంటున్నది కేంద్ర ప్రభుత్వం. బిజెపి ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వంపై కక్ష కట్టినట్లు వ్యవహరిస్తున్నది. పరిమితికి లోబడి అప్పులు చేస్తున్న తెలంగాణ రాష్ట్రానికి నయాపైసా పుట్టకుండా కుట్రలు చేస్తున్న బిజెపి ప్రభుత్వం, అదే తమ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలకు మాత్రం పరిమితికి మించి రుణాలు అందేలా చూస్తున్నది. సాక్షాత్తూ కేంద్ర ప్రభుత్వమే ఆర్.బి.ఐ. నుంచి నేరుగా నిధులు తీసుకున్నది.
బిజెపి అధికారంలోకి వస్తే పాలమూరు ప్రాజెక్టులు పూర్తి చేస్తాం అని నడ్డా అన్నారు. ఇదే పాలమూరులో 2014 ఎన్నికల సభలో నరేంద్ర మోడీ మాట్లాడారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు కట్టకుండా సోనియా-రాహుల్ (తల్లీ కొడుకులు) పదేళ్లు నిద్రపోయారు. మేము అధికారంలోకి వస్తే పాలమూరు పూర్తి చేస్తాం అని మోడీ చెప్పారు. బిజెపి ఎన్నికల మానిఫెస్టోలో కూడా రాశారు. బిజెపి కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. కానీ పాలమూరు ప్రాజెక్టులకు ఒక్క రూపాయయినా ఇచ్చారా?- అదే పాలమూరుకు సరిహద్దున ఉన్న ఆంధ్రప్రదేశ్ లో పోలవరం జాతీయ ప్రాజెక్టుకు నిధులు ఇచ్చారు. పక్కనే ఉన్న కర్ణాటకలో అప్పర్ బద్ర జాతీయ ప్రాజెక్టు చేపట్టి నిధులు ఇచ్చారు. ఆ పక్కనే ఉన్న బుందేల్ ఖాండ్ మరియు కెన్ బెత్వా ప్రాజెక్టు నిధులు ఇచ్చారు. తెలంగాణలో మీరు హామీ ఇచ్చిన ప్రాజెక్టుకు ఎందుకు నిధులు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. అధికారంలోకి వస్తే అంటున్నారు. నడ్డా, ఇప్పుడు కేంద్రంలో ఉన్నది మీ ప్రభుత్వమే. మీరు అధికార పార్టీలోనే ఉన్నారు. మీకు మంత్రివర్గంలో చోటు లేనంత మాత్రమే ప్రతిపక్షంలో ఉన్నట్లు భావించవద్దు. పాలమూరుపై నిజంగా చిత్తశుద్ధి ఉంటే, పాలమూరు ప్రాజెక్టులకు ఎన్ని నిధులు తీసుకొస్తారో చెప్పాలి. మాటలు కోటలు దాటినా, చేతలు కడప దాటవనే సామెత బిజెపి నాయకులకు సరిగ్గా సరిపోతుందని మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు.