* మండుటెండల్లో సైతం మత్తళ్లు
* వరి వేద సాగు పద్దతిని పోత్సహించాలి
* త్వరలో పేదలకు కొత్త రేషన్ కార్డులు
* కరోనా సమయంలో రైతులకు అండగా నిలిచాం: రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు
దుబ్బాక (మిరుదొడ్డి): వాన చినుకు భూమిపై పడకముందే రైతులకు రైతుబంధు ఇచ్చిన ఘనత సిఎం కెసిఆర్‌కే దక్కుతుందని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. బుధవారం మిరుదొడ్డి మండల కేంద్రంలో నూతన వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలక వర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఎంపి కొత్త ప్రభాకర్‌రెడ్డితో కలిసి ఆయన పాల్గొని మాట్లాడారు. దేశానికి అన్నం పెట్టిన ఘనత టిఆర్‌ఎస్ పార్టీదేనన్నారు. మండుటెండల్లో సైతం కూడవెల్లి వాగు ప్రవహిస్తుందని కలలో కూడా ఊహించలేదన్నారు. భూమికి బరువు అయ్యేంత పంట పండించేందుకు రాష్ట్ర సర్కార్ కృషి చేస్తుందన్నారు. బీహార్, ఛత్తీస్‌గఢ్, యుపి రాష్ట్రాల నుండి కూలీలు తెలంగాణకు వచ్చి వ్యవసాయ పనులు చేసే పరిస్థితికి చేరుకున్నామన్నారు. పంజాబ్, హర్యాణా కంటే వ్యవసాయ రంగంలో మన రాష్ట్రం ముందుందన్నారు.
కరోనా సమయంలో సైతం రైతులకు టిఆర్‌ఎస్ సర్కార్ అండగా నిలిచిందన్నారు. వెదజల్లే పద్దతిలో వరిసాగు, ఆయిల్ ఫామ్ పంటలను రైతులు ప్రోత్సహించాలన్నారు. దీంతో అధిక దిగుబడులు వస్తాయన్నారు. త్వరలో పేదలకు కొత్త రేషన్ కార్డులు అందించబోతున్నామన్నారు. అలాగే నాయి బ్రాహ్మణ, రజకులకు ఉచిత కరెంట్ సబ్సిడీని ఇస్తున్నామన్నారు. దుబ్బాక నియోజకవర్గంలో 15 రోజుల్లో ఎస్సీ, ఎస్టీ కమ్యూనిటీ భవనాలు పూర్తయ్యేలా నిధులు మంజూరు చేస్తామన్నారు. త్వరలో ధాన్యం నిల్వల కోసం గోదాములు నిర్మిస్తున్నామన్నారు. నూతన వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలక వర్గం రైతులకు సేవలందించి మంచి పేరు తెచ్చుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ ఛైర్‌పర్సన్ వేలేటి రోజా రాధాకృష్ణశర్మ, జడ్పీటీసీలు లక్ష్మి లింగం, కడతల రవీందర్‌రెడ్డి, ఎంపీపీ గజ్జెల సాయిలు, టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి బక్కి వెంకటయ్య, ప్రజాప్రతినిధులు, నాయకులు రొట్టె రాజమౌళి తదితరులు పాల్గొన్నారు.