Saturday, November 23, 2024

తెలంగాణను అస్థిర పరచేందుకు ద్రోహులు వస్తున్నారు జాగ్రత్త

- Advertisement -
- Advertisement -

గజ్వేల్ : తెలంగాణను అస్థిర పరచేందుకు ద్రోహులు అవకాశం కోసం ఎదురు చూస్తున్నారని అలాంటి వారికి ఏ మాత్రం అవకాశం ఇచ్చినా మళ్లీ తెలంగాణ ఆగమై పోతుందని రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్‌రావు అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ సమీకృత కార్యాలయంలోని గడా కార్యాలయంలో శనివారం కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు మంత్రి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ బిల్లు పెట్టకుండా చివరిదాకా అడ్డుకున్న చంద్ర బాబును చంకన పెట్టుకుని బిజెపి అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, తెలంగాణ వస్తే రాష్ట్రం చీకటవుతుందన్న మాజీ సిఎం కిరణ్‌కుమార్‌రెడ్డితో కలిసి రేవంత్‌రెడ్డిలతో దోస్తీ కట్టి కొత్త కుట్రలకు తెరలేపాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇప్పుడిప్పుడే పచ్చబడుతున్న తెలంగాణ ఇలాంటి సమైక్యవాదుల అండతో అటు బిజెపి ఇటు కాంగ్రెస్ పార్టీలు ప్రయత్నించటంపై తెలంగాణ సమాజం ఆలోచించాలని ఆయన అన్నారు.

రైతు వ్యతిరేక చట్టాలతో వేలాది మంది రైతుల చావుకు బిజెపి కారణమైందని, మూడు గంటల కరెంటు చాలని తెలంగాణ రైతులకు శాపంగా కాంగ్రెస్ పార్టీ మారిందని ఈ రెండు పార్టీల వైఖరిపై మంత్రి హరీష్ రావు విరుచుకు పడ్డారు. బిజెపి కిషన్ రెడ్డి కి కిరణ్‌కుమార్ రెడ్డిల సహకారం, రేవంత్‌రెడ్డికి చంద్ర బాబు ఉపకారం ఉంటే మన కెసిఆర్‌కు తెలంగాణ సమాజమే సహాయం, సహకారం ఉందని మంత్రి స్పష్టం చేశారు. తమకు కెసిఆర్ పాలన పదేళ్లు కాదు పదేపదే కావాలని తెలంగాణ సమాజం నినదిస్తున్నదని ఆయన అన్నారు. మూడు గంటల కరెంటు అన్న పార్టీని తరిమి కొట్టాలంటే ముచ్చటగా మూడోసారి కెసిఆర్‌ను గెలిపించుకోవాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారన్నారు. తెలంగాణ పాలిట కాంగ్రెస్, బిజెపిలది కక్షే కానీ కెసిఆరే మనకు రక్ష అని మంత్రి అన్నారు. అన్ని సమయాల్లో మనకు అండగా ఉన్న కెసిఆర్‌కు ఎన్నికల సమయంలో మనం అండగా ఉండాలని తెలంగాణ సమాజం అంటున్నదని ఆయన తెలిపారు.

ఈ పదేళ్ల కాలంలో ఏదీ ఆగలేదని, అభివృద్ధివేగమైందే తప్ప ఆగమైంది ఏమీ లేదు, అన్నింటికీ ఆసరా అయిన సిఎం కెసిఆర్‌కు ఎన్నికల్లో మనం అండగా ఉండాలా వద్దా? అని సమావేశానికి హాజరైన ప్రజలను ఆయన ప్రశ్నించారు. 2014లో తెలంగాణ ఏర్పడగానే చంద్రబాబు ప్రోద్భలంతో రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలను కొని పసిగుడ్డు లాంటి ప్రభుత్వాన్ని చంపాలని చూశాడని మంత్రి చెప్పారు. అలాగే బిజెపి వాళ్లు కూడా ఎమ్మెల్యేలను కొనాలనుకుని అడ్డంగా దొరికి పోయారని ఆయన అన్నారు. ఈ విధంగా తెలంగాణను అస్థిర పరచేందుకు ఈ అవకాశవాదులు అవకాశం కోసం ఎదురు చూస్తున్నారని వారికి ఎలాంటి అవకాశం తెలంగాణ సమాజం ఇవ్వద్దని మంత్రి హరీష్ రావు కోరారు. అప్పుడు రాష్ట్ర ఉద్యమాన్ని విచ్ఛిన్నం చేయాలనుకున్నారు, ఇప్పుడిపుడే పచ్చబడుతున్న రైతుల జీవితాల్లో కరెంటు కల్లోలం రేపారని ఆయన అన్నారు.

రైతులు మూడు పంటలు పండించి బాగుండాలని కెసిఆర్ అనుకుంటే మూడు గంటలు కరెంటు ఇచ్చి రైతులను ముంచాలని కాంగ్రెస్ ఆలోచిస్తోందని ఆయన ఆరోపించారు. ప్రతిపక్షంలో ఉన్నపుడే మూడు గంటలు కరెంటు అన్న వాడు రేపు పొరపాటున అధికారం వస్త్తే తన వాదననే రైతులు బలపరిచారని మూడు నిమిషాలు కూడా ఇవ్వడేమో ప్రజలు ఆలోచించాలన్నారు. తెలంగాణకు శాపం లా ంటి బిజపి పాపం చేసిన కాంగ్రెస్ లాంటి పార్టీలు తెలంగాణ రాష్ట్రానికి అవసరమా అన్నది ప్రజలు ఇపుడు చర్చించుకోవాల్సిన అంశమని మంత్రి చెప్పారు. తెలంగాణ ప్రజలకు బిజెపి కొత్తగా ఏ హామీ ఇచ్చినా దాన్ని కేంద్రంలో అమలు చేయాలని, కాంగ్రెస్ ఏం హామీ ఇచ్చినా దాన్ని కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో అమలు చేయాలని ఈ సందర్భంగా ఆ పార్టీలకు మంత్రి హరీష్ రావు విసిరారు.

అంతకు ముందు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ , సిఎంఆర్‌ఎఫ్ లబ్ధిదారులకు చెక్కులను, దీపదూప నైవేధ్యం ప్రోసీడింగ్స్‌ను పూజారులకు మంత్రి అందజేశారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా పరిషత్ ఛైర్మన్ రోజా రాధాక్రిష్ణ శర్మ, కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, ఎమ్మెల్సీ డా. యాదవరెడ్డి, ఎఫ్‌డిసి ఛైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి, డిసిసిబి ఛైర్మన్ చిట్టి దేవేందర్‌రెడ్డి, గ్రంధాలయ సంస్థ ఛైర్మన్ లక్కిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, స్థానిక మున్సిపల్ ఛైర్మన్ ఎన్సీ రాజమౌళి, గజ్వేల్ మార్కెట్ కమిటీ ఛైర్మన్ మాదాసు శ్రీనివాస్, గడా ప్రత్యేక అధికారి ముత్యం రెడ్డి, ఆర్డీఓ బన్సీలాల్ తహశీల్దార్ బాలరాజు పలువురు జడ్పీటిసిలు, ఎంపిపిలు, మున్సిపల్ కౌన్సిలర్లు ఇతర ప్రజాప్రతినిధులు, బిఆర్‌ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News