Sunday, January 19, 2025

విపక్షాలకు అజెండా లేదు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ : తెలంగాణ బిడ్డను ఓడించడానికి రాష్ట్రంలో కాంగ్రె స్, బిజెపి పార్టీలు ఒకటయ్యాయని బిఆర్‌ఎస్ పా ర్టీ అగ్రనాయకులు, మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. మూడు ఉప ఎన్నికల్లో డిపాజిట్ కోల్పోయిన కాంగ్రెస్‌కు ఇప్పుడు బిజెపి సహకరిస్తోందని ఆరోపించారు. మళ్లీ బిజెపి, బిఆర్‌ఎస్ ఒక్కటేనని బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని, మైనార్టీల ఓట్ల కోసమే తమపై కాంగ్రెస్ ఈ విధమైన దుష్ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. బిజెపి, బిఆర్‌ఎస్ ఒక్కటే అయితే గవర్నర్ తమకు సహకరించే వారు అని, ఆర్‌టిసి బిల్లు అంతా సిద్ధంగా ఉందని, గవర్నర్ ఆలస్యం చేయడం వల్ల ఆగిపోయిందని చెప్పారు. ఇప్పుడైనా ఇసి ఒప్పుకుంటే ప్రభుత్వంలో కలిపేస్తామం లేదా మళ్లీ ప్రభుత్వం ఏర్పడగానే విలీనం చేస్తామని తెలిపారు. ఏడు మండలాలు బిల్లు తె చ్చింది బిజెపి, మద్దతు ఇచ్చింది కాంగ్రెస్ అని,

సీలేరు పవర్ ప్రాజెక్ట్ బిల్లు తెచ్చింది బిజెపి.. మద్దతు ఇచ్చింది కాంగ్రెస్ అని పేర్కొన్నారు. నూకలు బు క్కుమని  కేంద్ర మంత్రి అవమానిస్తే మేము ఢిల్లీకి వెళ్లి ధర్నా చేస్తే.. కాంగ్రెస్ కనీసం ఖండించలేదని విమర్శించారు. 2023 శాసనసభ ఎన్నికలను పురస్కరించుకొని ఆయా ప్రధాన రాజకీయ పార్టీల ముఖ్య బాధ్యులతో తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం బుధవారం బషీర్‌బాగ్‌లోని యూనియన్ కార్యాలయంలో భారత రాష్ట్ర సమితి(బిఆర్‌ఎస్) పార్టీ అగ్రనాయకులు, రాష్ట్ర ఆర్ధిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావుతో మీట్ ది ప్రెస్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఐజెయు జాతీయ అధ్యక్షులు కె.శ్రీనివాస్ రెడ్డి సమన్వయకర్తగా వ్యవహరించగా, టియుడబ్ల్యూజె రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. విరాహత్ అలీ తదితరులు పాల్గొన్నారు.
ప్రతిపక్షాలకు అజెండా లేకనే అసభ్యపదజాలంతో దూషణలు
ప్రతిపక్షాలకు అజెండా లేక బిఆర్‌ఎస్‌ను అసభ్యపదజాలంతో దూషిస్తున్నారని.. ప్రజలకు బూతులు మాట్లాడే నాయకులు కాదు.. భవిష్యత్తు కోరే నాయకులు కావాలని పేర్కొన్నారు. బూతులు మాట్లాడే నాయకులకు.. ప్రజలు పోలింగ్ బూతుల్లోనే సమాధానం చెబుతారని అన్నారు. పక్క రాష్ట్రాలకు అన్నంపెట్టే ధాన్యాగారంగా తెలంగాణ మారిందని తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం 10 వేల ఎంబిబిఎస్ సీట్లు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ప్రతి జిల్లాకు ఒక వైద్య కళాశాల ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. కాంగ్రెస్ హయాంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో 30 శాతం ప్రసవాలు జరిగేవని .. ప్రస్తుతం ప్రభుత్వ ఆస్పత్రుల్లో 76 శాతం ప్రసవాలు జరుగుతున్నాయని వెల్లడించారు. గ్రామాల్లో దవాఖానాలు, ప్రతి జిల్లా, నగరాల్లోని ఆస్పత్రులను అభివృద్ధి చేస్తున్నామని, మాతాశిశు మరణాలు తగ్గుముఖం పట్టాయని చెప్పారు.

విద్యారంగంపై ప్రత్యేక దృష్టి
విద్యారంగంపై బిఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. మన ఊరు- మన బడి పథకం ద్వారా పాఠశాలల రూపురేఖలు మారుస్తున్నామని తెలిపారు. విద్యలో గుణాత్మక మార్పు తీసుకొచ్చామని చెప్పారు. ఇంగ్లీష్ మీడియంలో బోధన, కార్పొరేట్ స్థాయి వసతులను ప్రభుత్వ పాఠశాల్లో కల్పిస్తున్నామన్నారు. గురుకుల పాఠశాలలను జూనియర్ కళాశాలలుగా తీర్చిదిద్దామని పేర్కొన్నారు. విద్య అంటే చాలా మంది స్కూళ్లు, విద్యా శాఖ బడ్జెట్ మాత్రమే చూస్తారు… కానీ.. వైద్య శాఖ ద్వారా మెడికల్ కాలేజీలు, ఫారెస్ట్ యూనివర్సిటీ, హర్టికల్చర్ యూనివర్సిటీ, ఫిషరీస్ యూనివర్సిటీ వంటివి కూడా విద్యకు చేసే ఖర్చుగా చూడాలని చెప్పారు.

రాష్ట్రంలో వైద్య రంగాన్ని బలోపేతం చేశామని, అన్ని స్థాయిల దవాఖానల్లో సదుపాయాలు కల్పించామని తెలిపారు. జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ తెచ్చామని పేర్కొన్నారు. ఫలితంగా ఒకప్పుడు నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అనే స్థాయి నుండి పోదాం పద బిడ్డో సర్కారు దవాఖానకు అనే పరిస్థితి వచ్చిందని చెప్పారు. మళ్ళీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విద్య, వైద్య రంగాలను మరింత బలోపేతం చేయడంతో పాటు హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో వసతుల కల్పనపై దృష్టి పెట్టాలని భావిస్తున్నామని వ్యాఖ్యానించారు.
మళ్లీ ఆరోగ్య శాఖ మంత్రిగా చేయాలని ఉంది
తాను సిఎం కెసిఆర్ ఆధ్వర్యంలో పనిచేసే నిఖార్సయిన కార్యకర్తను అని మంత్రి హరీశ్‌రావు పునరుద్ఘాంటించారు. పార్టీ తనకు ఏ బాధ్యత అప్పగించినా చేస్తానని అన్నారు. రాబోయే ప్రభుత్వంలో మరోసారి వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పదవి చేపట్టాలని ఉందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ప్రజలకు ఎక్కువ సేవ చేసే అవకాశం ఆత్మసంతృప్తి ఆ శాఖలో ఉందని వ్యాఖ్యానించారు.
నియామకాలపై ప్రతిపక్షాలు బురదజల్లే ప్రయత్నం చేస్తున్నాయి
ఉద్యోగ నియామకాల విషయంపై ప్రతిపక్షాలు బురదజల్లే ప్రయత్నం చేస్తున్నాయని మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. మన ఉద్యోగాలు మన పిల్లలకు దక్కాలనే ఉద్దేశంతో 95 శాతం ఉద్యోగాలు స్థానికులకు దక్కేలా రాష్ట్రపతి ఉత్తర్వుల సవరణ తీసుకొచ్చామని తెలిపారు.నియామకాలలో ఇప్పటివరకు 1.32 లక్షల ఉద్యోగాలు భర్తీ చేశామని, మరో 80 వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతోందని పేర్కొన్నారు.భవిష్యత్తులో జాబ్ క్యాలెండర్ అమలు చేసి ఏ ఏడాది ఉద్యోగాలు ఆ ఏడాదే భర్తీ చేస్తామని తెలిపారు. దురదృష్టవశాత్తూ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో పేపర్ లీక్ జరిగిందని, వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకొని బాధ్యులపై చర్యలు చేపట్టి.. దోషులను శిక్షించామని చెప్పారు.

అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని కర్ణాటకలో రాహుల్ చెప్పారని, కానీ ఇప్పటివరకు ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదని పేర్కొన్నారు. తమ ప్రభుత్వ హయాంలో ప్రైవేట్ పరంగా 24 లక్షల ఉద్యోగాలు, ఐటీ రంగంలో 6 లక్షల ఉద్యోగాలు కల్పించామని తెలిపారు. ఐటీ ఉత్పత్తుల్లో, ఐటీ ఉద్యోగాల కల్పనలో తెలంగాణ మొదటి స్థానంలో ఉందని, ప్రభుత్వ విధానాల వల్లే ఇది సాధ్యమైందని స్పష్టం చేశారు. ఐటీ రంగంలో ఒకప్పుడు బెంగళూరు సిలికాన్ వ్యాలీగా ఉండేదని, ఇప్పుడు ఐటీ ఉత్పత్తుల ఎగుమతిలో రాష్ట్రం నంబర్‌వన్‌గా మారిందని అన్నారు. గూగుల్, యాపిల్, మైక్రోసాఫ్ట్ వంటి పేరుమోసిన కంపెనీలు ఇక్కడ అతి పెద్ద క్యాంపస్‌లను ఏర్పాటు చేసుకున్నాయని పేర్కొన్నారు.

కాళేశ్వరం అంటే మేడిగడ్డ బ్యారేజీ ఒక్కటే కాదు
తెలంగాణ ఉద్యమ నినాదంలో నీళ్లను తెలంగాణ గడ్డ మీదికి నీళ్ళు మల్లించామని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. మేడిగడ్డ బ్యారేజీలో రెండు పిల్లర్లు కుంగితే కాళేశ్వరమే కుంగినట్లు విపక్షాలు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. కాళేశ్వరం అంటే మేడిగడ్డ బ్యారేజీ ఒక్కటే కాదని..
కాళేశ్వరం ప్రాజెక్టు అంటే ఒక బరాజు మాత్రమే కాదు అని, పంప్ హౌస్‌లో టన్నెల్ కాలువలు రిజర్వాయర్లు.. ఇలా కాళేశ్వరం అంటే ఒక పెద్ద వ్యవస్థ అని వ్యాఖ్యానించారు. ఈ విషయం తెలియక ప్రతిపక్షాలు కోడిగుడ్డు మీద ఈకలు పీకినట్టు హంగామా చేస్తున్నారని విమర్శించారు. పదేళ్ల కెసిఆర్ పాలనలో కరువు లేదు, కర్ఫ్యూ లేదు… కులం, మతం, ప్రాంత వివక్ష తెలంగాణలో లేదు…వాటర్ ట్యాంకర్లు లేవు, జనరేటర్ల సప్పుల్లు లేవు అని పేర్కొన్నారు.
పాజిటివ్ ఓటింగ్ తో మళ్ళీ అధికారంలోకి వస్తాం
పాజిటివ్ ఓటింగ్‌తో మళ్లీ అధికారంలోకి వస్తామని మంత్రి హరీశ్‌రావు ధీమా వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలకు ఎజెండా లేదు, కాబట్టే తమపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని విమర్శించారు. గతంలో తాగునీటిపై, విద్యుత్‌పై చర్చ జరిగిందని, ఇప్పుడు తామే వాటిని పరిష్కరించామని చెప్పారు. అప్పుల విషయంలో తెలంగాణ నియంత్రణలో ఉందని.. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు అత్యధిక వేతనాలు అందుతున్నాయని తెలిపారు. కాంగ్రెస్ ప్రవేశపెట్టిన కర్ణాటక మోడల్ ఫెయిల్ అయిందని ఆరోపించారు. బిజెపి అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలోనైనా రూ.2 వేలు పింఛను ఇస్తున్నారా..? అని ప్రశ్నించారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలో ప్రాంతీయ పార్టీల ప్రభావం ఉంటుందని జోస్యం చెప్పారు.

కెసిఆర్ చేతుల్లో రాష్ట్రం ఉండటం వల్లే సుభిక్షంగా ఉంది
సిఎం కెసిఆర్ చేతుల్లో రాష్ట్రం ఉండటం వల్లే సుభిక్షంగా ఉందని హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. అన్ని రంగాల్లో రాష్ట్రం అగ్రస్థానంలో ఉందని పేర్కొన్నారు. సిఎం కెసిఆర్ రాజీలేని పాలన సాగిస్తున్నారని చెప్పారు. కేంద్ర ఇచ్చే అవార్డుల్లో రాష్ట్రం అవార్డుల పంట పండిస్తోందని వెల్లడించారు. అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ దరిదాపుల్లో ఏ రాష్ట్రం లేదని అన్నారు. కేంద్రం ఇచ్చిన అవార్డులే కెసిఆర్ పాలనకు నిదర్శమని వ్యాఖ్యానించారు. మేనిఫెస్టోలో పెట్టిన 90 శాతం హమీలు అమలు చేశామని, ఎన్నికల్లో హామీ ఇవ్వకున్నా రైతుబంధు, రైతుబీమా అమలు చేశామని చెప్పారు. పట్టణాల్లో ఉండే సౌకర్యాలు అన్నీ గ్రామాల్లో అభివృద్ధి చేశామని తెలిపారు. కెసిఆర్ విజన్ కారణంగానే విద్యుత్ కొరతను అధిగమించామని, కోతలు లేకుండా వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నామని అన్నారు.

ఎన్నో రాష్ట్రాల్లో ఇప్పటికీ కోతలు అమలవుతున్నాయని, నాణ్యమైన విద్యుత్ ఇవ్వడంతో రైతులు అన్ని కాలాల్లో పంటలు పండించుకుంటున్నారు. కర్ణాటకలో 5 గంటల కరెంట్ ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని, కర్ణాటకలో ప్రస్తుతం రైతులకు 2 గంటల కరెంట్ కూడా ఇవ్వలేదని చెప్పారు. పల్లె కన్నీరు పెడుతోంది అనే పాటలు పాడుకునే పరిస్థితిపోయి.. పట్టణాల నుంచే పల్లెలకు వెళ్లి సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు సైతం సౌకర్యంగా తమ పనులు చేసుకునే స్థాయిలో అభివృద్ధి చేశామని చెప్పారు. నాటి కాంగ్రెస్ పాలనను నేటి కెసిఆర్ పాలనను బేరీజు వేసుకొని ప్రజలు ఓటెయ్యాలని కోరారు. రైతుబంధు కింద దాదాపు రూ. 72 వేల కోట్ల రూపాయలు నగదు బదిలీ జరిగిందని, భూగర్భ జలాలను పెంచడంతో కోటి మెట్రిక్ టన్నుల ధాన్యం పండే రాష్ట్రం మూడు కోట్ల మెట్రిక్ టన్నులు ధాన్యం పండే రాష్ట్రంగా మారిందని చెప్పారు. కర్ణాటక సహా ఇతర ప్రభుత్వాలు సైతం మన రాష్ట్రాన్ని దాన్యం అడిగే పరిస్థితి వచ్చిందని పేర్కొన్నారు.

హైదరాబాద్‌ను గ్లోబల్ సిటీగా అభివృద్ధి చేశాం
హైదరాబాద్‌ను గ్లోబల్ సిటీగా అభివృద్ధి చేశామని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. భాగ్యనగరానికి గ్రీన్ సిటీ అంతర్జాతీయ అవార్డు వచ్చిందని తెలిపారు. దక్షిణ భారతదేశంలో ఇంతవరకూ వరుసగా ఎవరూ మూడోసారి సిఎం కాలేదని.. కెసిఆర్ రికార్డు సృష్టిస్తారని ధీమా వ్యక్తం చేశారు.

ఉద్యమంలో నాపై 200 కేసులు
తెలంగాణ ఉద్యమంలో నాపై 200 కేసులు పెట్టారని హరీశ్‌రావు తెలిపారు. ఉద్యమ సమయంలో ఎక్కడా రాజీపడకుండా పదవులకు రాజీనామా చేశామని గుర్తు చేశారు. ఓటమి భయంతో కాంగ్రెస్ నేతలు అల్లర్లు చేస్తున్నారని ఆరోపించారు. గతంలో మహాకూటమి పేరుతో విపక్షాలు ప్రత్యక్షంగా తమ పార్టీతో తలపడ్డాయని, ప్రస్తుతం పరోక్షంగా అందరూ ఒకటయ్యారని అన్నారు. బోరు బావుల దగ్గర మీటర్లు పెట్టలేదని రూ.35 వేల కోట్ల నిధులను కేంద్రం నిలిపివేసిందని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. బిజెపిపై తాము పోరాటం చేస్తున్నామని, కేంద్రం తమ మీద కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతున్నదని పేర్కొన్నారు.
కాంగ్రెస్ మా మేనిఫెస్టోను కాపీ కొట్టింది
కాంగ్రెస్ తమ మేనిఫెస్టోను కాపీ కొట్టి, తమ పథకాలకు కొంత కలిపి ఎక్కువ ఇస్తామని చెప్పిందని హరీశ్‌రావు అన్నారు. కాంగ్రెస్‌ది ఎగవేసే చరిత్ర.. మాది ఇచ్చిన హామీ నెరవేర్చిన ఘనత అని హరీశ్‌రావు వ్యాఖ్యానించారు.

 

 

 

 

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News