రైతులను కారు ఎక్కించాలనే టిఆర్‌ఎస్‌కా,
వారిపై కారెక్కించాలనే బిజెపికా?
రైతులను ధనవంతులు చేయాలనుకుంటున్న కెసిఆర్ రైతులకు ఉరితాళ్ళు బిగిస్తున్న బిజెపి 50 వేల నుంచి లక్ష లోపు రైతు రుణాలు మాఫీ 6070 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తాం : మంత్రి తన్నీరు హరీష్‌రావు
మన తెలంగాణ/హుజూరాబాద్ : రైతులకు సంపద సృష్టించి కారులో ఎక్కించాలని చూసే టిఆర్‌ఎస్ పార్టీకి ఓటు వేస్తారో…రైతు సమస్యలపై అడిగినందుకు రైతులపై కార్లు ఎక్కించి చంపే బిజెపి పార్టీకి ఓటు వేస్తారో ఆలోచించుకోవాలని ఆర్ధిక శాఖ మంత్రి హరీష్‌రావు అన్నారు. సోమవారం మండలంలోని ఇందిరానగర్, శాలపల్లి, రంగాపూర్, కనుకులగిద్ద, జూపాక, రాజపల్లి, బొత్తలపల్లి, చెల్పూర్ గ్రామాలలో మంత్రి హరీష్ రావు ఎన్నికల ప్రచారం జరిగింది. ఈ ప్రచార సభలలో ఆయన మాట్లాడుతూ…ఈటల రాజేందర్‌పై నిప్పులు చెరిగారు. రైతుల పక్షపాతి అయిన కెసిఆర్ రైతులను ధనవంతులను చేయాలని చూస్తున్నారని, రైతు వ్యతిరేక ప్రభుత్వం అయినా బిజెపి రైతులకు ఉరితాళ్ళు బిగించాలని చూస్తుందని అన్నారు. రైతు సమస్యలపై పోరాటం చేస్తున్న రైతులపై ఏకంగా కారు ఎక్కించి చంపిన దుర్మార్గమైన ప్రభుత్వం బిజెపి అని అన్నారు. నడుమంతర ఎన్నికలు ఇవని, రెండున్నరేళ్లు టిఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంటుందని, సిఎంగా కెసిఆర్ ఉంటారని, ఆర్థిక మంత్రిగా తానుంటానని అన్నారు. 30న జరిగే ఎన్నికల తర్వాత ఏ పని జరగాలన్నా సీఎం ఆశీర్వాదంతో అభివృద్ది, సంక్షేమ పథకాలు వస్తాయని అన్నారు.
ఈటల రాజేందర్ పార్టీ బిజెపి ఢిల్లీలో ఉందని, టిర్‌ఎస్ పార్టీ రాష్ట్రంలో ఉందని, బిజెపి ధరలు పెంచుతుందని, టీఆర్‌ఎస్ పార్టీ సంపదను పెంచి పేదలకు పంచుతుందని అన్నారు. గ్యాస్ సిలిండర్ ధరను బిజేపి పార్టీ వెయ్యి రూపాయలు చేసి పేదలపై మోయలేని భారం వేసిందని, పెద్ద పెద్ద లోన్లు తీసుకున్న వ్యాపారవేత్తలకు లక్షల కోట్ల రుణాలు మాఫీ చేసిందని, రైతులకు చేసింది ఏమిలేదని అన్నారు. కేసీఆర్ 2016 రూపాయల పెన్షన్ ఇస్తున్నారని, బీజేపీ పాలిత రాష్ట్రాలలో ఎక్కడైనా 2వేల పెన్షన్ ఇస్తున్నారా అని ప్రశ్నించారు. దళిత బందు ఇచ్చినా, రైతు బంధు ఇచ్చినా కేసిఆర్ మాత్రమే ఇస్తాడని, శాలపల్లిలో రైతు బంధు సభలో ఈటల రాజేందర్‌ను తన తమ్ముడు అని మెచ్చుకున్న కేసిఆర్‌ను బొంద పెడతా అనడం, ఘోరీ కడతా అనడం ఎంత వరకు సమంజసమని అన్నారు.
కెసిఆర్ ను మోసం చేసిన ఈటల రాజేందర్‌కు ఈ ఎన్నికలలో బుద్ది చెప్పాలని కోరారు. నెలకు రెండు సార్లు ఇక్కడకు వచ్చి మీ పనులు చేయిస్తా, 50 వేల నుంచి లక్ష లోపు రుణాలు ఉగాది పండుగ తర్వాత వడ్డీతో సహా మాఫీ చేస్తామని, సొంత జాగలు ఉంటే ఇళ్లు కట్టిస్తామని, ఐదు లక్షల ఇళ్లు కట్టిస్తామని అన్నారు. మంత్రిగా పని చేసిన ఈటల రాజేందర్ ఇక్కడ ఒక్క ఇల్లు కూడా కట్టించలేదని, రేపు గెలిస్తే ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉండి మీకు ఏ విధంగా సహాయం చేస్తాడో ఆలోచించాలన్నారు. ఈ ప్రచార కార్యక్రమాలలో మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి, టిఆర్‌ఎస్ అభ్యర్ధి గెల్లు శ్రీనివాస్‌యాదవ్, ఎంపిపి ఇరుమల్ల రాణి సురేందర్‌రెడ్డి, టిఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.