Friday, December 20, 2024

రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై ట్విట్టర్ వేదికగా మంత్రి హరీష్ రావు ఆగ్రహం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై ట్విట్టర్ వేదికగా మంత్రి హరీష్ రావు ఆగ్రహం కనబర్చారు. రాహుల్ గాంధీ గారు..దేశాన్ని దోచుకున్న చరిత్ర మీది, అవినీతికి మారుపేరుగా మారిన పార్టీ మీది, అందుకే మీ పార్టీ పేరే స్కాంగ్రెస్‌గా మారిందని ఆరోపిం చారు. అందుకే దేశ ప్రజలు మిమ్మల్ని అధికారం నుంచి దించి మూలన కూర్చోబెట్టారని విమర్శించారు. బిఆర్‌ఎస్ ఎవరికీ బి టీం కాదు, మాది పేద ప్రజలకు ఎ టీం, ప్రజల సంక్షేమం చూసే ఎ క్లాస్ టీం అని పేర్కొన్నారు. బిజెపిని ఎదుర్కొనే సత్తా కాంగ్రెస్‌కు లేదన్నారు, అందుకే దేశాన్ని బిజెపి కబంద హస్తాల నుంచి కాపాడేందుకే బిఆర్‌ఎస్ పుట్టిందన్నారు.

రాష్ట్రంలో పొడు పట్టాల పంపిణీ కళ్లకు కనిపించలేదా..? మేం పట్టాలు పంచినంక మళ్లీ మీరెచ్చేదేంది? అప్‌డేట్ తెలుసుకోని ఔట్ డేటెడ్ పొలిటీషియన్ రాహుల్ గాంధీ అని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం ఖర్చు మొత్తం 80,321.57 కోట్లు అయితే, అవినీతి లక్ష కోట్లు అని అనడం పెద్ద జోక్‌గా అభివర్ణించారు. కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం ఖర్చు రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది అని, కేంద్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడ ఇవ్వలేదని మీ పార్టీ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్రం సమాధానం ఇచ్చిన విషయం తెలియదా? అని ప్రశ్నించారు.

స్కీమ్‌ల్లోని స్కాం ల్లో ఆరితేరిన కాంగ్రెస్ కుంభకోణాల గురించి మాట్లాడడం.. దెయ్యాలు వేదాలు వల్లించడం కాక మరేమిటి? అని అన్నారు. ‘అప్పుడే ముదిగొండ కాల్పులను మరిచిపోయారా? భూములు అడిగితే జైల్లో వేసిన వాళ్ళు, కరెంట్ అడుగుతే పిట్టల్లా కాల్చి చంపినోళ్లు ఖమ్మంలో కల్లిబొల్లి కబుర్లు చెప్తే నమ్మే వాళ్ళు ఎవరు లేరు, ఖమ్మం సభ ఒక్క ముక్కలో చెప్పాలంటే పసలేని ఆరోపణలు, ఊకదంపుడు ప్రసంగాలు.. రాసిచ్చిన స్క్రిప్ట్‌తో రాహుల్ స్కిట్’గా మంత్రి హరీష్‌రావు అభివర్ణించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News