Tuesday, November 5, 2024

సిసిఐ సాధన కమిటీ దీక్షా శిబిరాన్ని సందర్శించి మద్దతు తెలిపిన మంత్రి హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

Minister Harish Rao expressed support for CCI Sadhana Committee

ఆదిలాబాద్ : సిసిఐ సాధన కమిటీ దీక్షా శిబిరాన్ని సందర్శించి మంత్రి హరీష్ రావు మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మేల్యేలు జోగు రామన్న, బాపు రావు, ఎమ్మెల్సీ దండే విఠల్, ఇతర ప్రజా ప్రతినిధులు ఉన్నారు. ఈ సందర్బంగా కేంద్ర ప్రభుత్వ తీరుపై మంత్రి హరీశ్ రావు తీవ్రంగా మండి పడ్డారు. సీసీఐ విషయంలో ప్రభుత్వం అన్ని విధాలా సహకరించేందుకు సిద్దంగా ఉంది. పునరుద్ధరణ చేసేందుకు కేంద్రంలోని బిజెపి నేతలు మాత్రం మౌనంగా ఉన్నారు. బిజెపి నేతలు దమ్ముంటే సీసీఐ తెరిపించాలి. రాష్ట్ర ప్రభుత్వం తరుపున అన్ని రాయితీలు కల్పిస్తాం. సీసీఐ కోసం చేస్తున్న ఆందోళనకు టీఆరెఎస్ పార్టీ తరుపున పూర్తి మద్దతు ప్రకటిస్తున్నాము. రైతు వ్యతిరేకం, పేదల వ్యతిరేకం, ఉద్యోగుల వ్యతిరేకం, సాధారణ ప్రజల వ్యతిరేకం.. ఇలా అన్ని రకాల వర్గాలకు బిజెపి పాలన వ్యతిరేకం. ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కేంద్రంలోని బీజేపీ సర్కారుపై ప్రజల తిరుగుబాటు తప్పదు .

ఉద్యోగాలు.. ఉద్యోగాలు అని బీజేపీ నేత‌లు దొంగ జ‌పం చేస్తున్నారు. దొంగే దొంగ అంటున్న‌రు. అస‌లు ఉద్యోగాలు ఇచ్చింది ఎవ‌రు…? ఇవ్వంది ఎవరు..? నోటిఫికేష‌న్లు ఇచ్చింది ఎవ‌రు.. నోటిఫికేష‌న్లు ఇవ్వనిది ఎవ‌రు..? రాష్ట్రంలో నిరుద్యోగం ఎక్కువ ఉందా.. దేశంలో నిరుద్యోగం ఎక్కువ ఉందా….? బండి సంజ‌య్ అండ్ బ్యాచ్ ద‌మ్ముంటే స‌మాధానం చెప్పాలి.. గాలి మాట‌లు కాదు..ఉద్యోగాలు ఇస్తే గ‌ణాంకాలు చెప్పాలి…మీ బిజెపి హయాంలో దేశంలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలి. నోటికి వ‌చ్చిన‌ట్లు, ఇష్టం వ‌చ్చిన‌ట్లు మాట్లాడి త‌ప్పుడు ప్ర‌చారం చేస్తే ఉద్యోగాలు ఇచ్చిన‌ట్లు అవుతుందా.. నోటిఫికేష‌న్లు ఇచ్చిన‌ట్లు అవుతుందా… బీజేపీ పాల‌న‌లో దేశంలో నిరుద్యోగం ఎంత పెరిగిందో.. నిరుద్యోగ యువత ఎంత బాధ ప‌డుతుందో బండి సంజ‌య్ తెలుసుకోవాలి… తెలంగాణ ఏర్పాటు త‌ర్వాత నియామ‌కాలకు తెలంగాణ ప్ర‌భుత్వం అత్యంత ప్రాధాన్యం ఇచ్చింది. టీఎస్‌పీఎస్సీ, పోలీసు, సింగ‌రేణి, గురుకులాలు, విద్యుత్‌, మెడిక‌ల్ హెల్త్ త‌దిత‌ర విభాగాల్లో మొత్తం 1,32,899 ఉద్యోగాల‌ను ప్ర‌భుత్వం భ‌ర్తీ చేసింది. మ‌రో 50 నుంచి 60వేల పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు క‌స‌రత్తు చేస్తున్న‌ది. బిజేపీ నాయకులకు తెలంగాణలో ఉద్యోగ అవకాశాలు.. నోటిఫికేషన్ల గురించి మాట్లాడే హక్కు ఎక్కడిది.

బిజెపి ప్రభుత్వం నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నది. నిరుద్యోగ భారత్ గా చేస్తున్నది..ఈ విషయాన్ని ప్రముఖ విశ్లేషణ సంస్థలు వెల్లడిస్తున్నాయి ఈ ఏడాది జనవరి 20 న సీఎంఐఈ వెల్లడించింది. దేశంలో కోట్లాదిమంది నిరుద్యోగులు పొట్టచేత పట్టుకుని తిరుగుతున్నారు. గత నెల డిసెంబర్‌ నాటికి 5.3 కోట్ల మందికి ఉద్యోగం, ఉపాధి లేదని సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ (సీఎంఐఈ) తాజాగా తెలిపింది. జాతీయ నిరుద్యోగ శాతం కంటే తెలంగాణలో నిరుద్యోగ శాతం మూడు రెట్లు తక్కువ అని ఇది స్పష్టం చేసింది. దేశంలో నిరుద్యోగం శాత 7.91% ఉంటే తెలంగాణలో 2.2% మాత్రమే ఉంది అని వెల్లడించింది. నిరుద్యోగ రేటు తక్కువగా ఉన్న 5 రాష్ట్రాల్లో తెలంగాణ నాలుగో స్థానంలో నిలిచింది. పోనీ దేశంలో ఉద్యోగాలు ఖాళీ లేవా అంటే లేనట్టు కాదు.. కేంద్రం లెక్కల్లో 15 లక్షల 62 వేల 962 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి. అర్మీలో 2 లక్షలు, రైల్వేల్లో మూడు లక్షలు ఖాళీగా ఉన్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 41,177 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

కేంద్రం ఇప్పటికే అనేక సంస్థలను ప్రైవేట్ కు అమ్మేసింది. దీంతో వేల మంది రోడ్డున పడ్డారు. ఇప్పుడు ఎల్ ఐసి సహా అనేక కంపెనీల వాటాలను అమ్మెస్తోంది. ఎయిర్ ఇండియాను టాటా కి అప్పగించారు. కేంద్రం ఐడిబిఐ సహా 2 ప్రభుత్వ రంగ బ్యాంక్ లను ప్రైవేటికరణ చేస్తోంది. కేంద్రం విచ్చలవిడిగా ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మడం వల్ల దాదాపు రెండున్నర లక్షల మంది ఉద్యోగాలను కోల్పోయారు. ఆ కుటుంబాలకు బీజేపీ నేతలు సమాధానం చెప్పగలరా. కేంద్రం చర్యలతో ఉద్యోగాలకు ఎసరు రావడంతో పాటు ఎస్ సి, ఎస్ టి, ఒబిసి, ఇడబ్యూ ఎస్ అభ్యర్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ తరగతుల సాధికారత కోసం ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించినప్పటికి, అన్నిటినీ ప్రైవేటు పరం చేయడం వల్ల రిజర్వేషన్లు కోల్పోవాల్సిన పరిస్థితి వస్తున్నది. వాస్తవాలన్నీ ఇలా ఉంటే… మీరు చేసే గోబెల్స్ ప్రచారాన్ని చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. దివలాకోరు మాటలను బీజెపీ నేతలు ఇకనైనా మానుకోవాలి.

అసంబద్ధ, అవకాశ వాద, పసలేని ఆరోపణలతో బిజెపి చిల్లర రాజకీయాలు చేస్తున్నది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అభివృద్ది చేయ‌రు.. ఇక్క‌డ మేం చేస్తే అడ్డుకుందామ‌ని చూస్త‌రు. పైగా కేంద్రం నుంచి రాష్ట్రానికి ఎలాంటి నిధులు తీసుకురారు, విభ‌జ‌న హామీల నెర‌వేర్చేందుకు ప్ర‌య‌త్నించ‌రు. గోబెల్స్ ప్ర‌చారం చేసుకుంటూ.. రాజ‌కీయ ల‌బ్ధి పొందాల‌ని చూస్త‌రు. తెలంగాణ విద్యార్థులను, నిరుద్యోగులను బిజెపి ప్రభుత్వం దారుణంగా మోసం చేస్తున్నది. రాష్ట్రానికి రావాల్సిన కేంద్ర విద్యా సంస్థలు రాకుండా తెలంగాణ ప్రాంతం పట్ల నిర్లక్ష్యం చూపుతున్నది అని నిప్పులు చెరిగారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News