Thursday, January 23, 2025

పిచ్చోడి చేతిలో రాయి కాంగ్రెస్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి పిచ్చోడి చేతిలో రాయిలా మారిందని బిఆర్‌ఎస్ నాయకులు, మంత్రి హరీశ్ రావు విమర్శించారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో మంత్రి హరీశ్ రావు సమక్షంలో జహీరాబాద్, సంగారెడ్డి జిల్లాలకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేతలు బిఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన ఉపాధ్యాయ సంఘం నేతలు బిఆర్‌ఎస్‌లో చేరడాన్ని స్వాగతించారు. టిపిసిసి అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఎకరానికి 3 గంటలు కరెంటు చాలంటూ, వ్యవసాయం దండగ అన్న చంద్రబాబు నాయుడికి రేవంత్‌రెడ్డి అసలైన వారసుడిగా మారారని విమర్శించారు. రేవంత్ ఎంఎల్‌ఎగా ఉన్నప్పుడు ఉచిత కరెంటు ఉత్త కరెంటు అనలేదా…? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ హయాంలో కరెంట్ లేదు, ఎవరైనా చనిపోతే స్నానాలు చేద్దామంటే కూడా నీళ్లు ఉండటం లేదని నాడు ఎంఎల్‌ఎగా ఉండి రేవంత్ రెడ్డి మాట్లాడారని, పార్టీ మారంగనే మాట మార్చిండని విమర్శించారు.కాంగ్రెస్ పాలనలో కరెంటు బాగుందా…? బిఆర్‌ఎస్ పాలనలో కరెంటు బాగుందా..? తెలంగాణ సమాజం ఆలోచించాలని కోరారు. కెసిఆర్ పాలనలో అద్భుతమైన పంటలు పండుతున్నాయని చెప్పారు.

రైతులకు 3 గంటలు కరెంటు కావాలో.. 24 గంటలు కావాలో తెలియదా..? అని నిలదీశారు. కరెంటుపై ఎంత చర్చ జరిగితే బిఆర్‌ఎస్‌కు అంత లాభం అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో 24 గంటల కరెంటు ఇస్తున్నారా..? అని ప్రశ్నించారు. మొదటి నుంచి తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా ఉందని మండిపడ్డారు. హైదరాబాద్ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్‌లో కలిపింది కాంగ్రెస్ పార్టీ అని, తెలంగాణను ముంచే పోలవరం ప్రాజెక్టుకు ముగ్గు పోసింది కాంగ్రెస్ పార్టీ అని విమర్శించారు. సిఎం కెసిఆర్ నాయకత్వంలో తెలంగాణ అన్ని రంగాల్లో ముందుకు పోతోందని పేర్కొన్నారు. ప్రాజెక్టులు అడ్డుకునేందుకు కాంగ్రెస్ నేతలు కోర్టుల్లో కేసులు వేసి, భూ సేకరణ జరగకుండా అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని తెలంగాణ ఖ్యాతిని దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ మోడల్ కావాలని మహారాష్ట్ర ప్రజలు అంటున్నారని చెప్పారు. కెసిఆర్ ఎక్కడ పోటీచేసినా ప్రజలు కళ్లకు అద్దుకుని గెలిపిస్తారని హరీశ్‌రావు అన్నారు.

గీతారెడ్డి మంత్రిగా ఉన్న జహీరాబాద్‌లోనే కరెంట్ కోతలు ఉండేవి
కాంగ్రెస్ పాలన అంటే కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్‌ఫార్మర్లు అని హరీశ్‌రావు పేర్కొన్నారు. కరెంట్ కోసం నాడు కళ్లల్ల వత్తులు వేసుకొని చూడాల్సిన పరిస్థితి ఉండేదని గుర్తు చేశారు. గీతారెడ్డి మంత్రిగా ఉన్న జహీరాబాద్ ప్రాంతంలో కరెంట్ కోతలు ఉండేవని చెప్పారు. కెసిఆర్ పాలనలో నిండైన కరెంట్, నిండైన పంటలు పండుతున్నాయని తెలిపారు. తమ 9 ఏళ్ల పాలనలో ఎన్నడైనా కరెంట్ వస్తలేదని అసెంబ్లీలో మాట్లాడారా…? అని ప్రశ్నించారు. గతంలో కాంగ్రెస్ వాళ్లు అధికారంలో ఉంటే తెలుగుదేశం వాళ్లు, తెలుగుదేశం వాళ్లు అధికారంలో ఉంటే కాంగ్రెస్ వాళ్లు కందెనలు పట్టుకొని అసెంబ్లీకి వచ్చేవారని, కాలి కుండలతో, ఎండిపోయిన పంటలతో అసెంబ్లీకి వచ్చేవారని గుర్తు చేశారు. తొమ్మిదేళ్ల ఎన్నడైనా ప్రతిపక్షాలు ఈ విషయంపై మాట్లాడాయా..? అని నిలదీశారు.

కాంగ్రెస్ పరిస్థితి కుడిదిల పడ్డ ఎలుకలెక్క అయ్యిందని ఎద్దేవా చేశారు. మూడు గంటలు చాలని దొరికిపోయావు.. నాలుక కొరుక్కున్నవు దాన్ని బుకాయించడానికి అడ్డం పొడుగు మాట్లాడుతున్నావని రేవంత్‌రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పొన్నాల లక్ష్మయ్య విద్యుత్ మంత్రిగా ఉండి కూడా ఆయన సొంత ఊరు కిలాసపూర్‌లో కరెంట్ లేక పంటలు ఎండిపోతున్నయి అంటే, తాము 7,8 మంది ఎంఎల్‌ఎలము పోయామని, 3 గంటలు కూడా కరెంట్ వస్తలేదు… గంట గంటకు ట్రిప్ అవుతున్నదని నాడు రైతులు గగ్గోలు పెట్టారని గుర్తు చేశారు. స్వయంగా విద్యుత్ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఊళ్లనే విద్యుత్ దిక్కులేదనిని రైతులు ఎడ్చారని అన్నారు. ఇప్పుడు అలాంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయా..? అని ప్రశ్నించారు. నాటి లెక్క గోస పడ్డ తెలంగాణ తమకు వద్దని రైతులు ఆలోచిస్తున్నారని చెప్పారు. కర్ణాటక, చత్తీస్‌ఘడ్, రాజస్థాన్‌లో ఎక్కడైనా 24 గంటల కరెంట్ ఇస్తున్నారా..? అని నిలదీశారు.

తెలంగాణకు నీళ్లు లేకుండా చేసింది కాంగ్రెస్ పార్టీ
2004లో గులాబి జెండాతో పొత్తు పెట్టుకొని తర్వాత తెలంగాణ ఇవ్వమని ఎగబెట్టింది కాంగ్రెస్ పార్టీ అని హరీశ్‌రావు మండిపడ్డారు. ఆ తర్వాత పోతిరెడ్డి పాడుకు పొక్క పెట్టి క్రిష్ణా జలాలను ఆంధ్రాకు ఆక్రమంగా తీసుకువెళ్లింది కాంగ్రెస్ పార్టీ అని విమర్శించారు. పులిచింతలకు పురుడు పోసింది, పోలవరానికి ముగ్గు పోసింది కాంగ్రెస్ పార్టీ అని, తెలంగాణకు నీళ్లు లేకుండా చేసింది కాంగ్రెస్ పార్టీ అని, నల్లగొండ ఫ్లోరైడ్ భూతానికి కారణం కాంగ్రెస్ పార్టీ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరెన్ని తిట్టినా, మాటలు అన్నా పట్టించుకోకుండా సిఎం కెసిఆర్ తెలంగాణ పునర్‌నిర్మాణం చేస్తున్నారని తెలిపారు.

తెలంగాణ అద్భుతంగా ఒక్కో అడుగు ముందుకు వెళ్తున్నదని వ్యాఖ్యానించారు. విద్య, వైద్యం, పరిశ్రమలు, పంచాయతీరాజ్, పరిశ్రమలు, వ్యవసాయం, దళిత గరిజన జాతి అభ్యున్నతిలో దేశానికి తెలంగాణ ఆదర్శమని పేర్కొన్నారు. తెలంగాణ ఆచరిస్తే దేశం అనుసరిస్తది అనే విధంగా సిఎం అభివృద్ధి చేశారని అన్నారు. నాడు లోకకల్యాణం కోసం రుషులు యజ్ఞాలు చేస్తే, రాక్షసులు ఆ రుషుల యజ్ఞాలు భగ్నం చేసేవారని, కెసిఆర్ ఒక రుషి లాగా రాష్ట్రాన్ని బాగు చేస్తుంటే, కాంగ్రెస్ వాళ్లు మాత్రం భగ్నం చేసే ప్రయత్నం చేస్తున్నారని హరీశ్‌రావు విమర్శించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News