Wednesday, January 22, 2025

వారిది గోబెల్స్ ప్రచారం

- Advertisement -
- Advertisement -

గ్రామాలభివృద్ధ్దికి కేంద్రం సరిగ్గా నిధులు
ఇవ్వకున్నా రాష్ట్ర ఖజానాతో అభివృద్ధి
చేస్తున్నాం రెండు నెలల్లో పట్టణ, పల్లె
ప్రగతి కింద రూ.700 కోట్లు చెల్లింపు
బండి, తప్పుడు ప్రచారం
దేశవ్యాప్తంగా 20 గ్రామాల్లో
19 తెలంగాణవే కాంగ్రెస్, బిజెపోళ్ల
మాటలను సర్పంచ్‌లు నమ్మవద్దు
రాష్ట్రానికి రావాల్సిన రూ.34వేల 149 కోట్లను వెంటనే విడుదల చేయాలి

మన తెలంగాణ/సిద్దిపేట ప్రతినిధి: గ్రామాలకిచ్చే నిధులపై బిజెపి, కాంగ్రెస్ నాయకులు గోబెల్స్ ప్రచారానికి పాల్పడుతున్నారని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం జిల్లా కేంద్రంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావుతో కలిసి విలేకరులతో మాట్లాడారు. కేంద్రం నిధులివ్వకున్నా గ్రామా లాభివృద్ధికి తామే నిధులిచ్చి అభివృద్ధి చేస్తున్నామ న్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా సిఎం కె సిఆర్ ప్రత్యేక కృషితో రాష్ట్రంలోని పల్లెలు అభివృద్ధి పథంలో పయనిస్తున్నాయన్నారు. దేశవ్యాప్తంగా బిజెపి, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో తెలంగాణ పల్లెల తరహా అభివృద్ధి జరిగిందా అని ప్రశ్నించారు. అవసరమైతే తానే స్వయంగా మీడియాను తీసుకొనివ స్తానని ఇక్కడ, అక్కడి అభివృద్ధిని బహిర్గతంచేస్తామని సవాల్ విసిరారు. ఈజిఎస్ పథకంలో తెలంగాణకు రావాల్సిన నిధులపై కేంద్రం తొండి ఆట ఆడుతుందన్నారు.

వివిధ రూపాలలో ఇప్పటికే రాష్ట్రానికి కేంద్రం నుంచి రూ.34వేల 149 కోట్లు రావాల్సి ఉందన్నారు. ఈ నిధులపై బండి సంజయ్ పిఎం మోడీకి లేఖ రాసి నిధులను తీసుకురావాలని సలహా ఇచ్చారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులపై మాట్లాడకుండా ఆసత్య ఆరోపణలు పాల్పడుతున్నారన్నారు. సంసాద్ ఆదర్శ గ్రామ యోజన పథకం కింద దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం 20 ఉత్తమ గ్రామాలు ప్రకటిస్తే ఇందులో 19తెలంగాణ గ్రామాలకు వచ్చాయని.. ఇది తెలంగాణ ప్రభుత్వం పనితీరుకు నిదర్శనమన్నారు. ప్రతి గ్రామానికి ప్రత్యేకంగా ట్రాక్టర్, టాలీ, ట్యాంకర్ ఏర్పాటు చేయడంతోపాటు డంప్ యార్డులు, వైకుంఠదామాలు ఏర్పాటు చేశామన్నారు. గతంలో 6వేల గ్రామ పంచాయతీలుంటే కెసిఆర్ కృషితో 12,769 గ్రామ పంచాయతీలకు పెరిగాయన్నారు.

అలాగే 3,146 తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చి ఎస్టీలకు సర్పంచులయ్యే అవకాశాన్ని కల్పించిన ఘనత టిఆర్‌ఎస్‌కే దక్కుతుందన్నారు. కాంగ్రెస్ హయాంలో ఐదు గ్రామాలకు ఒక పంచాయతీ సెక్రటరీ ఉండేవాడని, ప్రత్యేక రాష్ట్రంలో 12,769 పంచాయతీలకు ఒక్కొక్కటిగా సెక్రటరీలను నియమించామన్నారు. ఏప్రిల్, మే నెలల్లోనే పల్లె, పట్టణ ప్రగతికి సంబంధించి రూ.700కోట్ల చెల్లింపు చేశామన్నారు. కేంద్రం నుంచి ఉపాధి హమీ పథకం కింద ఇప్పటికీ రూ.1200 కోట్లు రావాల్సి ఉందన్నారు. 13,14,15 ఆర్థిక సంఘాల ద్వారా రావాల్సిన నిధులను సైతం కేంద్రం ఇవ్వకుండా మొండివైఖరిని అవలంభిస్తుందన్నారు. బిజెపి సర్కార్ రాష్ట్రానికి రావాల్సిన నిధులను ఇవ్వకుండా తొండి ఆట ఆడుతూ అభివృద్ధికి అడ్డుపడుతున్నదని మండిపడ్డారు. ఈనెల 3నుంచి పట్టణ ప్రగతి కార్యక్రమంలో ప్రజాప్రతినిధులంతా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

కెసిఆర్ పాలనలో సర్పంచ్‌లకు ప్రత్యేక గౌరవం
మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

ఏరాష్ట్రంలో లేనివిధంగా సిఎం కెసిఆర్ పాలనలో పల్లెలు ఎంతగానో అభివృద్ధి చెంది సర్పంచ్‌లకు ప్రత్యేక గౌరవం లభిస్తుందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. కాంగ్రెస్, బిజెపోళ్లు కావాలనే సర్పంచ్‌లను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. కేంద్రం నుంచి నిధులు సరిగ్గా రాకున్నా రాష్ట్ర ఖజానా నుంచి ఖర్చుచేసి గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. దేశంలోనే ఉపాధి పనులలో రాష్ట్రం నంబర్‌వన్ స్థానంలో నిలిచిందన్నారు. దీన్ని చూసి ఓర్వలేకనే బిజెపి, కాంగ్రెసోళ్లు రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. కేంద్రం నుంచి గ్రామాలకు రావాల్సిన పెండింగ్ నిధుల కోసం ఈనెల 16న పంచాయతీరాజ్ సెక్రటరీ, కమిషనర్ ఢిల్లీకి వెళుతున్నారన్నారు. గ్రామాలకు పంచాయతీ శాఖ ద్వారా వచ్చే నిధులు పెండింగ్‌లో లేవని కేంద్రం నుంచి వచ్చే నిధులు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ఈనెల 3నుంచి 18వ తేది వరకు పల్లె, పట్టణప్రగతి కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్నామన్నారు. ప్రతి రోజు ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తూ గ్రామాలను అద్దంలా తీర్చిదిద్దుతామన్నారు. ఈ సందర్భంగా పట్టణ, పల్లెప్రగతికి సంబంధించిన కరప్రతాన్ని మంత్రులు ఆవిష్కరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News