Tuesday, November 5, 2024

‘రైతుల ఓట్లు కావాలి’.. వడ్లు అక్కర్లేదా?

- Advertisement -
- Advertisement -

Minister Harish rao fires on Central govt

మంత్రుల బృందంపై పీయూష్ వ్యాఖ్యలు అభ్యంతరకరం, 70 లక్షల రైతు కుటుంబాలను అవమానించడమే, తక్షణమే క్షమాపణ చెప్పాలి

కేంద్రమంత్రిలా కాకుండా రాజకీయ
నాయకుడిగా మాట్లాడారు మా
ప్రాధాన్యత రైతులు, మీ ప్రాధాన్యత
రాజకీయం బిజెపి నేతలను
కలుస్తారు గానీ, మంత్రుల బృందాన్ని
కలిసేందుకు సమయం లేదా?
గోదాములపై పీయూష్ పచ్చి
అబద్ధాలు, 10సార్లు లేఖలు రాసినా
పట్టించుకోలేదు కేంద్రం వైఖరిపై
మంత్రి హరీశ్‌రావు ఫైర్

మనతెలంగాణ/హైదరాబాద్ : ఢిల్లీ వెళ్లిన రాష్ట్ర మంత్రులను ఉద్దేశించి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయని రాష్ట్ర ఆర్ధిక, వైద్యారోగ్య శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. ఆయన కేంద్రమంత్రిగా కాకుండా రాజకీయ నేతలా మాట్లాడారని ఆక్షేపించారు. 70 లక్షల మంది రైతుల తరఫున రాష్ట్ర మంత్రులు దిల్లీ వెళ్లారని హరీశ్ రావు చెప్పారు. మంగళవారం దిల్లీలో పీయూష్ గోయల్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ బుధవారం మంత్రి హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. పీయూష్ గోయల్ మంత్రులను ‘మీకేం పని లేదా’ అని చేసిన వ్యాఖ్యలు చాలా చాలా అభ్యంతరకరమని వ్యాఖ్యానించారు. ఇది యావత్ తెలంగాణ ప్రజానీకాన్ని అవమానపరచడమే అని పేర్కొన్నారు. 70 లక్షల రైతు కుటుంబాల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమే అని అన్నారు.

పీయూష్ గోయల్ తక్షణమే ఆయన వ్యాఖ్యలను ఉపసంహరించుకొని.. బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. టిఆర్‌ఎస్ పార్టీ పుట్టుకనే తెలంగాణ కోసమని, తమ పుట్టుక తెలంగాణ జాతి ప్రయోజనాల కోసమే అని స్పష్టం చేశారు. అనేక త్యాగాల పునాదుల మీద తెలంగాణను సాధించామని, ‘మాకు మా రాష్ట్రం.. 70 లక్షల మంది రైతు ప్రయోజనాల కంటే ఏదీ ముఖ్యం కాదు’ అని చెప్పారు. మాట తప్పింది మీరు.. మాట మార్చింది మీరు అని…మళ్ళీ మేము రాజకీయం చేస్తున్నాం అంటున్నారని విమర్శించారు. రాష్ట్ర ఏర్పాటు విషయంలో నాడు కాకినాడ తీర్మానం చేసి వెనక్కి తగ్గింది బిజెపి కాదా..? అని ప్రశ్నించారు. ఎవరు రాజకీయం చేస్తున్నారో.. రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని అన్నారు.

బిజెపి నేతలను కలిసేందుకు సమయముందా..?

రాష్ట్ర ప్రభుత్వ బృందాన్ని అవమానించే హక్కు పీయూష్ గోయల్‌కి ఎక్కడిది..? అని మంత్రి ప్రశ్నించారు. మూడు రోజుల పాటు మంత్రులు కలిసేందుకు ప్రయత్నిస్తే సమయం లేదన్న పీయూష్ గోయల్‌కు, స్థానిక బిజెపి నేతలను కలిసేందుకు సమయం ఉందా..? అని నిలదీశారు. మా ప్రాధాన్యత రైతులు, మీ ప్రాధాన్యత రాజకీయం అని మండిపడ్డారు. కేంద్ర మంత్రి ఇంత అవహేళనగా మాట్లాడటం సరికారని, దీనిపై రాష్ట్ర బిజెపి నాయకులు ఏమంటారు..? అని ప్రశ్నించారు. బిజెపికి రైతుల ఓట్లు కావాలి కానీ వడ్లు అక్కర్లేదా? అని ప్రశ్నించారు. బిజెపి కుటిల నీతికి ఇదే నిదర్శనమని అన్నారు.

అనవసరంగా బురదజల్లే ప్రయత్నాలు సహించం

దేశం మొత్తం ఒకే విధానం ఉండాలని తాము అంటున్నామని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. పంజాబ్‌లో మొత్తం కొంటున్నట్లే…తెలంగాణలో కూడా కొనాలి అంటున్నామని అన్నారు. దానికి సమాధానం చెప్పకుండా… డొంక తిరుగుడుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పంజాబ్ మాదిరిగా తెలంగాణాలోనూ పూర్తి స్థాయిలో ధాన్యం కొనుగోలు చేయాలని కోరుతున్నామని తెలిపారు. యాసంగిలో ధాన్యంలో కొంటారా లేదా..?అని అడిగారు. విద్యుత్, సాగునీరు రాష్ట్రాల బాధ్యత అని, తమ పని తాము వంద శాతం చేస్తున్నామని చెప్పారు. రైతు బంధు కింద రూ.14,500కోట్లు సహాయం చేశామని, రైతులు ఉచిత విద్యుత్ కూడా అందిస్తున్నామని తెలిపారు.

రైతులకు ఎరువులు విత్తనాలను సకాలంలో అందేలా చేస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్ర పరిధిలో ఉన్న అంశాల్లో రైతులకు మేలు చేస్తున్నామని వివరించారు. ధాన్యం కొనుగోలు కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశమని, నిర్ణయం తీసుకోవాల్సింది కేంద్రమే అని స్పష్టం చేశారు. గతంలో కరువు వస్తే మెడ మీద కత్తి పెట్టి ధాన్యం సేకరించలేదా..? అని ప్రశ్నించారు. కేంద్రానికి చేతకాకపోతే ధాన్యం ఎగుమతి, దిగుమతి అంశాన్ని రాష్ట్రాలకు ఇవ్వాలని అన్నారు. మా వల్ల కాదు అని మీరు చేతులెత్తేస్తే రైతులే గుణపాఠం చెబుతారని అన్నారు. అనవసరంగా బురదజల్లే ప్రయత్నాలను సహించమని పేర్కొన్నారు. పట్టపగలు రైతుల మీద కార్లు ఎక్కించి చంపిన కేంద్ర మంత్రి కొడుకును సిట్ నివేదిక ఇచ్చినా ఎందుకు అరెస్ట్ చేయలేదని అడిగారు. రైతులపై మీకున్న గౌరవం అది అని పేర్కొన్నారు.

టిఆర్‌ఎస్ ఓటమిపై మాట్లాడటం ఏంటి..?

కేంద్ర మంత్రి టిఆర్‌ఎస్ పార్టీ ఓటమిపై మాట్లాడటం ఏంటని హరీశ్‌రావు ప్రశ్నించారు. ఉప ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా బిజెపి ఓడిపోలేదా.. ఎందుకు అంత విర్ర వీగుతున్నారని అన్నారు. ఇటీవల ఎన్నికల్లో ఎన్ని సిట్టింగ్ స్థానాలు బిజెపి కోల్పోలేదు…ఎంఎల్‌సిగా రామచంద్రరావు ఓడిపోలేదా..? అని ప్రశ్నించారు. తెలంగాణపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, గోదాముల సామర్థ్యంపై లేఖ రాయలేదని పచ్చి అబద్ధాలు చెప్పారని మండిపడ్డారు. గోదాముల సామర్థ్యం పెంచాలని పది సార్లు లేఖలు రాశామని గుర్తు చేశారు. బియ్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం.. గోదాములు ఇవ్వాలని లేఖల్లో పేర్కొన్నామన్నారు. పార్లమెంట్ సాక్షిగా కూడా అబద్ధాలు మాట్లాడితే ఏం చేస్తామని, బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న పీయూష్ గోయల్‌కు ఇలా మాట్లాడటం తగదని హరీశ్‌రావు అన్నారు.

బియ్యం రవాణా ఆలస్యం అవుతున్నదని తన దృష్టికి వస్తే తాను ఉమ్మడి జిల్లా మంత్రిగా గతంలో ఎఫ్‌సిఐ జనరల్ మేనేజర్‌ను ఇంటికి పిలిచి, టిఫిన్ పెట్టి 2 గంటలు బతిలాడానని గుర్తు చేశారు. కలెక్టర్లు, అధికారులు, మిల్లర్లు తమ సమస్యలు చెప్పారని, ఎలాగైనా పైవాళ్ళతో మాట్లాడి బియ్యం తరలించమని కోరానని అన్నారు. దానికి ఆయన రైల్వే వాళ్ళు బీహార్‌కు వ్యగన్లు ఇచ్చారని,కానీ తెలంగాణకు ఇవ్వలేదని చెప్పారు. వెంటనే తాను సిఎస్ సోమేష్ కుమార్‌కు చెప్పి రైల్వే వాళ్ళతో మాట్లాడించానని తెలిపారు. దేశంలో మొదటిసారిగా బిజెపి ప్రభుత్వమే వడ్లు కొనడం లేదని చెప్పారు. గతంలో ఏ ప్రభుత్వం వచ్చినా ధాన్యం కొన్నదని… ఇప్పుడు ఎందుకు సమస్య సృష్టిస్తున్నారని అడిగారు. రైతుల జీవితాలతో ఆడుకుటున్నారని పేర్కొన్నారు. ముఖ్యమత్రి కెసిఆర్ ఎంతో కష్టపడి రైతులను ఆదుకుం టే.. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఆడుకుంటోందని విమ ర్శించారు. నోటితో మాట్లాడి నొసటితో వెక్కిరించినట్లు కేంద్రం వ్యవహరిస్తోందని మంత్రి హరీశ్‌రావు అన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News