Wednesday, December 25, 2024

అక్కడ చెల్లని కాసు ఇక్కడ రుబాబు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : తన వల్లే ఖమ్మం జిల్లా అభివృద్ధి చెందిదని టిడిపి జాతీయ అధ్యక్షుడు ఎన్ .చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించడం పట్ల రాష్ట్ర ఆర్ధిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి టి. హరీశ్‌రావు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన వల్ల మొత్తం తెలంగాణ రాష్ట్రానికే తీరని అన్యాయం జరిగిందని ధ్వజమెత్తారు. పోలవరం కోసం ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఎపిలో కలుపుకున్నది చంద్రబాబు కాదా? అని ప్రశ్నించారు. అలాగే 440 మెగావాట్ల సీలేరు జల విద్యుత్ కేంద్రాన్ని కూడా తెలంగాణ నుంచి చంద్రబాబు తన్నుకపోలేదా? అని మంత్రి హరీశ్‌రావు నిలదీశారు. టిడిపి హయంలో ఖమ్మంలో ఒక్క సాగు నీటి ప్రాజెక్ట్ కట్టినట్లుగా చంద్రబాబు నిరూపిస్తే తాను ముక్కు నేలకు రాస్తానని మంత్రి పేర్కొన్నారు. సిఎం కెసిఆర్ వల్లే ఖమ్మంకు జల వైభవం వచ్చిందని స్పష్టం చేశారు.
గురువారం బిఆర్‌ఎస్ ఎల్‌పి కార్యాలయంలో మంత్రులు కొప్పుల ఈశ్వర్, శ్రీనివాస్‌గౌడ్, అజయ్‌కుమార్, శాసనమండలి విప్ ప్రభాకర్‌రాతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ, చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.రెండు రోజుల క్రితం టిటిడిపి నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్న చంద్రబాబు …అన్ని ఉత్తుత్తి మాటలు చెప్పారని విమర్శించారు. అసలు ఖమ్మం జిల్లాకు అన్యాయం చేసిందే చంద్రబాబు అని విమర్శించారు. ప్రస్తుతం కెసిఆర్ పాలనలో తెలంగాణలో అన్ని ప్రాంతాల ప్రజలు హాయిగా, సంతోషంగా ఉన్నారన్నారు.

అందువల్ల రాష్ట్ర ప్రజలను మరోసారి ఆగం చేసే పనులను చంద్రబాబు మానుకోవాలని ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు సూచించారు. టిడిపి హాయంలో ఖమ్మంకు బుడ్డ పైసా పని కాలేదన్నారు. ఖమ్మం కరకట్ట చంద్రబాబు పూర్తి చేసుంటే మొన్న భద్రాచలంలో వరదలు వచ్చేవా? అని హరీశ్‌రావు ప్రశ్నించారు. చంద్రబాబు సభ పెట్టిన గ్రౌండ్ చాలా చిన్నదని…దానికి కూడా ఎపి నుంచి చి జనాలను తరలించారని ఒక ప్రశ్నకు సమాధానంగా ఆయన చెప్పారు.

కెసిఆర్‌ను ఎదుర్కొనే దమ్ము ఎవరికి లేదు
రాష్ట్రంలో కెసిఆర్‌ను రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము ఎవరికి లేదని హరీశ్‌రావు స్పష్టం చేశారు. తెలంగాణలో బిఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని అస్తిరపరిచేందుకు కేంద్రంలోని బిజెపి సర్కార్‌రు చేయని ప్రయత్నం అంటూ లేదని విమర్శించారు. ఇందులో భాగంగానే తెలంగాణకు బిజెపి పంపుతున్న నేతల జాబితాలో చంద్రబాబు కూడా చేరిపోయాడని ఆరోపించారు. అయినా చంద్రబాబు ఖమ్మంలో చేసిన షో ఎలా ఉందంటో…… కూట్లో రాయి తీయని వాడు ఏట్లో రాయి తీస్తానన్నట్టు ఉందని హరీశ్‌రావు మండిపడ్డారు. చచ్చిన బర్రెకు కుండెడు పాలు ఇచ్చినట్లుందిగా చంద్రబాబు తీరుందని ధ్వజమెత్తారు.

ఎపిలో చెల్లని రూపాయి….తెలంగాణలో చెల్లుతుందా?
ఎపిలో చెల్లని రూపాయి తెలంగాణలో చెల్లుతుందా? అంటూ చంద్రబాబుపై హరీశ్‌రావు సెటైర్లు వేశారు. ఎపిని అప్పుల పాలు చేసి ఓటర్ల ఛీత్కారానికి గురైంది చంద్రబాబు తెలంగాణకు వచ్చి కాకమ్మ కబుర్లు చెబుతున్నాని ఎద్దేవా చేశారు. తెలంగాణను అత్యంత వెనకబడేలా చేసిందే చంద్రబాబు అని విమర్శించారు. సూర్యుడు ఉదయిస్తోంది తన వల్లే, కోడి కూస్తోంది తన వల్లే అని అనే బాపతు చంద్రబాబుదని మండిపడ్డారు. చంద్రబాబులా మాట్లాడితే తమ దేశంలో అయితే జైలుకు పంపుతారని అని అప్పటి స్విట్జర్లాండ్ అధ్యక్షుడు అన్న విషయాన్ని ఈ సందర్భంగా హరీశ్‌రావు గుర్తు చేశారు.

రైతులను నిండా ముంచింది చంద్రబాబేనని అన్నారు.టిడిపి పాలనలో కరెంటు చార్జీలు తగ్గించమంటే… బషీర్ బాగ్‌లో రైతులను పిట్టల్ని కాల్చినట్టు కాల్చి చంపారన్నారు. సాగు నీటి ప్రాజెక్టులు కట్టకుండా తెలంగాణను ఎండబెట్టింది కూడా చంద్రబాబేనని విమర్శించారు. వ్యవసాయం దండగ అన్న చంద్రబాబుకు…. 2004 లో తమ ఓటమికి రైతులను నిర్లక్ష్యం చేయడమే కారణమని వ్యాఖ్యానించిన విషయాన్ని మరిచిపోయారా? అని హరీశ్‌రావు ప్రశ్నించారు. బాబు మరచి పోయినా తెలంగాణ ప్రజలు మరచిపోరన్నారు.

చంద్రబాబుది భస్మాసుర హస్తం
బిజెపితో పొత్తు కోసమే తెలంగాణలో చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారని హరీశ్‌రావు మండిపడ్డారు. ఆయనది భస్మాసుర హస్తమన్నారు. ఆయనతో పెట్టుకుంటే మాటాషే అని అన్నారు. 2018లో తెలంగాణపై మహాకూటమితో కుట్ర చేశారన్నారు. ఇపుడు ఖమ్మం సభతో మరోసారి కుట్రకు తెరతీస్తున్నారని విమర్శించారు. ఉమ్మడిఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ ప్రాంతం అత్యధికంగా దోపిడీకి గురైందంటే, అత్యధికంగా నిర్లక్ష్యానికి గురైందంటే అది చంద్రబాబు తొమ్మిదేళ్ల పాలనలోనేనని ఆరోపించారు. యువత ఉద్యోగులు విద్యార్థులు రైతులు అన్నివర్గాలను ఈ ప్రాంతానికి తీవ్రమైన అన్యాయం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడని ధ్వజమెత్తారు.

నాటి యువత మాకు ఉద్యోగాలు కావాలి…. మా పల్లెలు అభివృద్ధి కావాలని అడిగితే వారిని నక్సలైట్ల పేరుతో కాల్చి చంపిన చరిత్ర బాబుదన్నారు. ఈ విషయాన్ని తెలంగాణ సమాజం, యువత మరిచిపోలేదన్నారు. అలాగే ఫ్రీజోన్ పేరిట హైదరాబాద్‌ను హస్తగతం చేసుకొని తెలంగాణ నిరుద్యోగ యువత నోట్లో మట్టికొన్ని వ్యక్తి చంద్రబాబు అన్నారు. ఆయన ఇవాళ నేను ఏదో ఉద్ధరించారని చెబుతున్నారని విమర్శించారు. చంద్రబాబు విషయంలో తెలంగాణ ప్రజలకు ఒక స్పష్టత ఉందన్నారు.

రైతులకు కెసిఆర్ చేసిన మేలు….ఎవరు చేయలేదు
రైతులకు కెసిఆర్ చేసినంత మేలు ఎవరూ చేయలేదని…. రూ.52వేల కోట్లు రైతుబంధు సాయం అందజేశామని హరీశ్‌రావు తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సిఎం రైతుబంధు, రైతుబీమా ఇచ్చారన్నారు. నీటి తీరువా బకాయిలు రద్దు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు గుర్తు చేశారు. చంద్రబాబు హయాంలో చెరువులు, తూములు, అలుగులను ఆగం చేస్తే మిషన్ కాకతీయ కింద అభివృద్ధి చేసి 25లక్షల ఎకరాలకు నీరిచ్చిందన్నారు.

కల్వకుర్తికి చంద్రబాబు కొబ్బరికాయలు కొట్టగా, వైఎస్‌ఆర్ మొక్కలు పెట్టి….. ఇద్దరు కలిసి మహబూబ్‌నగర్‌ను ఆగం చేశారన్నారు. అలాంటి కల్వకుర్తిని పూర్తి చేసి మహబూబ్‌నగర్‌కు లక్షల ఎకరాలకు నీరిచ్చింది కెసిఆర్ అని అన్నారు.ర్ అన్నారు. ప్రజలను మోసం, మభ్యపెట్టేందుకు చంద్రబాబు ప్రయత్నించారని విమర్శించారు. తెలంగాణ ప్రాంతం గురించి మాట్లాడే హక్కు చంద్రబాబుకు లేదన్నారు.

ఎన్‌టిఆర్ గురించి మాట్లాడే అర్హత లేదు
ఎన్‌టిఆర్ గురించి చంద్రబాబు మాట్లాడడం అంటే….. చెట్టుపేరు చెప్పి కాయలు అమ్ముకునే పద్ధతని హరీశ్‌రావు విమర్శించారు. ఇప్పుడున్న తెలుగుదేశం పార్టీ.. ఎన్టీఆర్ పెట్టిన పార్టీ కాదన్నారు. చంద్రబాబు నాయుడు ఎన్‌టిఆర్‌ను ఏం చేశారో తెలుగు ప్రజలకు తెలియదా? అని ప్రశ్నించారు. ఎన్‌టిఆర్ ఒక విలక్షణమైన నేత అని అన్నారు. ఆయన సంస్కరణల గురించి సిఎం కెసిఆర్ కూడా పలుమార్లు అసెంబ్లీలో చెప్పారన్నారు. కానీ ఎన్టీఆర్ గురించి మాట్లాడే హక్కు చంద్రబాబుకు లేదన్నారు.

కల్లాలను నిర్మించడం తప్పా!
రైతుల కోసం కల్లాలను నిర్మించడం తప్పని కేంద్రం అంటోందని హరీశ్‌రావు విమర్శించారు. పంట పొలాల్లో రైతులు పండించిన ధాన్యాన్ని ఆరబోసుకునేందుకు కల్లాలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఏర్పాటు చేసిందన్నారు. ఇవాళ కేంద్రంలోని ప్రభుత్వం కల్లాలను నిర్మించడం తప్పని, కల్లాలు నిర్మించినందుకు రూ.150కోట్లు ఇవాళ వాపస్ ఇవ్వమని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశం ఇస్తుందన్నారు. కల్లాలు కట్టకుండా బిల్లు పెడితే తప్పు కానీ.. కల్లం కడితే తప్పంటేని ప్రశ్నించారు. రైతులపై కేంద్రానికి ఎందుకీ వివక్ష అని నిలదీశారు.

ఇదే బిజెపి ప్రభుత్వం చేపలు ఎండబెట్టుకునేందుకు పర్మిషన్ ఇచ్చిందని, చేపలు ఎండబెట్టుకునేందుకు కట్టొచ్చొటా కానీ… కల్లాలు కడితే తప్పట అని విమర్శించారు. ఇదేం ద్వంద నీతి అంటూ ఆయన ధ్వజమెత్తారు. రైతులపై ఎందుకంత కుట్ర వివక్ష వివక్ష అంటూ నిలదీశారు. ప్రతి నిర్ణయం రైతు వ్యతిరేకమేనని హరీశ్‌రావు మండిపడ్డారు. బిజెపి మేనిఫెస్టెలో ఆదాయం రెట్టింపు చేస్తా అన్నారని, రెట్టింపు చేయలేదు కానీ పెట్టుబడి రెట్టింపు చేసిన ఘనత ఆ ప్రభుత్వానికే దక్కుతుందంటూ హరీశ్‌రావు ఎద్దేవా చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News