గజ్వేల్: కాంగ్రెస్‌ది 24 పేజీల మేనిఫెస్టో కాదు 420 మేనిఫెస్టో అని రాష్ట్ర ఆర్థ్ధిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని ప్రజ్ఞాగార్డెన్స్‌లో నిర్వహించిన దివ్యాంగుల ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో ఎలాగూ గెలిచేది లేదని అమలు కానీ హామీలతో ప్రజలను మోసం చేయాలని ఒక 420 మేనిఫెస్టోను ప్రజల ముందుకు తెచ్చిందని ఆమన ఆరోపించారు. అసలు కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసం అన్నారు. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవ్చేలేదని అన్నారు. ఆచరణ సాధ్యం కానీ ఇలాంటి హామీలతో కాంగ్రెస్ పార్టీకి విశ్వసనీయత లేదని ఆయన అన్నారు. ఇలాంటి పార్టీ ఇచ్చిన మేనిఫెస్టోను ప్రజలు ఎవరూ నమ్మబోరన్నారు. కర్ణాటకలో కరెంట్ కష్టాలు చూసున్నామని, అక్కడి ప్రజలకు 4 గంటల కరెంటు కూడా సక్కగా వస్తలేదన్నారు.
మహిళలకు ఉచిత బస్ అన్నారు కానీ అసలు బస్‌లే బంద్ చేశారని ఆయన కర్ణాటక ప్రభుత్వ హామీల అమలు తీరుపై మంత్రి హరీశ్‌రావు సెటైర్లు వేశారు. 24 గంటలు కరెంటు అనకపోతే జనం ఎక్కడ కొడతారోనన్న భయంతో కాంగ్రెస్ వాళ్లు తమ మేనిఫెస్టోలో పెట్టారన్నారు. తెలంగాణ ఎన్నికలకు కాంగ్రెస్ ఇచ్చిన మేనిఫెస్టోలో రైతు బంధు, కళ్యాణ లక్ష్మి, ధరణీ తదితర పథకాలకు పేర్లు మార్చి వాటిని బిఆర్‌ఎస్ నుంచి కాపీ కొట్టారని మంత్రి హరీశ్ రావు చెప్పారు. అసలు ప్రజల కష్టాలంటే ప్రతిపక్ష పార్టీలు పట్టించుకోరని, గతంలో కరోనా వచ్చినపుడు నియోజకవర్గాలలో బిఆర్‌ఎస్ పార్టీ నాయకులం ప్రజలతో ఉండి వారికి అనేక రకాల చేదోడు వాదోడుగా నిలిచామని, ఆ సమయంలో ఇప్పుడు మొసలి కన్నీరు కార్చుతున్న కాంగ్రెస్, బిజెపి నాయకులు కష్ట సమయంలో ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు.