పేదలకు అందే పథకాల్లో కేంద్రానిది ఒక్క రూపాయి లేదు
పెట్రోల్, డీజిల్‌పై మూడు రకాల పన్నులు వేసి ప్రజల నడ్డివిరుస్తున్న బిజెపి
అబద్ధాల బిజెపికి ఆస్కార్ అవార్డు ఇవ్వాలి
కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి సవాల్ విసిరిన మంత్రి హరీశ్‌రావు
మన తెలంగాణ/హైదరాబాద్/హుజూరాబాద్ టౌన్ : అబద్ధాల పునాదుల మీద ప్రజలను మభ్య పెట్టి ఓట్లు పొందాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చూస్తున్నారని రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి హరీశ్‌రావు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. నడిరోడ్డు మీద, పట్టపగలు నగ్నంగా అబద్దాలు ఆడుతూ కేంద్రమంత్రి ఆత్మవంచన చేసుకుంటూన్నారన్నారు. ఇలా ప్ర జలను వంచించి నాలుగు ఓట్లు పొందాలనుకోవడం దివాళా కోరు రాజకీయమన్నారు. ఇందుకు తాను సిగ్గుపడుతున్నానని హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. శుక్రవారం హుజురాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హరీశ్‌రావు మాట్లాడుతూ, కిషన్‌రెడ్డిపై తీవ్ర స్థాయిలో విచురుకపడ్డారు. ఒక ఉపఎన్నిక కోసం కేంద్రమంత్రి పచ్చి అబద్దాలు చెప్పడం బిజెపి పార్టీ దిగజారుడు తనానికి నిదర్శనమన్నారు. ప్రజాస్వామ్యంలో తాము ఏం చేశాం… ఏం చేస్తున్నామో చెప్పాలి కాని, ఇలా అబద్దాలు అ డటం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని అన్నారు.
ఏడేళ్ల క్రితం బిజెపి కేంద్రంలో అధికారంలోకి వస్తే నల్లధనం వెనక్కు తెచ్చి రూ.15 లక్షలు ప్రజల బ్యాంకు ఖాతాల్లో వేస్తామన్నారు… ఎంతమందికి వేశారో చెప్పాలని మంత్రి హరీశ్‌రావు సవాల్ విసిరారు. అలాగే అధికారంలోకి వచ్చిన వెంటనే డీజీల్, పెట్రోల్ ధరలు తగ్గిస్తామన్నారు. ఏమైనా తగ్గాయా? అని ఆయన ప్రశ్నించారు. ఉన్న ధరలను రెండింతలు పెంచిన ఘనత మోడీ ప్రభుత్వానికే దక్కిందన్నారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. కనీసం రెండులక్షల ఉద్యోగాలైనా ఇచ్చారా? దమ్ముంటే కిషన్‌రెడ్డి చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రానికో ప్రాజెక్టు అన్నా రు… ఎక్కడైనా ఎక్కడైనా కట్టారా? ప్రశ్నించారు. అలాగే రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్నారు. మద్ధతుధర ఇస్తామన్నారు… మరి ఇచ్చారా? అన్న విషయంపై కిషన్‌రెడ్డి సమాధానం ఇవ్వాలన్నారు. రాష్ట్ర విభజన చట్టంలో గిరిజన యూనివర్సిటీ, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ రాష్ట్రానికి ఇస్తామని చెప్పారు… కానీ ఏడేళ్లు అయింది… వాటి ల్లో ఏ ఒక్కటి కూడా కేంద్రం ఇవ్వలేదని ఆయన మండిపడ్డారు. ప్రజలను కేంద్రం దగా చేసిందన్నారు.
అలాంటి వారు సంక్షేమ, అభివృద్ధి పథకాలలో దేశంలో మొదటి స్థానంలో ఉన్న తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు చేయడం సిగ్గుచేటని హరీశ్‌రావు విమర్శించారు. గతంలో రూ. 200 పెన్షన్‌ను టిఆర్‌ఎస్ అధికారంలోకి రాగానే రూ. 2000లు ఇస్తామన్నామన్నారు. పశ్చిమ బెంగాల్‌లో వేల కోట్లు ఖర్చు పెట్టి పారామిలటరీ దళాలు దింపి పెద్దఎత్తున అధికార దుర్వినియోగం చేసినా అక్కడి ప్రజలు మమతా బెనర్జీనే గెలిపించారన్నారు. కేరళ, తమిళనాడులో కూడా అదే పరిస్థితి పునరావృతమైందన్నారు. రాష్ట్రంలో ఇటీవల జరిగిన నాగార్జున సాగర్, వరంగల్ కార్పోరేష్‌న్‌కు జరిగిన ఎన్నికల్లో ప్రజలు టిఆర్‌ఎస్‌ను ఆదరించారే తప్ప బిజెపిని కాదన్నారు. కేంద్రం రైతులను మోసం చేస్తుందని గతంలో ఈటల వ్యాఖ్యానించిన విషయా న్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. దీనికి వ్యతిరేకంగా తాను పోరాడతా అని అన్నారని, ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా ఉన్నాయన్నారు. అదే ఈటల ఇప్పుడు బిజె పి కండువా కప్పుకుని… ఆ పార్టీ బాగా చేస్తోందని గొప్పలు చెబుతున్నారని ఎద్దేవా చేశారు.
మాట మార్చింది….మాట త ప్పింది ఎవరు? ఈటల కాదా? అని హరీశ్‌రావు పేర్కొన్నారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా రాజేందర్ కరోనా సమయంలో కేంద్రం మందులు ఇస్తలేదు… వెంటిలేటర్ల, పిపిఎ కిట్లు ఇస్తలేరని అనలేదా? ఒకసారి గుర్తుకు తెచ్చుకోవలన్నారు. కరోనా విషయంలో కేంద్రం చెతులేత్తేసిందని… తెలంగాణను చిన్న చూపు చూస్తున్నదని అన్న ఈటలకు ఇప్పుడు బిజెపిపై ఎందు కు పొగడ్తలు కురిపిస్తున్నారో చెప్పాలన్నారు.మాట మార్చింది ఎవరు…ధర్మం తప్పింది ఎవరన్నారు. ఒక అబద్దాన్ని కూడా నిజం అన్నంత గట్టిగా బిజెపి వాళ్లు చాలా అందంగా చెబుతారన్నారు. క్యాబినెట్ హోదా గల మంత్రులు సైతం ఇదే రకం గా మాట్లాడుతుండడం ఆశ్చర్యంగా ఉందని హరీశ్‌రావు పే ర్కొన్నారు.
పెట్రోల్, డీజీల్ ధరలు పెరగడానికి క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడమే కారణమని పచ్చి అబద్దాలు ఆడుతున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం బేసిక్ ఎక్సైజ్ డ్యూటీతో పాటు, రోడ్‌సెస్, సర్‌ఛార్జి వేస్తోందన్నారు. 3రకాల ఛార్జీల కారణంగా దే శంలో ఇష్టానుసారంగా పెట్రోలియం ఉత్పత్తుల ధరలు పెరుగున్నాయని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. దీని కారణంగానే అన్ని రకాల వస్తువుల ధరలు, ప్రధానంగా నిత్యవసర వ స్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయన్నారు. కేంద్ర మంత్రి స్థాయిలో మాట్లాడినప్పుడు వాస్తవాలు మాట్లాడాలన్నారు. మరింత బాధ్యతాయుతంగా ఉండాలని ఆయన సూ చించారు. గెలుపు, ఓటమలు సహజమని, అంతమాత్రాన్ని మరి వ్యక్తిత్వాన్ని చంపుకుని ఎదుటివారిపై నిందలు వేయాల్సిన అవసరముందా? ఒక్కసారి బిజెపి నాయకులు ఆలోచించుకోవాలని మంత్రి హరీశ్‌రావు సూచించారు.