Wednesday, January 22, 2025

దివాళా కోరు బడ్జెట్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ /హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం 2023-24వ ఆర్ధిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్ దేశ ఆర్ధిక వ్యవస్థను సర్వనాశనం చేసే విధంగా ఉందని, అంతేగాక రాష్ట్రాలను కూడా ఆర్ధికంగా దెబ్బతీసే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తంచేసింది. దేశాన్ని అప్పుల ఊబిలోకి నెట్టడమే కాకుండా, అప్పులతోనే కేంద్ర ప్రభుత్వ పాలనను సాగించాలని బడ్జెట్‌లో ప్రతిపాదించడం ముమ్మాటికీ దేశాన్ని ఆర్ధిక సంక్షోభంలోకి నెట్టే విధంగానే ఉందని తెలంగాణ రాష్ట్ర ఆర్ధిక శాఖామంత్రి టి.హరీష్‌రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పన్నుల ఆదాయంలో రాష్ట్రాల వాటాలను పెంచాలని కోరినప్పటికీ ఈ బడ్జెట్‌లో ఎలాం టి ప్రతిపాదనలను పొందుపరచలేదని, అంతేగాక సెస్-సర్‌చార్జీల రూపంలో లక్షలాది కోట్ల రూపాయల నిధులను దేశ ప్రజల నుంచి ముక్కుపిండి వసూలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం ఆ నిధుల్లో రాష్ట్రాలకు కూడా వాటాలు ఇవ్వాలని 15వ ఆర్ధిక సంఘం చేసిన సిఫారసులను కూడా కేంద్రం తుంగలో తొక్కిందని ఆర్ధిక శాఖామంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సబ్‌లో బుధవారం చేసిన బడ్జెట్ ప్రసంగం స్పష్టంచేసిందని మంత్రి హరీష్‌రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

అప్పులు చేసే విషయంలో ఎఫ్‌ఆర్‌బిఎం చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం పూర్తిగా, యధేచ్ఛగా ఉల్లంఘిస్తూనే ఉందని మండిపడ్డారు. 2023-24లో నికర అప్పులు 17,86,816 కోట్ల రూపాయలుగా ఉందని కేంద్రం తన బడ్జెట్‌లో పేర్కొందని, ఇందులో అప్పులను క్యాపిటల్ వ్యయం (అభివృద్ధికి చేసే ఖర్చులు) కోసం ఖర్చు చేస్తారని, కానీ రోజువారీ ప్రభుత్వపాలన ఖర్చులకు అప్పులు చేయడమంటే ఆర్ధిక వ్యవస్థను నాశనం చేయడమేనని మండిపడ్డారు. 1979-80లో కేంద్ర ప్రభుత్వ రెవెన్యూలోటు 694 కోట్ల రూపాయలు ఉండగా అది కాస్తా 2022-23వ ఆర్ధిక సంవత్సరం నాటికి రికార్డుస్థాయిలో 11,10,546 కోట్లకు పెరిగిందని, ఇది ఎఫ్‌ఆర్‌బిఎం చట్టానికి పూర్తిగా విరుద్ధమని పేర్కొన్నారు. రాష్ట్రాలు ఎఫ్‌ఆర్‌బిఎం నిబంధనలను పాటించినప్పటికీ కేంద్రం ఈ రూల్సును పాటించకుండా అడ్డగోలుగా వ్యవహరించడం మూలంగా దేశ ఆర్ధిక క్రమశిక్షణ దెబ్బతీసే అవకాశం ఉందని తెలిపారు.

కేంద్రం బాగా పనిచేస్తున్న రాష్ట్రాలపై ఎఫ్‌ఆర్‌బిఎం చట్టాన్ని అతిగా అమలుచేస్తూ తాను మాత్రం ఎప్పటికప్పుడు ఎఫ్‌ఆర్‌బిఎం నిబంధనలను ఉల్లంఘిస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని మంత్రి హరీష్‌రావు మండిపడ్డారు. 2022-23వ ఆర్ధిక సంవత్సరంలో కేంద్రం మొత్తం పన్నుల వసూళ్ళు రికార్డుస్థాయిలో 33,68,858 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని, ఇందులో రాష్ట్రాల వాటాగా 10,21,488 కోట్లుగా అంచనా వేశారని తెలిపారు. కేంద్రం వసూలు చేసే మొత్తం పన్నుల ఆదాయంలో 30.4 శాతం మాత్రమే రాష్ట్రాలకు కేంద్రం ఇస్తోందని, వాస్తవానికి 15వ ఆర్ధిక సంఘం సిఫారసుల ప్రకారం కేంద్రం వసూలు చేసే పన్నుల్లో 41 శాతం రాష్ట్రాలకు ఇవ్వాల్సి ఉంది. సెస్‌లు, సర్‌చార్జీలు విధించడం మూలంగా రాష్ట్రాలకు వచ్చే పన్నుల వాటా చాలా తగ్గిపోతున్నదని, దీని మూలంగా రాష్ట్రాలు తీవ్రస్థాయిలో ఆర్ధికంగా నష్టపోతున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రాలకు 41 శాతం వాటా నిధులు ఇస్తున్నామని చెబుతున్న కేంద్రం ఆచరణలో మాత్రం 30 శాతానికి మించడం లేదని పేర్కొన్నారు.

పోనీ పన్నుల భారం నుంచి ప్రజలకు ఏమైనా ఉపశమనం కలిగించే విధంగా పన్నులు తగ్గిస్తున్నారా… అంటే అదీలేదని తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. ఇవి చాలవన్నట్లుగా కేంద్ర ప్రాయోజిత పథకాల్లో కేంద్రం తన వాటాలను తగ్గించుకొని రాష్ట్రాలపై భారం మోపే విధంగా చేయడం, కొన్ని కేంద్ర ప్రాయోజిత పథకాలను కుదించడం మూలంగా ఆ పథకాల అమలు భారం కూడా రాష్ట్రాలపైనే పడుతుండటంతో అన్ని విధాలుగా రాష్ట్రాలు నష్ఠపోతూనే ఉన్నాయని పేర్కొన్నారు. ఇలాంటి దారుణమైన, తప్పుడు విధానాలను సరిదిద్దే ప్రయత్నాలు చేయకుండా మూర్ఖంగా కేంద్రం ముందుకుపోతోందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

హక్కుగా రావాల్సి నిధులకు మొండిచెయ్యి

విభజన చట్టంలో పొందుపరిచినట్లుగా తెలంగాణ రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతాల నిధి కింద మూడేళ్ళుగా హక్కుగా రావాల్సిన 1350 కోట్ల రూపాయల నిధులను కూడా ఇవ్వకుండా మొండిచెయ్యి చూపిందని రాష్ట్ర ఆర్ధికశాఖా మంత్రి టి.హరీష్‌రావు తెలిపారు. పేదల ఆహార భద్రత నిధుల్లో కూడా భారీగా కోత విధించారని, 2022-23లో ఆహారభద్రతకు 2,87,194 కోట్ల రూపాయల నిధులు కేటాయించగా ఈసారి 1,97,350 కోట్లకు తగ్గించారని, అంటే ఏకంగా 89,844 కోట్ల రూపాయలను కేంద్రం ఆహార సబ్సిడిపై కోత విధించిందని, ఇది గత ఏడాదితో పోల్చితే 31 శాతం వరకూ కోత విధించినట్లయ్యిందని తెలిపారు. ఉపాధి హామీ పథకానికి బడ్జెట్‌లో భారీగా నిధుల కేటాయింపుల్లో కోతలు విధించారని, గత బడ్జెట్‌లో ఉపాధి హామీ పథకానికి 89,400 కోట్లు కేటాయించిన కేంద్రం ఈ బడ్జెట్‌లో 60వేల కోట్లను కేటాయించారని, అంటే గతేడాది కంటే ఈసారి బడ్జెట్‌లో 29,400 కోట్ల రూపాయల నిధులను కోత విధించారని మండిపడ్డారు. పీఎం కిసాన్ నిధి కోసం గత ఏడాది 68 వేల కోట్ల బడ్జెట్‌ను కేటాయించగా ఈసారి బడ్జెట్‌లో 60 వేల కోట్లకు కేంద్రం తగ్గించింది.

కానీ లబ్ది పొందే రైతుల సంఖ్యను కూడా కుదిస్తూ వస్తోంది కేంద్రం. పీఎం కిసాన్ పథకంలో గతంలో 11.27 కోట్ల మంది రైతులు లబ్దిపొందగా ప్రస్తుతం ఆ రైతుల సంఖ్యను 8.99 కోట్లకు తగ్గించారు. రైతులకిచ్చే ఎరువుల సబ్సిడీలో భారీగా కొత విధించింది కేంద్రం. గతేడాది ఎరువులపై 2,25,220 కోట్లుండగా ఈ ఏడాది 1,75,100 కోట్లకు తగ్గించారు. అంటే నేరుగా 50,120 కోట్లకు కోత విధించారు. రైతాంగం పండించే పంటలకు శాశ్వత ప్రాతిపదికన కనీస మద్దతు ధరలను ప్రకటించాలని దేశవ్యాప్తంగా రైతాంగం చేసిన ఉద్యమాల నేపధ్యంలో ఎంఎస్‌పిల అమలుకు, ధరల స్థిరీకరణకు ఈ బడ్జెట్‌లో ఎలాంటి ప్రతిపాదనలు లేవని మండిపడ్డారు. రాష్ట్రీయ కృషి వికాస్ యోజన కింద గతేడాది బడ్జెట్‌లో 10,433 కోట్లను కేటాయించగా ఈసారి బడ్జెట్‌లో 7,150 కోట్లకు తగ్గించారని, అంటే ఏకంగా 3,283 కోట్లను కోత విధించారని ఆవేదన వ్యక్తంచేశారు. ఇది పూర్తిగా రైతు వ్యతిరేక బడ్జెట్ అని అనడానికి ఇదొక నిదర్శనమని హరీష్‌రావు అభివర్ణించారు.

ఇక మైనారిటీల కోసం గతేడాది బడ్జెట్‌లో 5,020 కోట్లు కేటాయించగా ఈసారి బడ్జెట్‌లో 3097 కోట్లకు కుదించారని, అంటే 1923 కోట్లు కోత విధించారని తెలిపారు. విద్యుత్ సంస్కరణలను అమలు చేస్తేనే 0.5 శాతం ఎఫ్‌ఆర్‌బిఎంకు అనుమతులు ఇస్తామని షరతు విధించిన కేంద్రం బోరు బాయిలకాడ మీటర్లు పెట్టి రైతులకు కరెంటు బిల్లులు పంపించాలని కేంద్రం చెప్పకనే చెప్పిందని విమర్శించారు. మన రాష్ట్రం ఇప్పటికే మీటర్లు పెట్టబోమని కరాఖండిగా చెప్పిన విషయాన్ని మంత్రి హరీష్‌రావు గుర్తుచేశారు. అంటే ఈ నిబంధన వల్ల రాష్ట్రానికి మరో 6వేల కోట్లు రాకుండా పోతాయని ఆవేదన వ్యక్తంచేశారు. 15వ ఆర్ధిక సంఘం సిఫారసుల మేరకు స్థానిక స్ంసలకు ఖచ్చితంగా నిధులను విడుదల చేయాల్సి ఉందని, కానీ ఆ నిధుల్లో కూడా కేంద్రం కోతలు విధించిందని తెలిపారు. గతేడాదిలో 22,908 కోట్లు కేటాయించి ఆ తర్వాత రివైజ్‌డ్ బడ్జెట్‌లో 15,026 కోట్లకు కేంద్రం కుదించింది. అంటే పట్టణ స్థానిక సంస్థలకు 7,882 కోట్లు కోత విధించారు. గ్రామీణ స్థానిక సంస్థలకు గతేడాది 46,513 కోట్లు కేటాయించి ఆ తర్వాత రివైజ్డ్ బడ్జెట్‌లో 41 వేల కోట్లకు కుదించారు. అంటే 5513 కోట్లు తగ్గించారు.

అందమైన మాటలు… డొల్లతనమే…

కేంద్ర ఆర్ధికశాఖామంత్రి నిర్మలా సీతారామన్ 2023-24వ ఆర్ధిక సంవత్సరానికి లోక్‌సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రసంగం యావత్తూ అందమైన మాటలే ఉన్నాయని, కానీ నిధుల కేటాయింపుల దగ్గరకు వచ్చేసరికి అంతా డొల్లతనమే కనిపించిందని రాష్ట్ర ఆర్ధికశాఖామంత్రి టి.హరీష్‌రావు అభివర్ణించారు. నిర్మలమ్మ బడ్జెట్ యావత్తూ రైతు వ్యతిరేక, పేదల వ్యతిరేక బడ్జెట్‌గా చరిత్రలో నిలిచిపోతుందన్నారు. ఏడు ప్రాధాన్యతా రంగాలని గొప్పగా చెప్పి ఉన్న రంగాలను గాలికి వదిలేశారని దుయ్యబట్టారు. దేశ రైతాంగాన్ని, అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలను నిరుత్సాహపరిచే విధంగా బడ్జెట్‌ను ప్రవేశపెట్టారని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రానికి మరోసారి తీవ్ర అన్యాయం చేసే విధంగా ఈ బడ్జెట్ ఉందన్నారు. తొమ్మిదేళ్ళుగా తెలంగాణ రాష్ట్రం అడుగుతున్న రైల్వే కోచ్ ఫ్యాక్టరీ గురించి ఒక్క మాటను కూడా మాట్లాడలేదని, గిరిజన యూనివర్శిటీకి ఇచ్చిన నిధులు నామమాత్రమేనని ఆవేదన వ్యక్తంచేశారు.

విభజన హామీలనే కాకుండా తెలంగాణలో ఏ ఒక్క నీటిపారుదల ప్రాజెక్టుకూ జాతీయహోదాను ఇవ్వలేదని, రాష్ట్రంలోని నేతన్నలకు జిఎస్‌టి రాయితీలుగానీ, ప్రోతాహకాలు ఇవ్వడమనే ప్రస్తావనే లేకపోవడం బాధాకరమన్నారు. కొత్త రాష్ట్రానికి ప్రోత్సాహకాలు ఇవ్వాలని అనేకసార్లు కోరామని, ఇప్పటి వరకూ అతీగతీలేదని అన్నారు. తెలంగాణకు ఏ ఒక్క పారిశ్రామిక వాడను మంజూరు చేయలేదని, కేంద్ర ఆర్ధిక సంఘాల సిఫారసులను అమలు చేస్తామని కూడా చెప్పలేదని, ఉద్యోగులు-సింగరేణి కార్మికులకు ఇచ్చిన పన్ను మినహాయింపులు కూడా ఆశాజనకంగా ఏమీలేదని, ఉద్యోగులను సైతం భ్రమల్లోపెట్టారని అందుకే ఇది పేదల వ్యతిరేక, కార్పోరేట్‌లకు అనుకూల బడ్జెట్ అని అభివర్ణించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News