గిరిజన కోటా బిల్లు అందలేదని పార్లమెంట్‌లో అబద్ధాలు,
కేంద్రమంత్రి తుడుపై హక్కుల తీర్మానం తెస్తాం: మంత్రి హరీశ్‌రావు
గిరిజనులను అవమానపర్చిన కేంద్రం వెంటనే క్షమాపణ చెప్పాలి
మంత్రిని బర్తరఫ్ చేయాలి
కేంద్రం తీరుకు నిరసనగా నేడు గోండు గూడాల్లో, కాలేజీలు, వర్శిటీల్లో బిజెపి శవయాత్ర నిర్వహిస్తాం
మంత్రులు సత్యవతి రాథోడ్, కొప్పుల ఈశ్వర్, ఎంపి మాలోతు కవితలతో తెలంగాణ భవన్‌లో హరీశ్‌రావు మీడియా భేటీ
మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం నుంచి గిరిజన రిజర్వేషన్ల బిల్లు కేంద్రానికి రాలేదని పార్లమెంట్‌లో పచ్చి అబద్దాలు చెప్పిన కేంద్ర మంత్రి తుడూపై రాష్ట్ర ఆర్ధిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి టి. హరీశ్‌రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇందుకు నిరసనగా బుధవారం కేంద్ర మంత్రిపై టిఆర్‌ఎస్ ఎంపిలు ప్రివిలేజ్ మోషన్ ఇస్తారని వెల్లడించారు. గిరిజనులను అవమాన పరిచిన కేంద్రప్రభుత్వం వెంటనే క్షమాపణ చెప్పాలన్నారు. రిజర్వేషన్ల వ్యవహారంపై పార్లమెంట్‌ను పక్కదారి పట్టించిన కేంద్ర మంత్రిని ప్రధాని నరేంద్రమోడీ తక్షణమే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. రిజర్వేషన్ల బిల్లు రాలేదని చెప్పి గిరిజనులను… రాష్ట్ర ప్రభుత్వాన్ని అవమానించారని మండిపడ్డారు. కేంద్రం తీరును నిరసిస్తూ నేడుం గిరిజన గోండు గుడాల్లో …. కాలేజీలు యూనివర్సిటీల్లో బిజెపి శవ యాత్రలను నిర్వహిస్తామన్నారు.
మంగళవారం తెలంగాణ భవన్‌లో మంత్రులు సత్యవతి రాథోడ్, కొప్పుల ఈశ్వర్‌తో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హరీశ్‌రావు మాట్లాడుతూ, కేంద్రంపై తీవ్ర స్థాయిలో విరుచుకపడ్డారు. కేంద్రం తడిగుడ్డతో గిరిజనుల గొంతుకొస్తుందని అన్నారు. ఇది రెండు పార్టీల వ్యవహారం కాదు, రెండు ప్రభుత్వాల మధ్య వ్యవహారమన్నారు. గిరిజన రిజర్వేషన్లపై కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వం జరిపిన ప్రత్యుత్తరాల లేఖలతో పెద్ద బతుకమ్మనే పేర్చవచ్చునని అన్నారు. ఈ విషయాన్ని తాము ఇంతటితో వదిలి పెట్టబోమన్నారు. కేంద్రమంత్రిపై చర్య తీసుకునే వరకు సభను అడ్డుకుంటామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పంపిన బిల్లును ఈ సమావేశాల్లోనే కేంద్రం ఆమోదించాలని పట్టు బడుతామని హరీశ్‌రావు తెలిపారు. ఇంత పచ్చి అబద్దాలతో పాలన సాగిస్తున్న బిజెపికి ఒక క్షణం కూడా అధికారంలో కొనసాగే హక్కు లేదన్నారు. బిజెపి తీరుతో కేంద్రంలో ఉన్నది ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వమా? లేక ప్రైవేటు కంపెనీ యా? అన్న అంశంపై సందేహం కలుగుతోందన్నారు.
లోక్‌సభలో గిరిజనుల రిజర్వేషన్ల అంశంపై ప్రశ్న అడిగిన కాంగ్రెస్ ఎంపి ఉత్తమ్‌కుమార్ రెడ్డి అప్పట్లో ఎంఎల్‌ఎగా అసెంబ్లీలోనే ఉన్నారని హరీశ్‌రావు గుర్తు చేశారు. ఆయన శాసనసభ్యుడిగా ఉన్నపుడు రిజర్వేషన్ల బిల్లును రాష్ట్ర శాసన సభ ఆమోదించిందన్నారు. ఈ బిల్లు ఆమోదంలో కాంగ్రెస్ కూడా భాగస్వామి అని అన్నారు. ప్రస్తుతం కేంద్ర మంత్రిగా కొనసాగుతున్న కిషన్ రెడ్డి అప్పట్లో ఎంఎల్‌ఎగా కొనసాగారన్నారు. ఆయన కూడా సభ సభ్యుడిగా ఉన్నపుడు బిల్లును ఆమోదించారన్నారు. మోజీ సర్కార్ ప్రభుత్వాన్ని నడుపుతోందా? లేక అబద్దాల ఫ్యాక్టరీ నడుపుతోందా? అని ప్రశ్నించారు. బిజెపి ఫేక్ వార్తలు వాట్సాప్ యూనివర్సిటీ నుంచి పార్లమెంట్ దాకా వెళ్లాయని ఈ సందర్భంగా హరీశ్‌రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత దిక్కు మాలిన కేంద్ర ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా ఉందా? అని మండిపడ్డారు. ఈ బిల్లుపై కేంద్రానికి పలుమార్లు రాసిన ప్రత్యుత్తరాలను మీడియా సమక్షంలో మంత్రి హరీశ్‌రావు చూపించారు.
ఇందులో ప్రధానికే సిఎం కెసిఆర్ రెండు సార్లు లేఖలు రాశారన్నారు. ఐదేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం పంపిన బిల్లును కేంద్రం తొక్కి పెట్టి అసలు ఇపుడే బిల్లే రాలేదని అబద్ధం ఆడడం సిగ్గుచేటని విమర్శించారు. అబద్దాలతో బిజెపి పెద్దలు ఇంకా ఎంతకాలం గిరిజనులను మోసం చేస్తారని నిలదీశారు. ఈ విషయంలో రాష్ట్రం నుంచి నలుగురు కొనసాగుతున్న బిజెపి ఎంపీలు ఉండి సొల్లు మాటలు చెప్పడం తప్ప ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. బిజెపి రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బండి సంజయ్‌క్ సిఎం కెసిఆర్ తిట్టడం తప్ప మరేదైనా చేతనవుతుందా? అని మండిపడ్డాఉ. ఇకనైనా బిజెపి మోసాలను గిరిజన సమాజం గమనించాలన్నారు. తండాలను ఆదివాసి గూడేలను గ్రామపంచాయతీలుగా గుర్తించిన ఘనత కెసిఆర్‌దేనిని అన్నారు.
అనంతరం మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ, కేంద్ర మంత్రి గిరిజన రిజర్వేషన్ల బిల్లుపై మాట్లాడిన మాటలను ఖండిస్తున్నామన్నారు. అసెంబ్లీలో తీర్మానం చేసి ప్రతిపాదనలు పంపితే కేంద్రమంత్రి అవగాహన లేకుండా సోయితప్పి మాట్లాడారని మండిపడ్డారు. కనీస అవగాహన లేని మంత్రిని గిరిజన మంత్రిగా పెట్టడం గిరిజనులను అవమానించడమేనని అన్నారు. అలాంటి వ్యక్తిని వెంటనే కేంద్ర మంత్రివర్గ నుంచి బర్తరఫ్ చేయాలన్నారు.