బీబీనగర్ ఎయిమ్స్‌కు రాష్ట్రం స్థలం ఇవ్వలేదని దుష్ప్రచారం చేస్తున్న కేంద్రమంత్రి
ఎయిమ్స్‌కు 24ఎకరాల స్థలంతో పాటు భవనం కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది, జిఒను కూడా విడుదల చేసింది
మీడియా ఎదుట ఆరోపణ చేసే ముందు కనీస సమాచారాన్ని కూడా కిషన్‌రెడ్డి తెలుసుకోలేదు, అబద్ధాల్లో మిగతా బిజెపి నేతలతో పోటీపడుతున్నారు
తెలంగాణ భవన్‌లో మీడియాతో భేటీలో మంత్రి హరీశ్‌రావు
మన తెలంగాణ/హైదరాబాద్ : బిబి నగర్ ఎయిమ్స్ కోసం రాష్ట్ర ప్రభుత్వం స్థలం ఇవ్వలేదని కేంద్ర పర్యాటక శాఖ జి. కిషన్‌రెడ్డి అసత్య దుష్ప్రచారం చేస్తున్నారని రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి టి. హరీశ్‌రావు మండిపడ్డారు. ఒక కేంద్ర మంత్రిగా కొనసాగుతూ పచ్చి అబద్దాలను కిషన్‌రెడ్డి ఎలా చెబుతున్నారని ప్రశ్నించారు. అబద్దాలు మాట్లాడటంలో మిగతా బిజెపి నేతలతో కిషన్‌రెడ్డి పోటీ పడుతున్నారని ఎద్దేవ చేశారు. ఎయిమ్స్‌కు 24 ఎకరాల స్థలంతో పాటు భవనం కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందని స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించిన జీవోను కూడా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిందని ఆయన గుర్తు చేశారు. మీడియా ముందుకు వచ్చి రాష్ట్ర ప్రభుత్వంపై ఒక ఆరోపణ చేస్తున్న సమయంలో కేంద్రమంత్రి కనీస సమాచారాన్ని కూడా తెలుసుకోకుండానే మాట్లాడితే ఎలా? అని హరీశ్‌రావు ప్రశ్నించారు. గతంలో తెలంగాణ ప్రజలకు ఎర్రబస్సు తప్ప ఏమీ తెలియదని కిషన్‌రెడ్డి అవమానకరంగా మాట్లాడి అభాసు పాలయ్యారన్నారు. ఇప్పటికైనా కిషన్‌రెడ్డి మంచి సలహా బృందాన్ని నియమించుకోవాలని సూచించారు. అసత్య ప్రచారం చేసినందుకుగానూ రాష్ట్ర ప్రజలకు వెంటనే క్షమాపణలు చెప్పాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు.
గురువారం తెలంగాణ భవన్‌లో రైతు బంధు సమితి చైర్మన్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, రాష్ట్ర ఎస్‌సి కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ టిఆర్‌ఎస్ కార్యదర్శులు సోమ భరత్, ఎం.శ్రీనివాస్ రెడ్డి తదిరులతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హరీశ్‌రావు మాట్లాడుతూ, మెడికల్ కళాశాల విషయంలో కేంద్రంతో రాష్ట్రప్రభుత్వం ఉత్తర ప్రత్యుత్తరాలు జరపలేదు అని కిషన్‌రెడ్డి మరో పచ్చి అబద్ధం చెప్పారని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. వరి, సిలిండర్, కెసిఆర్ కిట్ ఇలా అన్ని అంశాల్లో బిజెపివి చెబుతున్నవన్నీ అబద్ధాలేనని ఆయన మండిపడ్డారు.
గతంలో లకా్ష్మరెడ్డి వైద్య శాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఆయన అనేకమార్లు ఢిల్లీకి వెళ్లి మెడికల్ కళాశాలల గురించి మాట్లాడారన్నారు. ఫేస్‌వన్… ఫేస్‌టూలో కాలేజీలు ఇవ్వమని ఫేస్ త్రీలో ఇస్తామని అప్పటి కేంద్ర మంత్రి హర్షవర్ధన్ హామీ ఇచ్చారన్నారు. కానీ ఆ హామీ సంవత్సరాలు అయినా ఇప్పటి వరకు నెరవేరలేదని మంత్రి హరీశ్‌రావు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.రాష్ట్ర ప్రభుత్వం అడగక పోతే హర్షవర్ధన్ ఎందుకు లేఖ రాస్తారని ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా కేంద్రం 157 వైద్య కళాశాలలను మంజూరు చేసిందని.. అందులో ఒక్కటి కూడా తెలంగాణకు ఇవ్వలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై కిషన్‌రెడ్డికి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా వెంటనే రాష్ట్రానికి వైద్యకళాశాల తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో కేంద్రం మొండిచేయి చూపినా రాష్ట్రంలో కొత్తగా వైద్యకళాశాలలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. రాష్ట్రానికి ఎయిమ్స్ ఇస్తామని విభజన చట్టంలోనే కేంద్రం హామీ ఇచ్చిందని…. తామేమి కొత్తగా కోరడం లేదని ఈ సందర్భంగా హరీశ్‌రావు గుర్తుచేశారు.
రాష్ట్ర విభజన హామీలను అమలు చేయండి
విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన అన్ని ప్రయోజనాలను కల్పించాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి మంత్రి హరీశ్‌రావు సూచించారు. ఈ చట్టంలో ఇచ్చిన హామీ ప్రకారం బయ్యారం ఉక్కు పరిశ్రమ, రైల్వే కోచ్ ఫ్యాక్టరి, గిరిజన వర్సిటీని రాష్ట్రానికి ఇప్పించాలని కేంద్రమంత్రికి విజ్ఞప్తి చేశారు. ఎస్‌సి వర్గీకరణ, బిసిల జనగణన చేయాలని అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం ఒక తీర్మానం చేసి కేంద్రానికి పంపామన్నారు. దీనిని కూడా కేంద్రం నుంచి ఆమోదింప చేయాలని కోరారు.
తెలంగాణను చిన్నచూపు చూస్తోంది
ఉత్తర్‌ప్రదేశ్‌కు 27 మెడికల్ కాలేజీలు ఇచ్చిన కేంద్రం తెలంగాణకు ఒక్కటి కూడా ఇవ్వకపోవడం సవతి తల్లి ప్రేమ కాదా? అని మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు. ఇది తెలంగామ రాష్ట్ర ప్రజలను పూర్తిగా అవమానించడమేనని అన్నారు. కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లాల ప్రకారం రాష్ట్రానికి నవోదయ స్కూళ్లను ఇవ్వాలని కేంద్రానని కోరితే ఇప్పటి వరకు మంజూరు చేయలేదన్నారు. భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం అంతర్భాగం కాదా? అని ఆయన నిలదీశారు. నవోదయ పాఠశాలలు ఎందుకు ఇవ్వరో కేంద్రం స్పష్టమైన ప్రకటన చేయాలని ఈ సందర్భంగా హరీశ్‌రావు డిమాండ్ చేశారు. సాగు నీటి ప్రాజెక్టుల్లో దేనికైనా ఒక్కదానికి జాతీయ హోదా అడిగితే…దానికి కూడా కేంద్రం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి స్పందన రాలేదన్నారు. ఇలా అన్ని విషయాల్లో రాష్ట్రం పట్ల కేంద్రం వివక్ష చూపుతోందని ఆయన మండిపడ్డారు. ఉమ్మడి రాష్ట్రంలో ఐదు మెడికల్ కళాశాలలు ఉంటే…. ఇప్పుడు 21కు పెంచుకున్నామన్నారు. ఇంకా 12 మెడికల్ కళాశాలల అవసరం ఉందన్నారు. కిషన్‌రెడ్డి చేతనయితే ఆ మెడికల్ కళాశాలలను మంజూరు చేయించాలన్నారు. 40 శాతం మేర నిధులు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందన్నారు. అలాగే రాష్ట్రంలో ఏడు వందలు ఉన్న మెడికల్ సీట్లను నాలుగు వేలకు పెంచుకున్నామన్నారు. వీటిపై కిషన్‌రెడ్డి ఏ సమాచారం కావాలన్నా ఇస్తామన్నారు. లేదా ఎప్పుడు, ఎక్కడకు రమ్మన్నా వెళ్లడానికి తాను సిద్దంగా ఉన్నానన్నారు. తమకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యన్నారు.
రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న కిషన్‌రెడ్డి అబద్దాలు మాట్లాడం ఎంతమాత్రం హుందాతనం అనిపించుకోదన్నారు. కేంద్రంపై టిఆర్‌ఎస్ శుక్రవారం తలపెట్టిన ధర్నాలు కేవలం ప్రారంభం మాత్రమేనని… మునుముందు వివిధ రూపాల్లో ఆందోళన కొనసాగుతుందన్నారు.
ధాన్యం కొనుగోళ్లలో కేంద్రంది డొల్ల తనం
ధాన్యం కొనబోమని కేంద్ర ప్రభుత్వం చెబుతుండడం సిగ్గుచేటని హరీశ్‌రావు అన్నారు. ఈ విషయంలో కేంద్రం డొల్లతనం బయడపడిందన్నారు. రాష్ట్రంలో పండించిన పంటలను కొనుగోలు చేయలేక కేంద్రం చేతులెత్తేసిందని ఆయన తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. పంజాబ్‌లో ధాన్యం కొనుగోలు చేసిన కేంద్రం తెలంగాణలో మాత్రం ఎందుకు కొనదని ఆయన ప్రశ్నించారు. పైగా ఇప్పుడు రా రైస్ కొంటామని కిషన్‌రెడ్డి కొత్తగా చెబుతున్నారన్నారు. తెలంగాణలో ఉన్న వాతావరణ పరిస్థితుల ప్రకారం బాయిల్ రైసే వస్తుందన్నారు. బాయిల్ రైస్ అనేది రాష్ట్రంలో కొత్తగా సాగు చేస్తున్నది కాదని ఈ సందర్భంగా హరీశ్‌రావు పేర్కొన్నారు. ఈ విషయం కనీసం రాష్ట్రం నుంచి కేంద్రమంత్రిగా ప్రాతినిథ్యం వహిస్తున్న కిషన్‌రెడ్డి కూడా తెలియదా? అని ప్రశ్నించారు. సిలిండర్లపై రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ వేయడం లేదని ఒక ప్రశ్నకు సమాధానంగా మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు.
వీటిపై పన్ను విధిస్తున్న బిజెపి నాయకులు పచ్చి అబద్దాలు ఆడుడుతున్నారని ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ విషయంలో కేంద్రంపై టిఆర్‌ఎస్ పోరాటం మునుముందు మరింత ఉధృతం చేస్తామన్నారు. రాష్ట్ర హక్కుల సాధనకు పార్లమెంటులోనూ కేంద్రాన్ని పూర్తిస్థాయిలో నిలదీస్తామని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు. పారిశ్రామిక వేత్తలకు ఎన్నో సబ్సిడీలు ఇచ్చే కేంద్రం రైతులకు ఎందుకు ఇవ్వరు? నష్టాలు ఎందుకు భరించరని ఆయన ప్రశ్నించారు. ధాన్యంపై కేంద్రం యూ టర్న్ తీసుకోవడం వల్లే సమస్య తలెత్తిందన్నారు. బట్టకాల్చి మీదెయ్యడం… బురద జల్లడం మంచిది కాదన్నారు. రాష్ట్రంలో పండించిన ధాన్యాన్ని కొంటామని కేంద్రం నుంచి ఆర్డర్ తీసుకొస్తే ఎయిర్ పోర్టుకు వెళ్లి కిషన్‌రెడ్డికి సన్మానం చేస్తామన్నారు.