Sunday, December 22, 2024

పేద పిల్లల చదువుపై పెట్టుబడి రాష్ట్రాభివృద్ధిలో భాగమే

- Advertisement -
- Advertisement -

Minister Harish Rao in congratulatory meeting

గురుకులాలతో ఐఐటి, ఎంబిబిఎస్,బిడిఎస్ చదువుతున్న పేద విద్యార్థులు
అభినందన సభలో మంత్రి హరీష్ రావు

హైదరాబాద్ : పేద పిల్లల చదువులపై పెట్టే పెట్టుబడి రాష్ట్ర అభివృద్ధిలో భాగమేనని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. అభివృద్ధి అంటే రోడ్లు, భవనాల ఏర్పాటు మాత్రమే కాదని, భావి తరాల పిల్లల చదువు కూడా ముఖ్యమని ఆయనన్నారు. రేపటి తరం మీద పెట్టే పెట్టుబడి అద్భుత సంపద అని అభిప్రాయం వ్యక్తం చేశారు. విద్యార్థులపై చేసే ఖర్చును క్యాపిటల్ ఎక్స్‌పెండీచర్‌గా అభివర్ణించారు. తెలంగాణ సాంఘీక సంక్షేమ గురుకుల విద్యాలయాల సొసైటీ ఆధ్వర్యంలో బుధవారం ఎంసిఆర్‌హెచ్‌ఆర్‌డిలో ఐఐటి, జెఈఈ, నీట్ 2022 విజేతలకు సన్మాన, అభినందన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు హరీష్‌రావు, కొప్పుల ఈశ్వర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, గురుకుల సొసైటి కార్యదర్శి రోనాల్డ్ రాస్, గోట్ అండ్ షీప్ కార్పొరేషన్ చైర్మన్ బాలరాజు యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ ప్రభుత్వ గురుకులాలు అంటే ఒకప్పుడు పేదవాళ్లు చదివేది అనుకునే వాళ్ళనితెలంగాణ ఏర్పాటు తర్వాత గురుకుల విద్యార్థులు లక్షల ఖర్చుతో చదివే నారాయణ, చైతన్య విద్యార్థులతో పోటీ పడి ర్యాంకులు సాధించారని కొనియాడారు.

తెలంగాణ ప్రభుత్వం కల్పించిన అవకాశం,ప్రిన్సిపాల్, టీచర్ల కృషి వల్ల ఇది సాధ్యమైందని అన్నారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు గురుకుల విద్యార్థులకు 42 ర్యాంకులు మాత్రమే వస్తే ఇప్పుడు ఆ సంఖ్య 1312కు చేరిందని హరీశ్ రావు అన్నారు. నాడు 134 గురుకుల కాలేజీలు ఉంటే నేడు 268 కి పెరిగాయని చెప్పారు. ఇంటర్ చదువు గురుకులాల్లో ఉండేది కాదని, పది చదువుకున్న తర్వాత పనులకు వెళ్లేవారని, అందుకే ముఖ్యమంత్రి అన్ని గురుకులాలను జూనియర్ కాలేజీలుగా అప్‌గ్రేడ్ చేశారని మంత్రి అన్నారు. పేద విద్యార్థులు డాక్టర్లు, ఇంజనీర్లు అయ్యే అవకాశం కల్పించారని పేర్కొన్నారు. రాష్ట్రంలో 290 ఉన్న మొత్తం గురుకులాల సంఖ్య తెలంగాణ వచ్చిన తర్వాత వెయ్యికి చేరువయ్యాయని తెలిపారు. 561 మందిఐఐటి, 750 మంది ఎంబిబిఎస్, బిడిఎస్ చదివే అవకాశం గురుకుల విద్యార్థులు పొందారని మంత్రి అన్నారు. ఇంటర్ తర్వాత డిగ్రీ చదివేందుకు మహిళలు ఎంతో ఇబ్బంది పడేవారని అందుకే ముఖ్యమంత్రి కెసిఆర్ 30 డిగ్రీ కాలేజీలు ప్రత్యేకంగా ప్రారంభించారని తెలిపారు.

దేశంలో తొలిసారి రెసిడెన్షియల్ లా కాలేజీని కూడా తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిందని, పిజి కాలేజీలను కూడా ప్రారంభించిందని హరీష్ రావు తెలిపారు. కేంద్రం రాష్ట్రానికి సైనిక్ స్కూల్ ఇవ్వక పోయినా గురుకుల సొసైటీ ఆధ్వర్యంలో సైనిక్ స్కూల్ ప్రారంభించి ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ లో చేరాలనే విద్యార్థుల కలను సాకారం చేస్తున్నామన్నారు. ఒక పేద ఇంట్లో ఇంజనీర్, డాక్టర్ చదివే అవకాశం రావడం ఎంతో గొప్ప విషయమని అన్నారు. వారి వల్ల కుటుంబంలోనే కాదు ఒక తరంలో మార్పు వస్తుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ సమాజం మీకు ఎంతో ఇచ్చింది, మీరు మంచి స్థాయికి చేరుకుని తిరిగి సమాజానికి ఇవ్వాలి అని హరీష్‌రావు విద్యార్థులనుద్దేశించి అన్నారు. మతాలు, కులాల మధ్య చిచ్చుపెడితే ఏం వస్తుందని, ఆర్థిక, సామాజిక అంతరాలు లేని నవ సమాజ నిర్మాణం కావాలని ఆకాంక్షించారు. అది విద్య వల్లే వస్తుందన్నారు. రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో కార్పొరేట్ తరహా ఇంగ్లీష్ మీడియం విద్యను ప్రభుత్వం తీసుకొచ్చిందని ఇందుకు 700 కోట్లు ఖర్చు చేస్తోందన్నారు. అంబేద్కర్ లా నేటి విద్యార్థులు ఆలోచించాలని, ఉన్నత స్థాయికి ఎదిగాక దేశం కోసం, సమాజం కోసం ఎంతో కొంత చేయాలని ఉద్బోధించారు. మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ చదువుకు దూరంగా ఉండే విద్యార్థులు గురుకులాల వల్ల చదువుకుంటున్నారని, గురుకులాల వల్ల అద్భుత ఫలితాలు వస్తున్నాయని తెలపారు. ప్రతిభ చాటిన వారికి అభినందనలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News