Saturday, November 2, 2024

భవిష్యత్ తరాలకు మొక్కలే తరగని ఆస్తి

- Advertisement -
- Advertisement -

Minister Harish Rao inaugurates Urban Forest Park in Siddipet

సిద్దిపేట: దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా పచ్చదనం కోసం ఏటా బడ్జెట్‌లో 10శాతం నిధులు కేటాయించేలా ప్రత్యేక చట్టం తీసుకొచ్చిన ఘనత సిఎం కెసిఆర్‌దేనని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. గురువారం సిద్దిపేట శివారులో రూ. 4.5కోట్ల వ్యయంతో 500 ఎకరాల్లో నిర్మించిన తేజోవనం అర్బన్ పారెస్ట్ పార్కును ఆయన ప్రారంభించి మాట్లాడారు. సిఎం కెసిఆర్ ప్రత్యేక చొరవతో గత ఐదేళ్లలో 3.67శాతం గ్రీన్ కవర్ తెలంగాణ రాష్ట్రంలో పెరిగిందని తెలిపారు. తెలంగాణకు హరితహారం కార్యక్రమం ద్వారా పచ్చదనం పెంపునకు ప్రణాళిక బద్ధంగా కృషి చేయడం వల్లే ఇది సాధ్యమైందని తెలిపారు. ఇప్పటి వరకు తెలంగాణాలో 109 చోట్ల అర్బన్ పార్కులు ఏర్పాటుకు పనులు ప్రారంభించగా 34 పార్కులను రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించుకున్నామని తెలిపారు. సిద్దిపేట అర్బన్ 35వ దని మంత్రి తెలిపారు. ఐదు వందల ఎకరాల పైగా స్థలంలో ఏర్పాటు చేసిన ఈ అర్బన్ పార్కులో 100 ఎకరాలను ఆక్సిజన్ పార్కు కోసం ప్రత్యేకంగా కేటాయించామని తెలిపారు.

రాష్ట్రంలో అడవుల పునరుజ్జీవం సిద్దిపేట జిల్లా నుంచే ప్రారంభమైందన్నారు. పార్కులో సందర్శకుల కోసం ఇండోర్, అవుట్‌డోర్ గేమ్స్‌ను ఏర్పాటు చేశామని తెలిపారు. సైక్లింగ్ ట్రాక్, వాకింగ్, యోగా, ధ్యానం పార్క్ అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందని తెలిపారు. రానున్న రోజుల్లో సాహస క్రీడలను కూడా ఏర్పాటు చేస్తామని తెలిపారు. మెదక్ పార్కులో మూషిక జింకలు ఉన్నాయని మరో నెల రోజుల్లో సిద్దిపేట పార్కులోనూ మూషిక జింకలను సైతం పార్క్ ఉండేలా చూస్తామన్నారు. సందర్శకుల సౌకర్యార్థం ఓపెన్ లైబ్రరీ, జిల్లా గ్రంథాలయ సంస్థ సౌజన్యంతో ఏర్పాటు చేస్తామన్నారు. మొక్కలు పెంచడమంటే భవిష్యత్ తరాలకు తరగని ఆస్తి అని తెలిపారు. దీనిని గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం ఫారెస్ట్ అర్బన్ పార్కుల అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వామ్యం కావాలన్నారు. సిద్దిపేట జిల్లాలోని ప్రైవేటు, ప్రభుత్వ విద్యార్థులు పార్కును సందర్శించేలా ఉపాధ్యాయులు చొరవ తీసుకోవాలని సూచించారు. వన భోజనాలకు కూడా అర్బన్ పార్కు చక్కగా ఉపయోగపడుతుందని దీనిని పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. అడవుల పునరుద్ధరణతో అటవీ సంపదను, జంతు సంపద ఎంతో రక్షించబడుతుందని తెలిపారు. గ్రీన్ యాక్షన్ ప్లాన్‌ను రాష్ట్రంలో పకడ్బందీగా అమలు చేయడంపై కేంద్రం ప్రభుత్వం సైతం ప్రశంసించిందని అన్నారు.

రాష్ట్రప్రభుత్వం పనితీరుకు ఇదొక నిదర్శమన్నారు. సిద్దిపేట జిల్లాలో 7వేల హెక్టార్లలో అడవులను పునరుద్ధరించామని తెలిపారు. ప్లాస్టిక్‌ను పూర్తి స్థాయిలో నిషేధించి పర్యావరణాన్ని కాపాడడంలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. ఎఫ్‌డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ.. అడవుల పునరుద్ధరణ కోసం సిఎం కెసిఆర్ ఎంతోకృషి చేశారని తెలిపారు. దీంతో వన్యసంపద, జంతుసంపద ఎంతో రక్షించబడుతుందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రాన్ని ఆకుపచ్చగా మార్చేందుకు 200కోట్ల మొక్కలను నాటడానికి శ్రీకారం చుట్టారని అన్నారు. పిసిసిఎఫ్ శోభ మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా 109 అర్బన్ పార్కుల ఏర్పాటుకు శ్రీకారం చుట్టగా 35 పార్కులను ప్రారంభించామని అన్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 59 పార్కులున్నాయన్నారు. కార్యక్రమంలో.. జడ్పీ చైర్‌పర్సన్ వేలేటి రోజాశర్మ, అటవీశాఖ అధికారులు డోబ్రీయాల్, శ్రీధర్‌రావు, ప్రజాప్రతినిధులు, నాయకులు చిట్టి దేవేందర్‌రెడ్డి, కడవేర్గు రాజనర్సు, వేలేటి రాధాకృష్ణశర్మ, మారెడ్డి రవీందర్‌రెడ్డి, మచ్చవేణుగోపాల్‌రెడ్డి,వజీరుద్దీన్,బూర మల్లేశం, లక్కిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, కొండం సంపత్‌రెడ్డి, చంద్రం, గ్యాదరి రవీందర్, శ్రీనివాస్, అబ్దుల్ మోయీజ్, జావిద్ తదితరులున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News