Monday, December 23, 2024

వైరస్ ముప్పు తప్పలేదు

- Advertisement -
- Advertisement -

Minister Harish rao initiated vaccination for children aged 12- to 14 years

ప్రతి ఒక్కరూ
వ్యాక్సిన్ వేసుకోవాలి

12–14 ఏళ్ల పిల్లలకు టీకా కార్యక్రమం ప్రారంభిస్తూ మంత్రి హరీశ్‌రావు
హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌లో 50పడకల సిహెచ్‌సి ఆస్పత్రిని ప్రారంభించిన మంత్రి

మనతెలంగాణ/హైదరాబాద్ : కరోనా ప్రభావం తగ్గింది తప్ప వైరస్ ప్రమాదం ఇంకా పొంచి ఉందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకొని ప్రభుత్వానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. బుధవారం ఖైరతాబాద్‌లో 50 పడకల సిహెచ్‌సి ఆసుపత్రి ప్రారంభంతో పాటు 12- నుంచి 14 ఏళ్ల పిల్లలకు వ్యాక్సినేషన్ ప్రక్రియను మంత్రి ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడు తూ, నేషనల్ వ్యాక్సినేషన్ డే సందర్భంగా 12 నుంచి 14 ఏళ్ల లోపు పిల్లలకు వ్యాక్సినేషన్ అందించడం సంతోషంగా ఉంద న్నారు. కరోనా అయిపోయిందని, ఇక లేదని అనుకోవడం పొర పాటు అని, కరోనా ప్రభావం తగ్గింది తప్ప వైరస్ ప్రమాదం ఇం కా పొంచి ఉందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అందరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. థర్డ్ వేవ్‌లో కరోనా ప్రభావం చూపలేదని, టీకా అవసరం లేదనే నిర్లక్ష్య ధోరణి పెట్టుకోవద్దని అన్నారు. చైనా, అమెరికా, హాంకాంగ్‌లో కొత్త కేసులు వస్తున్నాయని వింటున్నామని, డబ్లూహెచ్‌ఒ కూడా అన్ని దేశాలను అప్రమత్తం చేస్తోందని చెప్పారు. ప్రతి ఒక్కరూ విధిగా వ్యాక్సిన్ వేసుకోవాలని మంత్రి సూచించారు.

మూడింటిలో రెండు వ్యాక్సిన్లు మనవే

ప్రపంచంలో కొత్త వ్యాక్సిన్ రావాలంటే హైదరాబాద్ వైపు చూస్తున్నారని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. భారతదేశంలో కరోనా నివారణకు వచ్చిన మూడు వ్యాక్సిన్లలో రెండు హైదరాబాద్ నుంచి వచ్చినవే అని పేర్కొన్నారు. భారత్ బయోటెక్ నుంచి వచ్చిన కొవాగ్జిన్, బయోలాజిక్ ఈ సంస్థ నుంచి వచ్చిన కొర్బెవాక్స్ రెండూ హైదరాబాద్ నుంచి వచ్చినవే అని తెలిపారు. ఈ రెండో వ్యాక్సిన్ కొర్బెవాక్స్ 12 నుంచి 14 ఏండ్ల లోపు పిల్లలకు వేస్తున్నారని చెప్పారు. ఈ సందర్భంగాఇ బయోలాజిక్ ఈ సంస్థ ఎండీ మహిమా దాట్లకు మంత్రి హరీశ్‌రావు శుభాకాంక్షలు తెలిపారు. మహిమా దాట్ల అద్భుతమైన విజయాలు సాధించారని, ఆమె మరింత ముందుకు వెళ్లాలని, భవిష్యత్తులోనూ ప్రభుత్వం ఆమెకు సహాయ, సహకారాలు అందిస్తుందని అన్నారు.

ఫస్ట్ డోస్ వ్యాక్సినేషన్ 106 శాతం పూర్తి

రాష్ట్రంలో ఫస్ట్ డోస్ వ్యాక్సినేషన్ 106 శాతం పూర్తి చేసుకున్నామని మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. సెకండ్ డోస్ వ్యాక్సినేషన్ 97 శాతం పూర్తి చేసుకున్నామని, 15 నుంచి -17 ఏళ్ల లోపు పిల్లలకు సంబంధించి 87 శాతం వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తయిందని అన్నారు. బుధవారం 12 నుంచి -14 ఏళ్ల ్ల లోపు పిల్లలకు ప్రారంభమైందని చెప్పారు. ఈ వయసు చెందిన పిల్లలు మైనర్లు కాబట్టి.. తల్లిదండ్రులు చొరవ చూపి వ్యాక్సిన్ వేయించాలని సూచించారు. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. 17.23 లక్షల మంది పిల్లలు ఉంటారని అంచనా వేసినట్లు చెప్పారు. ప్రైమరీ హెల్త్ సెంటర్లు, అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లు, బస్తీ దవాఖానాల్లో వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతోందని తెలిపారు. ఎఎన్‌ఎంలు, ఆశాలు ఎంతో కృషి చేశారని, వారి కృషిని గుర్తించి ప్రభుత్వం వారి వేతనాన్ని రూ.1,500 నుండి రూ.9,750 రూపాయలకు పెంచిందని తెలిపారు. మంత్రిగా తానైనా, ఆశాగా మీరైనా అందరం ఒక్కటే అని, అందరం ప్రజలకు సేవ చేయడమే లక్ష్యం అని స్పష్టం చేశారు.

వైద్యారోగ్య శాఖలో 20 వేల పోస్టుల భర్తీ

రాబోయే రోజుల్లో వైద్యారోగ్య శాఖలో 20 వేల మందిని భర్తీ చేయబోతున్నామని మంత్రి హరీశ్ రావు చెప్పారు. కరోనా సమయంలో సేవలు అందించిన వారికి కచ్చితంగా గుర్తింపు ఉంటుందని అన్నారు. రూ.7.55 కోట్లతో నిర్మించుకున్న 50 పడకల సిహెచ్‌సి ఆసుపత్రిని ఖైరతాబాద్‌లో ప్రారంభించుకున్నామని, దీంతో ఇక్కడి స్థానిక ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయని తెలిపారు. ప్రజారోగ్యం బలోపేతం చేసేందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ కృషి చేస్తున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో వసతులు ఏర్పాట్లు చేస్తున్నారని తెలిపారు. మంత్రి హరీశ్ రావు నిత్యం శ్రమిస్తూ.. ఆసుపత్రులు సందర్శిస్తూ పని చేస్తున్నారని కొనియాడారు. అనంతరం ఆశా వర్కర్లకు సన్మానం మంత్రి హరీశ్‌రావు సన్మానించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News