Friday, November 8, 2024

ప్రభుత్వ మెడికల్ కళాశాలను తనిఖీ చేసిన మంత్రి హరీశ్‌రావు

- Advertisement -
- Advertisement -

ఖమ్మం : జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రారంభమయ్యే తరగతులకు అన్ని ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య , కుటుంబ సంక్షేమ, ఆర్థిక శాఖల మంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో పోడు భూమల పట్టాలను పంపిణీ అనంతరం హెలికాప్టర్ ద్వారా ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియానికి చేరుకున్న మంత్రి హరీశ్ రావు, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఇతర ప్రజాప్రతినిధులు నేరుగా పాత కలెక్టరేట్ భవనంలో ఏర్పాటు చేయనున్న ప్రభుత్వ మెడికల్ కళాశాలను తనిఖీ చేశారు. ఈ విద్యా సంవత్సరం నుంచే 100 సీట్లతో నిర్వహించనున్న కళాశాల తరగతులు ప్రారంభం కానున్న నేపథ్యంలో మంత్రులు మెడికల్ కళాశాలలో కొనసాగుతున్న పనులను పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

నిర్దేశించిన సమయానికి పనులన్నీ పూర్తి చేసి సకాలంలో తరగతులు నిర్వహించేందుకు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్, అధికారులను మంత్రి ఆదేశించారు. పాత కలెక్టరేట్ భవనం 5 ఎకరాలు, రోడ్లు, భవనాల శాఖ కార్యాలయం 3ఎకరాలు మొత్తం 8 ఎకరాల సువిశాల ప్రాంగణంలో కళాశాలను ఏర్పాటు చేశామని, ఈ విద్యా సంవత్సరం తరగతులు నిర్వహించేలా తగు చర్యలు చేపట్టామని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వివరించారు. కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో 2023-.24 విద్యా సంవత్సరం నుంచి నేషనల్ మెడికల్ కమిషన్ చట్టం ప్రకారం అనుమతి లభించిన తరువాత తరగతుల నిర్వహణకు అంతా సిద్ధంగా ఉందన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ మెడికల్ కళాశాలకు కేటాయించిన ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లతో మంత్రులు గ్రూప్ ఫొటో దిగారు.

ఈ సందర్భంగా మంత్రుల వెంట ఎంపీలు నామా నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్ర, ఆర్థిక శాఖ స్పెషల్ సీఎస్ రామకృష్ణ రావు, జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్, పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్. వారియర్, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, వైరా ఎమ్మెల్యే రాములు నాయక్, మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, ఐటిడిఎ భద్రాచలం పీవో గౌతమ్ పోట్రూ, ఖమ్మం మునిసిపల్ కమీషనర్ ఆదర్శ్ సురభి, కార్పొరేటర్ కర్నాటి కృష్ణ, ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డా. రాజేశ్వరరావు, డిఎంహెచ్‌ఒ డా.మాలతీ, జిల్లా ప్రధాన ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. వెంకటేశ్వర్లు, ప్రజా ప్రతినిధులు, వైద్యాధికారులు తదితరులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News