Wednesday, January 22, 2025

బస్తీ దవాఖానను ప్రారంభించిన మంత్రి హరీశ్‌రావు

- Advertisement -
- Advertisement -

సిద్దిపేట : దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సిఎం కెసిఆర్ పాలనలో తెలంగాణలో అనేక సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని రాష్ట్ర ఆర్ధిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. సోమవారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని 11 వ వార్డు కాళ్లకుంట కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానను ఆయన ప్రారంభించారు. ఈ సండర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే వారికి రూపాయి ఖర్చు లేకుండా 56 రకాల వైద్య పరీక్షలు ఉచితంగా చేసి అవసరమైతే మందులు సైతం అందిస్తున్నామన్నారు. పేదలు ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లి డబ్బులను వృధా చేసుకోవద్దని ప్రైవేట్‌కు దీటుగా ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయన్నారు. ప్రజలకు అవసరపడే ప్రతి ఒక్కటిని ఒక్కొక్కటిగా పూర్తి చేస్తూ అండగా నిలుస్తున్నామన్నారు.

బిపి, షుగర్ లాంటి వ్యాధి గ్రస్తులకు సైతం నెలకు సరిపడే మందులను ప్రభుత్వం తరుపు నుండే ఇస్తున్నామన్నారు.ఇది నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందన్నారు. అలాగే గుండె, క్యాన్సర్ కు సంబంధించిన సేవలను సైతం సిద్దిపేటలో త్వరలో ప్రారంభించబోతున్నామన్నారు. సిద్దిపేటలో 1000 పడకల ఆసుపత్రి అందుబాటులోకి రానుందన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే వారికి నాణ్యమైన మందులను అందించడంతో పాటు కెసిఆర్ కిట్ లాంటి పథకాలు అందిస్తున్నామన్నారు. దీంతో ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రులపై ఎంతో నమ్మకం పెరిగిందన్నారు. కులాల వారిగా ప్రతి సంఘానికి పక్కా భవనాన్ని నిర్మించి ఇస్తున్నామన్నారు. స్వచ్చ సిద్దిపేటలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం ఉందన్నారు. సంక్రాంతి తర్వాత స్వంత జాగా ఉన్న వారికి ఇల్లు నిర్మించుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం తరుపున మూడు లక్షల సహాయాన్ని అందించబోతున్నామన్నారు. ప్రతి ఒక్కరు ప్రభుత్వ ఆసుపత్రులను సద్వినియోగం చేసుకోవాలన్నారు.

సిద్దిపేట కాళ్లకుంట కాలనీని అన్ని విధాలుగా అభివృద్ది చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ అనంతరెడ్డి, తహశీల్దార్ విజయ సాగర్, జిల్లా వైద్యాశాఖ అధికారి కాశీనాథ్, మున్సిపల్ కమిషనర్ రవీందర్‌రెడ్డి, ప్రజాప్రతినిధులు, నాయకులు కడవేర్గు రాజనర్సు, జంగిటి కనకరాజు, మచ్చ వేణుగోపాల్ రెడ్డి, బాగ్యలక్ష్మి,శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News