సిద్దిపేట: తెలంగాణ ప్రజలకు మంత్రి తన్నీరు హరీశ్‌రావు శివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు బుధవారం ప్రకటన విడుదల చేసి మాట్లాడుతూ.. ప్రజలంతా భక్తి శ్రద్ధలతో పండుగను జరుపుకోవాలని కోరారు. పరమేశ్వరుని అనుగ్రహంతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, స్వామి వారి ఆశీస్సులతో సిఎం కెసిఆర్ నేతృత్వంలో సంక్షేమ ఫలాలు ప్రజలకు సమృద్ధిగా అందుతున్నాయన్నారు. బంగారు తెలంగాణ దిశగా ముందుకు పోతున్నామన్నారు.
సిద్దిపేట ప్రాంతానికి తొలిసారి యాసంగి పంటకు రంగనాయకసాగర్ ద్వారా సాగునీరు ఇచ్చి రైతుల కళ్లలో ఆనందం చూసే గొప్ప సంతృప్తినిచ్చిందన్నారు. రాబోయే రోజుల్లో స్వామి అనుగ్రహంతో గోదావరి జలాలతో ఈ ప్రాంతం సస్యశ్యామలం కాబోతుందని మంత్రి హరీశ్ పేర్కొన్నారు. స్వామి దీవెనలతో కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టాలని ప్రజలంతా కరోనా నిబంధనలు పాటిస్తూ శివరాత్రి పర్వదినం జరుపుకోవాలని ఆయన సూచించారు. ఉపవాస దీక్షలతో ప్రజలందరూ భక్తితో స్వామిని కొలిచి మీ కోర్కెలు నెరవేరాలని, ప్రజలందరూ సుఖశాంతులతో వర్ధిల్లాలని కోరుకుంటున్నానని మంత్రి తెలిపారు.
Minister Harish Rao Maha Shivaratri wishes to people