Sunday, January 19, 2025

జూటా బిజెపి జుమ్లా హామీలు

- Advertisement -
- Advertisement -

Minister Harish Rao Press Meet At Telangana Bhavan

దుబ్బాక, హుజూరాబాద్‌లో ఇలాంటి తప్పుడు వాగ్ధానాలతో మోసం చేసి గెలిచారు
మునుగోడు ప్రజలు మీ దిక్కుమాలిన హామీలు నమ్మరు
హైదరాబాద్‌లో ఇల్లుపోతే ఇల్లు, బైక్‌పోతే బైక్ హామీ ఏమైంది?
బిజెపియేతర ప్రభుత్వాలను మోడీ అరికాలితో తొక్కేసే కుట్ర
ఫ్లోరైడ్‌ను రూపుమాపింది టిఆర్‌ఎస్సే
రాజగోపాల్ రెడ్డి స్వార్థం వల్లే ఉప ఎన్నిక:ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు

మన తెలంగాణ/హైదరాబాద్: ప్రధాని నరేంద్రమోడీ సొంత రాష్ట్రంలోనే వృద్ధాప్య పెన్షన్ రూ. 750 ఇస్తున్నారని… అలాంటిది మునుగోడులో బిజెపిని గెలిపిస్తే రూ. 3వేలు ఎలా ఇస్తారని రాష్ట్ర ఆర్ధిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి టి. హరీశ్‌రావు ప్రశ్నించారు. కన్న తల్లికి అన్నం పెట్టనోడు..పినతల్లికి బంగారు గాజులు తయారు చేయిస్తరంట అలా ఉంది బిజెపి తీరని ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇంత కన్నా మోసం..దగా మరోటి ఉంటదా? అని నిలదీశారు. కేవలం ఒక సెగ్మెంట్‌లో బిజెపి గెలిస్తే…మూడువేల రూపాయల పెన్షన్ ఎలా ఇస్తారో బిజెపి నేతలు దమ్ముంచే చెప్పాలని డిమాండ్ చేశారు. మరి అలాంటప్పుడు దేశమంతాట మూడువేల రూపాయల పెన్షన్ ఇస్తామని బిజెపి నేతలు ఎందుకు చెప్పలేకపోతున్నారన్నారు.
ఆదివారం తెలంగాణ భవన్‌లో పార్టీ నేతలతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ, బిజెపి నేతలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఒక అసెంబ్లీ సెగ్మెంట్‌లో విజయం సాధించడం కోసం పచ్చి అబద్దాలను బిజెపి నేతలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. గతంలో కూడా దుబ్బాక, హుజూరాబాద్‌లో కూడా ఇదే విధంగా ప్రజలను మోసం చేసి విజయం సాధించిన బిజెపి….ఆ ఎన్నికల్లో ఇచ్చిన ఒక హామీనైనా ఎందుకు నెరవేర్చలేకపోయారని మండిపడ్డారు. కేవలం రాజకీయ లబ్ధి కోసం ఎంతగానో దిగజారుతున్నారని విమర్శించారు. దివ్యాంగులకు దేశంలో అత్యధికంగా రూ. 3016 రూ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని హరీశ్‌రావు పేర్కొన్నారు. అలాగే 57 ఏళ్లు దాటిన వారికి రూ. 2016 రూ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. ఇది వాస్తవం కాదా….దమ్ముంటే బిజెపి నాయకులు చెప్పాలని డిమాండ్ చేశారు.

బిజెపివి అన్నీ జుమ్లా మాటలే
బిజెపి చెప్పేవన్నీ జుమ్లా మాటలేనని హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రధాని నరేంద్రమోడీ ఒక ప్రధానిగా అన్ని రాష్ట్రాలను అభివృద్ధి పరచాలన్న లక్షంతో పనిచేయడం లేదన్నారు. కేవలం బిజెపి పాలత రాష్ట్రాలను నెత్తిన పెట్టుకుని బిజెపియేతర ప్రభుత్వాలను అరికాలితో తొక్కేయాలని చూస్తున్నారన్నారు. ఒక ఓటు రెండు రాష్ట్రాలు అన్న కాకినాడ తీర్మానం మొదలు, నిన్న మొన్న రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్న వరకు సబ్ కుచ్ జుమ్లా హై.. జూటా హై అని మండిపడ్డారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు, ఎంఎంస్‌ఎంఇలకు రెండు గంటల్లో రుణాలు, మద్దతు ధరకు చట్టబద్ధత, దేశంలోఅర్హులందరికీ ఇళ్లు, బేటీ బచావ్ బేటీ పడావ్, మేకిన్ ఇండియా, బుల్లెట్ ట్రైన్,పటిష్టమైన లోక్ పాల్ వ్యవస్థ, టెర్రరిజం అంతం కోసమే పెద్ద నోట్లు రద్దు…..వంటి అంశాలన్నీ జూటా ఔర్ జుమ్లాగా హరీశ్‌రావు అభివర్ణించారు. ఇలాగే ప్రస్తుతం మునుగోడులో చెప్పేవి కూడా జూటా ఔర్ జుమ్లానేనని అన్నారు. జిహెచ్‌ఎంసి ఎన్నికల సందర్భంగా అయితే ఇళ్లు పోతే ఇళ్లు..బైకు పోతే బైకు..కారు పోతే కారు.. గుండు పోతే గుండు.. అని వాళ్ల నోటికి మొక్కాలే ఎద్దేవా చేశారు. అసలు ఏ మాత్రం భయం లేకుండా, భక్తి లేకుండా, బాధ్యత లేకుండా.. ఏమైనా మాట్లాడతామన్న రీతిలో బిజెపి వ్యవహరిస్తుండడం సిగ్గుచేటన్నారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు గతంలో బిజెపి నాయకులు ఇచ్చిన హామీలపై వీడియోలను ప్రదర్శించారు.
మోడీ పాలనను పూర్తిగా గాలికి వదిలిపెట్టి తనకు ఆప్తులైన బడాబాబులకు దేశ సంపదను అప్పనంగా దోచిపెడుతున్నారని హరీశ్‌రావు విమర్శించారు. వారికి మేలు కలిగించడమే కోసం నరేంద్ర మోడీ మరీ దిగిజారిపోతున్నారన్నారు. అందుకే నల్లచట్టాలు తెచ్చి మోడీ 750 మంది రైతులను పొట్టనపెట్టుకున్నారన్నారు. ఈ ఉద్యమం తీవ్ర రూపం దాల్చడంతో మోడీ దిక్కులేక చివరకు రైతులకు క్షమాపణలు చెప్పాల్సి వచ్చిందన్నారు. రైతులకు ఇచ్చిన హామీలను ఏడాదైనా అమలు చేయలేదన్నారు.

దివాలాకోరు రాజకీయాలు చేస్తున్న కాషాయనేతలు
దేశంలో బిజెపి దివాలాకోరు రాజకీయాలు చేస్తోందని మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. దుబ్బాక ఉపఎన్నిక సమయంలో ఇస్తామన్న రూ.3 వేల పింఛన్‌తో పాటు జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ ఏమయ్యాయని ఆ పార్టీ నాయకులను నిలదీశారు. బిజెపికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే బిజెపి పాలిత రాష్ట్రాల్లో రూ.3 వేల పెన్షన్లు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. వారివి అమలుకాని హామీలు, అబద్ధపు ప్రచారాలని ఆగ్రహం వ్యక్తంచేశారు. వారు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటిని కూడా నెరవేర్చ లేదన్నారు. కానీ టిఆర్‌ఎస్ పార్టీ ఇవ్వని హామీలను కూడా నెరవేర్చిందన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడేనాటికి రూ.2 వందలుగా ఉన్న పెన్షన్‌ను రూ.2016కు పెంచామన్నారు. అలాగే డయాలసిస్, బీడీ, గీత, నేత కార్మికులకు పింఛన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. మోసపోవడానికి మునుగోడు ప్రజలు అమాయకులు కాదని, చైతన్యవంతులన్నారు.

ఒక్క ఓటు.. రెండు రాష్ట్రాల హామీతో మొదలైన బిజెపి మోసం
బిజెపి మోసాలు ఒక్క ఓటు… రెండు రాష్ట్రాల నుంచి మొదలయ్యాయని హరీశ్‌రావు విమర్శించారు. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియనే అవమానించిన పార్టీ బిజెపి అని ఆగ్రహం వ్యక్తంచేశారు. తల్లిని చంపి బిడ్డను బతికించారని స్వయంగా మోడీ పార్లమెంట్‌లో అన్నారని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలోనే రాష్ట్రానికి చెందిన ఏడు మండలాలను బలవంతంగా ఎపిలో కలిపారన్నారు. ఇప్పటి వరకు ఎపి, తెలంగాణ మధ్య నెలకొన్న కృష్ణా నీటి వాటా తేల్చడం లేదని విమర్శించారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయకు రూ.24 వేల కోట్లు ఇవ్వాలని నీతి ఆయోగ్ చెప్పిందన్నారు. అయితే కేంద్రం ఇప్పటివరకు 24 పైసలు కూడా ఇవ్వలేదని ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు.

ఫ్లోరైడ్ సమస్యకు శాశ్వత పరిష్కారం
ఏడు దశాబ్దాలుగా ఫ్లోరోసిస్‌తో మునుగోడు ప్రజలు బాధపడ్డారన్నారు. గత పాలకులు ఈ సమస్యను ఎవరూ పట్టించుకోలేదన్నారు. ఎన్నికల్లో టిఆర్‌ఎస్ హామీ ఇవ్వకున్నా సిఎం కెసిఆర్ మిషన్ భగీరథ తెచ్చారన్నారు. ఇంటింటికి నాణ్యమైన నీటిని అందించి మునుగోడు నియోజకవర్గంలో ఫ్లోరైడ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపారన్నారు. మునుగోడు ప్రజలపై కెసిఆర్‌కు ఉన్న మోడీకి ఎందుకు ఉంటుందని ప్రశ్నించారు. యాదాద్రిలో అద్భుతమైన ఆలయాన్ని నిర్మించిన నాయకుడు కెసిఆర్ అని…అలాగేనల్లగొండ జిల్లా రైతాంగానికి సాగునీరు పారించిన ఘనత టిఆర్‌ఎస్ ప్రభుత్వానిదేనని అని హరీశ్‌రావు స్పష్టం చేశారు.

భూమికి భారమయ్యేలా పంటలు పండుతున్నాయి
ఒకప్పుడు తెలంగాణలో ఎక్కడ చూసిన బీడు భూములు కనిపించేవని, ప్రస్తుతం కాళేశ్వరం ప్రాజెక్టుతో భూమికి భారమయ్యేలా పంటలు పండుతున్నాయని హరీశ్‌రావు అన్నారు. వ్యవసాయానికి సరిపడా నీరు…ఇరవై నాలుగు గంటల పాటు రైతులకు ఉచితంగా విద్యుత్‌ను సరఫరా చేయడం వల్లే ప్రస్తుతం తెలంగాణలో ఎక్కడా పచ్చటి పోలాలు….ధ్యాన్యపు సిరులు కనిపిస్తున్నాయన్నారు. దీని కారణంగానే పంటల ఉత్పత్తి గణనీయంగా పెరిగిందన్నారు. అందుకే మన దగ్గర పండిన పంటను చివరకు కేంద్రం కూడా కొనలేక చేతులెత్తేసిందని మండిపడ్డారు. ఉమ్మడి నల్గొండ జిల్లాకు ఎస్‌ఆర్‌ఎస్‌పి నుంచి తుంగతుర్తి, కోదాడ, సూర్యాపేట జిల్లాల చిట్టచివరి భూముల వరకు సాగునీళ్లు ఇస్తున్నామన్నారు.

రాజగోపాల్ రెడ్డి స్వార్ధం వల్లే
ఎనిమిదేండ్లుగా అన్యాయం చేస్తున్న బిజెపికి ఓట్లు అడిగే హక్కు లేదని హరీశ్‌రావు విమర్శించారు. డబ్బు పంచి ఎన్నికల్లో గెలుస్తామనే అహంకారంతో బిజెపి ఉందన్నారు. ఆ పార్టీ అభ్యర్ధి రాజగోపాల్ రెడ్డి స్వార్ధం వల్లే మునుగోడు ఉపఎన్నిక వచ్చిందన్నారు. కాంట్రాక్టుల కోసం కోమటిరెడ్డి రాజీనామా చేశాడని ఆయన దుయ్యబట్టారు. అలాంటి వ్యక్తికి నియోజకవర్గ ప్రజలు తగురీతిలో బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. అందుకే టిఆర్‌ఎస్ ప్రచారానికి నియోజకవర్గం ప్రజలు అడుగడుగునా బ్రహ్మరథం పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. నియోజకవర్గం అభివృద్ధి కూడా టిఆర్‌ఎస్‌తోనే సాధ్యమవుతుందన్నారు. రాజగోపాల్ రెడ్డి బిజెపిలో చేరి చాలా తొందరగానే ఆ పార్టీ రాజకీయాలు, జూటా మాటలు వంట బట్టించుకున్నారని విమర్శించారు. మునుగోడులో బిజెపిని గెలిపిస్తే యావత్ తెలంగాణలో రూ. 3 వేలు ఇస్తమని ప్రధానమంత్రి, హోం మంత్రితో చెప్పించాలన్నారు. లేదంటే బేషరతుగా క్షమాపణ చెప్పి చెంపలు వేసుకోవాలని బిజెపి నేతలకు సూచించారు. దిక్కుమాలిన రాజకీయాలకు పాల్పడితే నల్లగొండ ప్రజలు సహించరన్నారు. ఇది చైతన్యవంతమైన ప్రాంతమన్నారు. గత ఎన్నికల్లో రాజగోపాల్ రెడ్డి గెలిచాక, ముడేళ్లలో ఒక్క సారి కనపడలేదని నియోజకవర్గ ప్రజలు చెబుతున్నారన్నారు. రాజగోపాల్ రెడ్డి అహంకారం గెలవాలా? మునుగోడు ప్రజల ఆత్మగౌరవం గెలవాలా? అని ప్రశ్నించారు. అసలు ఈ ఉపఎన్నిక ఎందుకు వచ్చింది? ఎవరి కోసం వచ్చింది? ఏ ప్రయోజనాలు ఆశించి వచ్చింది? ఎందుకు రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశారన్న అంశాలపై నియోజకవర్గ ప్రజలు లోతుగా చర్చించుకుంటున్నారన్నారు.

ఆకలి సూచీలో 107 స్థానానికి దిగజారం
నరంద్రమోడీ పాలనలో దేశంలో ఆకలి పెరిగిపోయిందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఇందుకు ప్రపంచ ఆకలి సూచీలో 101 స్థానం నుంచి భారత్ 107వ స్థానానికి పడిపోయిందన్నారు. బంగ్లాదేశ్, నేపాల్, పాకిస్థాన్ కన్నా మన దేశంలో ఆకలి ఎక్కువగా ఉందని తెలుస్తోందన్నారు. ఇంతకన్న సిగ్గుచోటు మరోటి ఉండదన్నారు. అయినప్పటికీ మోడీలో ఇంత చలనం లేకపోవడం శోచనీయమైన వ్యాఖ్యానించారు. మోడీ అసమర్ధ పాలనకు ఆకలి సూచీ అద్దం పడుతోందని మండిపడ్డారు. మోడీ పాలనలో పేదరికం తగ్గలేదు… రైతులు బాగపడలేదని విమర్శించారు. కనీసం ఒక ప్రాంతం… ఒక వర్గం బాగుపడింది లేదన్నారు. దళితులు, గిరిజనులు, కార్మికుల బతుకుల్లో మార్పు లేదన్నారు. ఏమన్న అంటే విద్వేశాలు రెచ్చగొట్టి లబ్ధి పొందడమే తప్ప మీరు చేసిందేమి ఏమిటని ఈ సందర్భంగా హరీశ్‌రావు ప్రశ్నించారు.

మోడీ ప్రభుత్వం ఏమైనా చేసింది అంటే…
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఏమైనా చేసిందంటే…అది కేవలం ధరలను పెంచిందని హరీశ్‌రావు వ్యంగ్యస్త్రాలను సంధించారు.
గ్యాస్ ధరలు రూ. 1200లకు, నిరుద్యోగం, ఆకలి పెంచిందన్నారు. పెట్రోల్, డిజీల్ ధరలను బాగా పెంచిందన్నారు ఇక దేశ జిడిపిని దించింది.. రుపాయి విలువను పూర్తిగా దిగచార్చిందని మండిపడ్డారు. ఫలితంగా పేదలు, సామాన్య ప్రజలు దేశంలో బతుకలేని పరిస్థితిని తీసుకొచ్చిందని హరీశ్‌రావు వ్యాఖ్యానించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News