Thursday, November 21, 2024

జాతీయ ముఖ చిత్రంలో తెలంగాణ రాష్ట్రం ప్రత్యేకం

- Advertisement -
- Advertisement -

మంచిర్యాల: జాతీయ ముఖ చిత్రంలో తెలంగాణ రాష్ట్రం ప్రత్యేకమని, రాష్ట్రంలో అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలతో తెలంగాణ రాష్ట్రం దేశం దృష్టిని ఆకర్షిస్తుందని రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య, వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. శనివారం జిల్లా పర్యటనలో భాగంగా ప్రభుత్వ విప్, చెన్నూర్ శాసనసభ్యులు బాల్క సుమన్, పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు బోర్లకుంట వెంకటేష్ నేత, జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్, రామగుండం కమిషనర్ ఆఫ్ పోలీస్ రెమా రాజేశ్వరి, డి.సి.పి. సుధీర్ రామ్ నాథ్ కేకన్, శాసనమండలి సభ్యులు దండే విఠల్, మంచిర్యాల, బెల్లంపల్లి నియోజకవర్గాల శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు, దుర్గం చిన్నయ్యలతో కలిసి హాజీపూర్ మండలంలోని దొనబండ ప్రాంతంలో 3 కోట్ల రూపాయలతో 33/11 కె. వి. సబ్ స్టేషన్ పనులకు శంకుస్థాపన చేసి పడ్తనపల్లి ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ…. రాష్ట్ర అభివృద్ధికి ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుందని, తెలంగాణ ఆచరిస్తుంది – దేశం అనుసరిస్తుంది అనే స్థాయికి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం జరుగుతుందని అన్నారు. 85 కోట్ల రూపాయలతో నిర్మించిన పడ్తనపల్లి ఎత్తిపోతల పథకం ద్వారా 18 గ్రామాలకు సాగు నీరు అందుతుందని, తద్వారా సమృద్ధిగా సాగునీరు అందుబాటులో ఉండడంతో రెండు పంటలు పండుతాయని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం పాలనలో రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి చెందిందని అన్నారు. దొనబండ ప్రాంతంలో విద్యుత్ సమస్యను పరిష్కరించేందుకు 3 కోట్ల రూపాయలతో 33/11 కె. వి. సబ్ స్టేషన్ పనులకు శంకుస్థాపన చేయడం జరిగిందని అన్నారు.

తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ సమయంలో మంచిర్యాల జిల్లాను ఏర్పాటు చేస్తామని ఇచ్చిన మాటను తెలంగాణ ప్రభుత్వం నెరవేర్చుకుందని అన్నారు. మంచిర్యాల జిల్లాకు 500 కోట్ల రూపాయలతో ప్రభుత్వ వైద్య కళాశాల, నర్సింగ్ కళాశాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని, 600 పడకల ఆసుపత్రి నిర్మించడం జరుగుతుందని అన్నారు. మిషన్ భగీరథ పథకం ద్వారా ఆడపడుచుల ఇబ్బందులను పరిష్కరిస్తూ ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ ద్వారా త్రాగు నీటిని అందించడం జరుగుతుందని, పేదింటి ఆడపడుచు పెళ్లికి కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ పథకాల ద్వారా పెండ్లి కానుకగా 1 లక్ష రూపాయలను అందించడం జరుగుతుందని, రాష్ట్రవ్యాప్తంగా 12 లక్షల 70 మంది ఆడపడుచుల పెళ్లిళ్లకు 11 వేల కోట్ల రూపాయలు అందించడం జరిగిందని అన్నారు.

మహిళా సంక్షేమం దిశగా కెసిఆర్ కిట్, అమ్మ ఒడి వాహనం, ఆరోగ్య లక్ష్మి, న్యూట్రిషన్ కిట్ కార్యక్రమాలు అమలు చేస్తుందని, తెలంగాణ ప్రభుత్వంలో గర్భిణులకు ప్రభుత్వ ఆసుపత్రులలో ఉచితంగా ప్రసవాలు చేసి కేసిఆర్ కిట్లు అందించి అమ్మ ఒడి వాహనం ద్వారా ఇంటి వద్దకు చేర్చడం జరుగుతుందని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులను మరింత బలోపేతం చేసి ప్రజలకు మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలను అందించడం జరుగుతుందని అన్నారు.

తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు సమయానికి 200 రూపాయలు ఉన్న పెన్షన్ ను 2 వేల రూపాయలకు పెంచి ఇస్తున్నామని, రైతుబంధు పథకం ద్వారా ఎకరానికి 5 వేల రూపాయల పెట్టుబడి సాయం అందించడం జరుగుతుందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేసి రాష్ట్రాన్ని సాధించడం జరిగిందని అన్నారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత తెలంగాణ ప్రభుత్వంలో అభివృద్ధి, సంక్షేమాలలో ఎంతో ప్రగతి సాధించడం జరిగిందని, రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసుకోవడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News