Friday, November 22, 2024

కెసిఆర్ మాట జవదాటను

- Advertisement -
- Advertisement -

Minister Harish Rao responded to Etela Rajender Comments

రాజేందర్ మాటల్లో మనో వికారమే తప్ప సత్యం ఎంతమాత్రం లేదు
నా పేరును పదే పదే ప్రస్తావించడం ఆయన భావదారిద్య్రానికి నిదర్శనం
మాజీ మంత్రి ఈటలపై హరీశ్‌రావు ఘాటైన వ్యాఖ్యలు

“టిఆర్‌ఎస్ పార్టీలో నిబద్ధత, విధేయత, క్రమశిక్షణ కలిగిన కార్యకర్తను. పార్టీ ఆవిర్భావం నుంచి నేటి వరకు టిఆర్‌ఎస్ ప్రయోజనాలే పరమావధిగా పనిచేస్తున్నా. సిఎం కెసిఆర్ ఏ ఆదేశం ఇచ్చినా శిరసావ హించడం నా కర్తవ్యం. ఆయన నాకు గురువు, మార్గదర్శి, తండ్రితో సమానం. కెసిఆర్ మాటను జవదాటకుండా నడుచుకుంటున్నా. నా కంఠంలో ఊపిరి ఉన్నంత వరకు ఇలాగే ఉంటా ”-మంత్రి హరీశ్‌రావు

మనతెలంగాణ/హైదరాబాద్: బహిష్కృత మంత్రి ఈటెల రాజేందర్ టిఆర్‌ఎస్ పార్టీని వీడటంపై రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు సంచలన కామెంట్స్ చేశారు. తాచెడ్డ కోతి వనమెల్ల చెరిచిందన్నట్టుగా ఈటల రాజేందర్ వైఖరి ఉందంటూ ఆయన ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఈటల పార్టీని వీడడానికి ఆయనకు అనేక కారణాలు ఉండొచ్చన్నారు. పార్టీలో ఉండాలా.. వెళ్లిపోవాలా అన్నది ఈటల ఇష్టమని హరీష్‌రావు వ్యాఖ్యానించారు. హరీష్ రావు సైతం అనేక అవమానాలు ఎదుర్కొన్నారంటూ ఈటల రాజేందర్ వ్యాఖ్యలు చేసిన దరిమిలా శనివారం హరీష్‌రావు స్పందించారు. ఈటల వ్యాఖ్యలను హరీష్‌రావు తీవ్రంగా ఖండించారు. అలాగే ఈటల తీరును తూర్పారబడుతూ హరీష్‌రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈటల వ్యాఖ్యల నేపథ్యంలో శనివారం మంత్రి హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ టిఆర్‌ఎస్ పార్టీలో తాను నిబద్ధత, విధేయ, క్రమశిక్షణ ఉన్న కార్యకర్తనని ఆయన పేర్కొన్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి నేటి వరకు పార్టీ ప్రయోజనాలే పరమావధిగా పనిచేస్తున్నానని, పార్టీ కార్యకర్తగా ఉన్న తనకు పార్టీ, నాయకత్వం ఏ పని అప్పగించినా దానిని పూర్తిచేయడం తన విధిగా భావించానన్నారు. పార్టీ నాయకుడిగా సిఎం కెసిఆర్ ఏ ఆదేశం ఇచ్చినా శిరసావహించడం తన కర్తవ్యంగా భావిస్తానన్నారు.

కెసిఆర్ పార్టీ అధ్యక్షులే కాదనీ, తనకు గురువని, తనకు మార్గదర్శి, తనకు తండ్రితో సమానులని ఆయన తెలిపారు. ఆయన మాట జవదాటకుండా నడుచుకుంటున్నానన్నారు. గతంలో అనేకసార్లు ఇదే విషయం సుస్పష్టంగా తేల్చి చెప్పానని, ఇప్పుడు కూడా అదే చెబుతున్నానన్నారు. తన కంఠంలో ఊపిరి ఉన్నంతవరకు ఇలాగే నడుచుకుంటానని అని హరీష్ రావు చెప్పుకొచ్చారు. ఈటల పార్టీని వీడడం వలన టిఆర్‌ఎస్‌కు వీసమొత్తు నష్టం లేదని మంత్రి హరీష్‌రావు పేర్కొన్నారు. ఈటల పార్టీకి చేసిన సేవకన్నా, పార్టీ ఆయనకు ఇచ్చిన అవకాశాలే ఎక్కువన్నారు. తన సమస్యలను, తన గొడవకు నైతిక బలం కోసం పదేపదే తన పేరును ప్రస్తావించడం ఈటల రాజేందర్ భావదారిద్రానికి, విజ్ఞతకు, విచక్షణలేమికి నిదర్శనమన్నారు. నా భుజాత మీద తుపాకి పెట్టాలనుకోవడం విఫల ప్రయత్నం మాత్రమే కాదనీ, వికారమైన ప్రయత్నం కూడా అని హరీష్‌రావు ఆరోపించారు. ఈటల మాటల్లో మనో వికారమే తప్ప సత్యం ఎంతమాత్రం లేదన్నారు. తన గురించి ఈటల చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానని మంత్రి హరీష్‌రావు స్పష్టం చేశారు.

Minister Harish Rao responded to Etela Rajender Comments

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News