డిసెంబరు మొదటి వారంలో
ములుగు, సిరిసిల్ల జిల్లాల్లో ప్రయోగాత్మకంగా
ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలి
తెలంగాణ డయాగ్నసిస్ సేవలు వినియోగించండి
వైద్య ఆరోగ్య సమీక్షలో మంత్రి హరీష్ రావు
మనతెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ హెల్త్ ప్రొఫైల్ పక్కాగా రూపొందించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ, ఆర్ధిక మంత్రి టి.హరీష్‌రావు అధికారులకు ఆదేశించారు. డిసెంబరు మొదటి వారంలో ములుగు, సిరిసిల్ల జిల్లాల్లో ప్రయోగాత్మకంగా తెలంగాణ హెల్త్ ప్రొఫైల్ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలని తెలిపారు. రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్ వాకాటి కరుణ, ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాస్‌రావు, ఒఎస్‌డి గంగాధర్‌లతో కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ కమిటి ములుగు, సిరిసిల్ల జిల్లాల్లో పర్యటించి, ఆ జిల్లా కలెక్టర్లు, జిల్లా వైద్య, ఆరోగ్య సిబ్బందితో కలిసి అవసరమైన సన్నాహక ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని మంత్రి ఆదేశించారు. తెలంగాణ హెల్త్ ప్రొఫైల్‌లో ప్రస్తుతం ఎనిమిది టెస్ట్‌లు చేస్తున్నారని, అదే తెలంగాణ డయాగ్నసిస్ ద్వారా అయితే 57 టెస్ట్‌లు చేయవచ్చని ఈ దిశగా చర్యలు తీసుకోవాలని మంత్రి హరీష్‌రావు సూచించారు. తెలంగాణ డయాగ్నసిస్ ఎక్విట్మెంట్ ద్వారా 10 టెస్టులు చేయవచ్చని అన్నారు.
ప్రతీ ఇంటికి వెళ్లి ఆరోగ్య సమాచారం తీసుకోవాలని, నోడల్ ఆఫీసర్లను నియమించి వేగంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని మంత్రి చెప్పారు. మంత్రి హరీష్‌రావు సోమవారం బిఆర్కెఆర్ భవన్లో వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి ఎస్ఎఎం రిజ్వీ, రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్ వాకాటి కరుణ,డీహెచ్ జి.శ్రీనివాస్‌రావు, డిఎంఇ రమేష్ రెడ్డి,ఒఎస్‌డి గంగాథర్ తదితరులు పాల్గొన్నారు. ములుగు, రాజన్న సిరిసిల్ల జిల్లాలలో ప్రయోగాత్మకంగా హెల్త్ ఫ్రోఫైల్ తయారు ఎలా తయారు చేయనున్నారో, ఆ వివరాలను ఈ సందర్బంగా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు మంత్రి హరీష్‌రావుకు వివరించారు.
ఈ జిల్లాల్లో ప్రతీ వ్యక్తి ఆరోగ్య సమాచారం, ఆధార్ నెంబర్, డెమోగ్రాఫిక్ వివరాలు, షుగర్, బీపీ, ఇతర వ్యాధుల సమాచారం సేకరించనున్నట్లు తెలిపారు. ఈ సమాచారం వల్ల వ్యక్తుల ఆరోగ్యానికి సంబంధించిన రిస్క్ అసెస్మెంట్, హై రిస్క్ వాళ్లను గుర్తించడం జరుగుందని అన్నారు. అనంతరం వారికి అవసరమైవ వైద్య సేవలు అందించనున్నట్లు పేర్కొన్నారు. ఈ పరీక్షలు పూర్తయిన వారి ఆరోగ్య సమాచారం డిజిటల్ రూపంలో క్లౌడ్ స్టోరేజి చేస్తారని, అందులో ప్రతీ వ్యక్తి ఆరోగ్య సమాచారం అంతా నిక్లిప్తం చేయనున్నట్లు మంత్రికి వివరించారు.
ప్రయోగాత్మకంగా రెండు జిల్లాల్లో చేపట్టే ఈ ఆరోగ్య సమాచార సేకరణ పక్కాగా ఉండలని మంత్రి హరీష్‌రావు అన్నారు. ఏ వ్యక్తి ఆసుపత్రికి వెళ్లినా, లేదా ఏ వ్యక్తి యాక్సిడెంట్‌కు గురయినా అతని ఆరోగ్య సమాచారం అంతా క్లౌడ్ స్టోరేజ్ నుండి తెప్పించుకునేలా ఉండాలని చెప్పారు. అదే రీతిలో రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ హెల్త్ ప్రోఫైల్ సమాచారం పకడ్బందీగా సేకరిస్తే ప్రభుత్వం సమర్ధవంతంగా ఆరోగ్య కార్యక్రమాలు నిర్వహించవచ్చన్నదే సిఎం ఆలోచన అని పేర్కొన్నారు. సమాచారం పక్కాగా ఉంటే రాష్ట్రంలో ఏ ప్రాంతంలో, ఏ వ్యాధులు ఎక్కువ ఉన్నాయి..? ఆ ప్రాంతంలో ఎలాంటి వైద్య సేవలు అవసరం, ఎలాంటి మందులు అవసరం, ఎలాంటి వైద్య నిపుణులు, అవసరమైన మెడికల్ డివైసెస్ అవసరమో తెలుస్తుందని అన్నారు.