గజ్వేల్ : రెండు నెలలు కష్టపడి కాకుండా ఇష్టపడి చదివితే.. మీ జీవితాంతం తలెత్తుకుని బతకొచ్చునని పోలీసు శిక్షణ పొందే ఉద్యోగార్థులకు రాష్ట్ర మంత్రి హరీశ్ రావు పిలుపునిచ్చారు. గజ్వేల్ పట్టణంలోని ఫంక్షన్ హాల్ లో పోలీసు కానిస్టేబుల్ కోచింగ్ తీసుకుంటున్న అభ్యర్థులను ఉద్దేశించి మంత్రి మాట్లాడారు. దేశంలోనే తొలిసారిగా ఎక్కడా లేని విధంగా 95 శాతం స్థానికులకే ఉద్యోగాలు కల్పించిన ఏకైక ముఖ్యమంత్రి మన కేసీఆర్ అని చెప్పారు. మొత్తం 91 వేల ఉద్యోగాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసినట్లు, వాటిలో పోలీసు శాఖలో 18 వేల ఉద్యోగ నియామకాలకు నోటిఫికేషన్ రావడం గొప్ప విషయమని, పట్టుదలతో చదివి మీ కుటుంబాన్ని ఆనందమయంలో ముంచాలని, బిడ్డ ప్రయోజకులుగా మారితే తల్లిదండ్రుల ఆనందం వెలకట్టలేనిదని.. గతంలో శిక్షణ పొందిన పలువురు అభ్యర్థుల అనుభవాలను వివరించారు.
ఈ శిక్షణ కేవలం గ్రూప్స్ కే కాదని, అన్నీ పోటీ పరీక్షలకు ఉపయోగకరంగా ఉంటుందని, ప్రిల్సిమ్స్ తర్వాత మెయిన్స్ కోసం కూడా ఉచితంగా శిక్షణ ఇప్పిస్తానని, అలాగే స్టడీ మెటీరియల్స్ కూడా త్వరలోనే ఇప్పిస్తానని భరోసా ఇచ్చారు. ఆర్అండ్ఆర్ కాలనీ కుటుంబాలు చేసిన త్యాగం వెలకట్టలేనిదని, మరువలేనిదని, ఆర్అండ్ఆర్ కాలనీకి చెందిన 60 మందికి ప్రత్యేక శిక్షణ అందిస్తున్నట్లు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని కోరారు. భవిష్యత్తులో ప్రయివేటు సెక్టారులో చాలా అవకాశాలు ఉన్నాయని, అలాగే గజ్వేల్ ఉద్యోగార్థులకు లైబ్రరీలో మొబైల్ యాప్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకుంటే.. రాష్ట్ర, జాతీయ ప్రభుత్వ, ప్రయివేటు రంగ ఉద్యోగ-జాబ్ నోటిఫికేషన్లు వస్తాయని వెల్లడించారు.