Friday, November 22, 2024

ఖాళీ ప్లాట్లలో చెత్త వేయొద్దు: మంత్రి హరీశ్

- Advertisement -
- Advertisement -

Minister Harish Rao said garbage should not be dumped in vacant plots

కాలనీ వాసులదే జిమ్మేదారు

సిద్దిపేట : ఖాళీ ప్లాట్లలో చెత్త వేయొద్దని, వేస్తే కాలనీ వాసులదే జిమ్మేదారుగా వ్యవహరించేలా చర్యలు తీసుకోవాలని 7వ, 9వ వార్డు ప్రజలను ఉద్దేశించి మంత్రి హరీశ్ రావు చెప్పారు. మీ అందరి సహకారం అందిస్తే.. స్వచ్ఛ సిద్దిపేటను తయారు చేసుకుందామని తడి, పొడి, హానికరమైన చెత్త వేర్వేరుగా ఇచ్చి సహకరించాలని ప్రజలకు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రమైన సిద్దిపేట మున్సిపాలిటీ 7వ వార్డులో రూ.25 లక్షలతో 9వ వార్డులో రూ.20 లక్షలతో సిసి రోడ్ల పునరుద్ధరణ-నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా అక్కడి ప్రజలతో మమేకమై మంత్రి మాట్లాడారు. రోజు ఇంటింటికీ చెత్త బండొస్తుందా.. వస్తే ఏ సమయానికి వస్తుందని ప్రజలను అడిగి తెలుసుకుని, తడి, పొడి చెత్త వేర్వేరుగా ఇస్తున్నారా.. లేదా అంటూ ఆరా తీశారు. 7వ వార్డులో ఓపెన్, ఖాళీ ప్లాట్లలో చెత్త తీయిస్తే.. మరోసారి వేయకుండా మీరు బాధ్యత వహిస్తామని మాట ఇవ్వాలని 7వ వార్డు కాలనీ వాసుల నుంచి మంత్రి మాట తీసుకుని, ఖాళీ ప్లాట్లలో చెత్త లేకుండా క్లీన్ చేయాలని మున్సిపల్ శానిటేషన్ అధికారులను మంత్రి ఆదేశించారు.

పాల ప్యాకెట్లు, పెరుగు ప్యాకెట్లు, షాంపూ ప్యాకెట్లు పొడి చెత్త కిందకు వస్తాయని.. కానీ మున్సిపాలిటీ వాళ్లు తడిగా ఉన్నాయని తీసుకుపోవడం లేదని ఆయా కాలనీ వాసులు మంత్రి దృష్టికి తెచ్చారు. ఈ విషయమై తడి, పొడి చెట్లపై ప్రజలకు అవగాహన, అర్థమయ్యేలా.. అలవాటుగా మారేందుకు ఈ విధానంతో ముందుకు వెళ్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ రమణాచారి మంత్రికి వివరించారు. ఇక నుంచి ఆ విధానం తీసేసి పొడి చెత్తగా తీసుకెళ్లాలని మున్సిపల్ అధికార యంత్రాంగాన్ని మంత్రి ఆదేశించారు. కాలనీ వాసులకు తడి, పొడి, హానికరమైన చెత్తపై సమగ్రంగా వివరిస్తూ.. అవగాహన కల్పించి, మీ సహకారాన్ని అందిస్తే.. అందరికీ మేలు జరుగుతుందని ప్రజలకు అర్థమయ్యేలా మంత్రి వివరించారు. చెత్తబండొస్తే ప్రజలకు సమయం తెలిసేలా పని చేయాలని మున్సిపల్ అధికారులను మంత్రి శ్రీ హరీశ్ రావు ఆదేశించారు. నల్లా నీళ్లు వృథాగా పోతున్నట్లు పలువురు కాలనీ మహిళలు మంత్రి దృష్టికి తేగా.. ఎంతో వ్యయంతో నీళ్లు తెస్తున్నామని ప్రజలకు అవగాహన కల్పించి  నీళ్లు వృథా చేయొద్దు.. నల్లా పట్టి బంద్ చేయండని విన్నవించారు. యూజీడీతో గల్లీలో గుంతలు ఏర్పడి ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు రోడ్లు వేయించాలని అవ్వ భూ లక్ష్మీ మంత్రి దృష్టికి తెచ్చి కోరగా.. 15 రోజుల్లో నీ గల్లీలో సిసిరోడ్లు వేసి గచ్చులా మారుస్తామని భరోసా ఇచ్చారు. 9వ వార్డు కాలనీలో ప్రధానంగా పెద్ద మోరీ సమస్య పరిష్కారానికి కృషి చేయాలని ప్రజలు కోరగా, వెంటనే ప్రతిపాదనలు సిద్ధం చేసి పనులు చేపట్టాలని మున్సిపల్ కమిషనర్ రమణాచారికి మంత్రి సూచించారు.

కాలనీలో కోతులు, వీధి కుక్కల బెడద ఎక్కువ ఉన్నదని మంత్రి దృష్టికి తేగా.. కోతుల సమస్య పరిష్కారంతో పాటు, వీధి కుక్కల నియంత్రణకై యానిమాల్ బర్త్ కంట్రోల్ యూనిట్ పెట్టినట్లు రెండు రోజుల్లో నివారించాలని మున్సిపల్ వర్గాలకు సూచించారు. ప్రతి వార్డుల్లోని కాలనీల్లో శానిటేషన్ జవాన్ ఫోన్ నెంబర్లు గోడలపై రాయాలని మున్సిపల్ అధికారులకు మంత్రి సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మంజుల రాజనర్సు, మున్సిపల్ కౌన్సిలర్లు శ్రీదేవి-బుచ్చిరెడ్డి, పసుపుల సతీశ్, మార్కెట్ కమిటీ ఛైర్మన్ పాల సాయిరాం, ఈఈ వీర ప్రతాప్, ఏఈలు, శానిటేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News