Friday, January 24, 2025

తిట్లు తిట్టడంలో పోటీ పడుతున్న కాంగ్రెస్, బిజెపోళ్లు: హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

సిద్దిపేట: తిట్లు తిట్టడంలో కాంగ్రెస్, బిజెపోళ్లు పోటీ పడుతుంటే వడ్లు పండించడంలో సిఎం కెసిఆర్ పోటీ పడుతున్నారని రాష్ట్ర ఆర్ధిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట రూరల్ మండలం రాంపూర్ గ్రామంలో శనివారం జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొని అనంతరం గ్రామస్తులు ఏర్పాటు చేసిన ఏకగ్రీవ తీర్మానంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడారు. బిజెపి, కాంగ్రెస్ నాయకులకు అభివృద్ధి గురించి మాట్లాడామంటే చాతకాదు, కానీ అర్థంపర్థం లేని మాటలతో ప్రజలను మోసం చేయటానికి చూస్తున్నారని హరీశ్‌రావు ధ్వజమెత్తారు. ఎన్ని ఏళ్లు గడిచినా బిజెపి, కాంగ్రెస్ నాయకులు తీరు మారటం లేదని ఒకప్పుడు భ్రమపడినట్టు ఇప్పుడు భ్రమలో లేరని అభివృద్ధికే పట్టం కడతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాంపూర్ గ్రామానికి వచ్చే దాకా నాకు ఏకగ్రీవ తీర్మానం చేస్తారని తెల్వదు నాకు తీర్మానం చేసినందుకు మీకు ధన్యవాదాలు తెలిపారు.

తొలి బోణి మీదేనన్నారు. ఈ గ్రామం లక్ష్మి గ్రామంగా సిఎం కెసిఆర్ బిఆర్‌ఎస్ పార్టీ టికెట్ ఇచ్చాక వచ్చిన మొదటి గ్రామం ఇదే అన్నారు. అభివృద్ధి పనుల కోసం గ్రామానికి వచ్చిన తనకు ఏకగ్రీవ తీర్మానం అందించిన గ్రామస్ధులు మీరంటూ మీ గ్రామం చిన్నదైనా మీ మనసు పెద్దదని నిరూపించుకున్నారన్నారు. గ్రామ ప్రజలంతా ఏక తాటిపైకొచ్చి ఏక గ్రీవ తీర్మానం చేసి మద్దతు తెలపడం సంతోషంగా ఉందన్నారు. సిఎం కెసిఆర్ ఏడవసారి సిద్దిపేట ఎమ్మెల్యే అభ్యర్ధిగా టికెట్ ఇచ్చిన తర్వాత వచ్చిన మొట్టమొదటి గ్రామం రాంపూర్ గ్రామమన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు వచ్చిన తర్వాత చిన్న గ్రామమైన రాంపూర్‌లోనే యాసంగి పంట 18 లారీల ధాన్యం పండించారన్నారు. గతంలో ఎండాకాలం వచ్చిందంటే రాంపూర్ గ్రామంలో బోర్లు బండ్ల మోత మోగేదని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధనకు ముందు వర్షాలు రాక నన్ను కూడా పిలిచి కప్పతల్లి ఆట ఆడేవారమన్నారు. ఇప్పుడు కాలంతో సంబంధం లేకుండా చెరువులు కాలువల్లో నీరు కెసిఆర్ తీసుకుకొచ్చారని తెలిపారు. కాంగ్రెస్, బీజేపి వాళ్లు మస్తు మాట్లాడుతున్నారని మూడు గంటల కరెంట్ సరిపోతుందని కాంగ్రెసోళ్లంటా,

ఎలా మాట్లాడుతారో వాళ్లకే ఆర్ధమైతలేదంటూ మూడు గంటల కరెంట్ చాలు అంటున్న తెలివితో మాట్లాడుతున్నారో లేదా మీరే ఆలోచించాలని ప్రజలకు హితవు పలికారు. సిఎం కెసిఆర్ కృషి వల్లే ఇతర రాష్ట్రాలకు ధాన్యం ఎగుమతి చేసే స్ధాయికి తెలంగాణ ఉందన్నారు. ఆసరా, కళ్యాణ లక్ష్మి, రైతుబంధు వంటి పథకాలు అమలు చేసి అందరి అభివృద్ధి కోసం సిఎం కెసిఆర్ కృషి చేస్తున్నారని అన్నారు. రైతు మరణిస్తే రూ. 5 లక్షల ఆర్ధిక సాయం చేసి ఆరైతు కుటుంబానికి పెద్దన్నలా కేసీఆర్ నిలుస్తున్నారని తెలిపారు. కడుపులో పడ్డ బిడ్డ నుంచి మొదలు అందరికి కావల్సిన అన్ని సౌకర్యాలు ప్రభుత్వమే అందిస్తుందన్నారు. విద్య, వైద్యం , సంక్షేమంలో అన్ని రంగాలలో అభివృద్ధ్ది చేసుకున్నామని తెలిపారు. చదువుకునే విద్యార్ధులకు అన్ని రకాల విద్యలను సిద్దిపేటలోనే అందిస్తున్నామని తెలిపారు.

రాంపూర్‌పై ప్రేమతో హరీశ్ వరాల జల్లు
మీపై ఉన్న ప్రేమతో మీ ఊరికి ఎలాంటి సౌకర్యం ఏర్పాటు చేయడానికైన సిద్ధంగా ఉన్నానని మంత్రిహరీశ్‌రావు వరాల జల్లు కురిపించారు. గ్రామ పంచాయతీ భవన నిర్మాణం కోసం స్ధలం ఇచ్చిన రఘోత్తంరెడ్డిని కృతజ్ఞతలు తెలిపారు. గ్రామంలో సొంత స్థలంలో ఇల్లు కట్టుకునేందుకు 42 మందికి మంజూరు వచ్చిందని ఇంకా ఎవరైనా మిగిలి ఉంటే వారికి కూడా మరో విడతలో అందిస్తానని హమీ ఇచ్చారు. అంజన్న గుడికి నా వంతు సాయం ఇస్తానని మంచి రోజు చూపి పని ప్రారంభించాలన్నారు. గ్రామ డబుల్ రోడ్డు కోసం రూ. 5 కోట్లు మంజూరు చేశామని తెలిపారు. రుణమాఫీ పూర్తి కాగానే వడ్డీలేని రుణాలు ఇస్తామని భరోసా ఇచ్చారు. నెల రోజుల్లో రుణమాఫీ పూర్తిగా అయి పోతుందన్నారు. గతంలో రాంపూర్ గ్రామంలో 490 ఓట్లు బిఆర్‌ఎస్ పార్టీకే పడ్డాయని కేవలం 7 ఓట్లు తప్ప ఇప్పుడు ఆ 7 ఓట్లు కూడా పోకుండా చూడాలని గ్రామస్ధులను కోరారు.

అంతకు ముందు అందరు పాలకులు ఓట్లప్పుడే కనిపిస్తారు కానీ మీ హరీశ్‌రావు ఐదేండ్లు మీకు అందుబాటులో ఉండే నాయకుడు హరీశ్‌సార్ ఒక్కడే అంటూ సభలో సుడా చైర్మన్ రవీందర్‌రెడ్డి మాటతో ప్రజానీకం చప్పట్లు ఈలలతో మార్మోగింది. ఈ కార్యక్రమంలో సుడా చైర్మన్ మారెడ్డి రవీందర్ రెడ్డి, రైతు సంఘం అధ్యక్షుడు వంగ నాగిరెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ లక్కరసు ప్రబాకర్ వర్మ, జడ్పీటీసీ శ్రీహరి, రూరల్ మండల అద్యక్షుడు ఎర్ర యాదయ్య, వైఎస్ ఎంపీపీ యాదగిరి, సర్పంచ్ భిక్షపతి, ఉప సర్పంచ్ విఠల్ రెడ్డి, మాజీ సర్పంచ్ అల్లం కిషన్, పార్టీ అధ్యక్షుడు తిరుపతి, బీఆర్‌ఎస్‌వీ నాయకులు బాలయ్య, రెడ్డి సంఘం అద్యక్షుడు రాజిరెడ్డి, సీనియర్ నాయకులు ముత్యం, వార్డు మెంబర్లు , ఆయా గ్రామాల సర్పంచ్‌లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News