Sunday, November 3, 2024

‘ఈటల నన్ను అనరాని మాటలంటుండు.. ఇది న్యాయమా?’: హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

Harish Rao speech at TRS Party office in Siddipet

కరీంనగర్: ఏడేళ్లుగా మంత్రిగా ఉండి హుజూరాబాద్ ప్రజలకు ఏం చేశావని అడిగితే, ఈటల రాజేందర్ ఇష్టం వచ్చినట్లు నన్ను తిడుతూ.. అనరాని మాటలంటున్నాడని, ఇది న్యాయమా? అని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. శనివారం హుజురాబాద్ లో మహిళా స్వయం సహాయక సంఘాలకు రూ.కోటీ 25 లక్షల వడ్డీ లేని రుణాల మంత్రి హరీశ్ రావు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ”ఏడేళ్లు మంత్రిగా ఉన్న వ్యక్తి ఇక్కడ ఒక్క మహిళా సంఘ భవనం కూడా కట్టించలేదు. మా నియోజకవర్గంలో 20 మహిళా సంఘాలు కట్టించాను. హుజూరాబాద్ నియోజకవర్గంలోని గ్రామాల్లో మహిళా సంఘాల భవనాలు కట్టిస్తాం. ప్రస్తుతం నాలుగు మహిళా సంఘ భవనాలు మంజూరు చేస్తున్నాం. అంతటా కట్టినా హుజురాబాద్ లో డబుల్ బెడ్ రూం ఇండ్లు కట్టించలేదని ఇక్కడి మహిళలు చెబుతున్నారు. మంత్రులు పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రి శ్రీనివాస్ గౌడ్, కెటిఆర్, నేను.. మా దగ్గర ఇండ్లు కట్టించి గృహ ప్రవేశం చేయించినా.. ఇక్కడ మాత్రం ఒక్కరికి కూడా గృహ ప్రవేశం కాలేదు. ఇది ఎవరి నిర్లక్ష్యం?. నేను ఇదే మాట అడిగితే… నన్ను తిడుతున్నారు. లేని పోని మాటలంటున్నారు. ఇది న్యాయమా?. అయ్యా.. ఏడేళ్లు మంత్రిగా ఉండి మీరు ఒక్క ఇల్లు కూడా కట్టలేదని, గృహప్రవేశం చేయించలేదని అడిగాను తప్పా?. ఆ బాధ్యత ఇప్పుడు నేను తీసుకుంటానని చెప్పాను తప్పా?. ఇందులో ఏమన్నా బూతు పదాలున్నాయా?..ఈ మాటంటే ఉలిక్కిపడుతున్నారు. నన్ను అనరాని మాటలంటున్నారు. నోటికొచ్చినట్లు తిట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఫించన్ల విషయంలో ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదా?, రూ.200 నుంచి రూ.2016కు ఫించన్లు పెంచాం. రూ.50 వేలు ఉన్న కల్యాణ లక్ష్మి ఇప్పుడు లక్షకు పెంచలేదా?. కానీ కల్యాణ లక్ష్మి డబ్బులు పరిగె ఏరుకోవడమని, ఇది పనికిరాదని ఈటల రాజేందర్ అంటున్నారు?. పేదింటి తల్లికి.. తన బిడ్డ పెళ్లికి ఈ డబ్బులు ఎలా ఉపయోగపడుతాయో తెలుస్తుంది. కాంగ్రెస్, బీజేపీ వాళ్లు ఆడపిల్ల పెళ్లికి ఒక్క రూపాయి కూడా ఇవ్వడం లేదు. కులమతాలకు అతీతంగా ప్రతి పేదింటి ఆడపిల్ల పెళ్లికి ప్రభుత్వం లక్ష రూపాయలు ఇస్తోంది. ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేసి కేసీఆర్ కిట్ పథకం కింద.. ఆడపిల్ల పుడితే 13 వేలు, మగపిల్లవాడు పుడితే 12 వేలు ఇస్తున్నం.

హుజురాబాద్ పట్టణంలో ఏ గల్లీ చూసినా రోడ్డు లేదు, డ్రైనేజీ లేదు. మెయిన్ రోడ్ కూడా సరిగ్గా లేకుంటే మేమే మొన్న వేయించాం. హుజురాబాద్ పట్టణ ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే 35 కోట్ల రూపాయలు సాంక్షన్ చేయించా. 13కిలో మీటర్ల సీసీ రోడ్లు హుజురాబాద్ లో వేపిస్తున్నాం. మిగిలిన పనుల కోసం గెల్లు శ్రీనివాస్ గెలిచాక ఎమ్మెల్యే ఫండ్స్ రూ.5 కోట్లు, ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డికి వచ్చే రూ.5 కోట్లు ఖర్చు చేసుకుందాం. రాబోయే రోజుల్లో డబుల్ బెడ్ రూం ఇండ్లు పూర్తి చేసి నేనే రిబ్బన్ కట్ చేసి మిమ్మల్ని సొంత ఇళ్లకు పంపిస్తా. కొందరు బొట్టుబిల్లలు, కుట్టుమిషన్లు, గ్రైండర్లు ఇస్తున్నారట. కుంకుమ భరిణలు కొనుక్కొచ్చి పెట్టారట. మీకు రూపాయి బొట్టు బిల్లలిచ్చేవారు కావాలా?, 2 వేల ఫించన్ ఇచ్చేవాళ్లు కావాలా?. 60 రూపాయల గడియారం కావాలా?, లక్ష రూపాయల కల్యాణ లక్ష్మి ఇచ్చేవాళ్లు కావాలా?. గడియారాలకు, బొట్టుబిల్లలకు మోసపోతారా?.. మీరే అలోచించుకోవాలి. టీఆర్ఎస్ పేదల ప్రభుత్వం.. ప్రజల కోసమే మేము పనిచేస్తాం. కరోనా లాంటి కష్టకాలంలోనూ పది కిలోల బియ్యం, కంది పప్పు పంపిణీ చేసాం. రెండు నెలల పాటు 15 వందల రూపాయలు ఇచ్చాం. రాబోయే రోజుల్లో సొంత జాగాలో ఇళ్లు కట్టించే కార్యక్రమం అంతటా ప్రారంభిస్తాం” అని చెప్పారు.

Minister Harish Rao Speech in Huzurabad

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News