Friday, January 10, 2025

మహిళల ‘తీన్’మార్

- Advertisement -
- Advertisement -

కరీంనగర్ ప్రతినిధి: మహిళా దినోత్సవం రోజున సిఎం కెసిఆర్ మహిళలకు అందిస్తున్న మరో గొప్ప కానుక ఆరోగ్య మహిళ పథకమని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. బుధవారం కరీంనగర్ పట్టణంలోని బుట్టిరాజారాంకాలనీ ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో ఆరోగ్య మహిళా పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహిళల కష్టాలు తీర్చేందుకు అనేక పథకాలు తెచ్చిన ఘనత సిఎం కెసిఆర్‌దని మిషన్‌భగీరథ, ఆడపిల్లల కోసం రెసిడెన్షియల్ స్కూళ్లు ప్రారంభించామని, గర్భిణుల కోసం ఆరోగ్య లక్ష్మి పథకాన్ని అమలు చేస్తున్నామని, మహిళల రక్షణ కోసం షీటీమ్స్, ఆడపిల్లల పెళ్లి కోసం కళ్యాణలక్ష్మి పథకాలు చేపడుతున్నామన్నారు. మహిళలు తాము పడుతున్న ఆరోగ్య సమస్యలు బయటకు చెప్పుకోవడానికి బిడియ పడుతుంటారని, కొందరు ఆర్థిక ఇబ్బందులు, ఆసుపత్రిలోని మగా డాక్టర్లకు సమస్యలు చెప్పుకోలేక హాస్పిటల్‌కు వెళ్లడమే మానేశారన్నారు.

ఇలాంటి వారి కోసమే ఆరోగ్య మహిళ పథకం. ఇందులో మహిళలు సాధారణంగా ఎదుర్కొనే 8 రకాల వైద్యసేవలు అందుతాయని, ఇకపై మహిళా వైద్యులతో, మహిళ సిబ్బందితో ఆరోగ్య మహిళ పేరుతో బుధవారం నుండి 100 ఆసుపత్రుల్లో ప్రారంభిస్తున్నామని తెలిపారు. ఆసుపత్రిల సంఖ్యను దశల వారీగా పెంచుతానని, ప్రతి మంగళవారం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు 100 ఆస్పత్రుల్లో మహిళల కోసం ప్రత్యేక పరీక్షలు చేసి మందులు, వైద్యం ఉచితంగా అందిస్తామన్నారు. సర్జరీలు, ఇతర అడ్వాన్స్‌డ్ వైద్య పరీక్షల కోసం కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రత్యేక సెంటర్ పెడుతున్నామని, తల్లి బాగుంటేనే కుటుంబం బాగుంటుందన్న ఆశయంతో ఈ పథకం ప్రారంభిస్తున్నామన్నారు. రాబోయే రోజుల్లో ఆరోగ్య మహిళ ఆస్పత్రుల సంఖ్య పెంచుతామన్నారు. మహిళలంతా తమ ఆరోగ్యాన్ని నిర్లక్షం చేయకుండా ప్రతి ఒక్కరు వైద్య పరీక్షలు చేయించుకోవాలని ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

ఓ సర్వే ప్రకారం 40-50 శాతం మంది మహిళలు వివిధ రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారన్నారు. వ్యాధి తొలిదశలోనే గుర్తించి చికిత్స తీసుకోవాలన్నారు. శ్రీరామనవమి తర్వాత మహిళల కోసం న్యూట్రిషన్ కిట్ పథకం ప్రారంభిస్తున్నామని, ఇప్పటికే కేసీఆర్ కిట్ ప్రసవించిన మహిళకు ఇస్తున్నామన్నారు. పోషకాహారంతో కూడిన న్యూట్రిషన్ కిట్ గర్భిణులకు ఇవ్వబోతున్నామన్నారు. మహిళలు అడగకపోయినా అనేక పథకాలు కేసీఆర్ ప్రవేశపెడుతున్నారని, మహిళల కోసం తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం జిల్లా ప్రధాన ఆస్పత్రిలో 3.14 కోట్ల వ్యయంతో నిర్మించిన ఆరోగ్య మహిళ ప్రాంగణం, పీసీఓడీ, ఫ్యామిలీ ప్లానింగ్ ఇన్‌ఫెర్టిలిటీ వార్డు, 80 లక్షలతో డయాగ్నస్టిక్ రేడియాలజీ, మాతా శిశు సంరక్షణ కేంద్రం మూడో అంతస్తులో 625 లక్షలతో ఏర్పాటు చేసిన అదనపు పడకలు, 23.75 కోట్లతో క్రిటికల్ కేర్ ఆసుపత్రి భవనాలను మంత్రి ప్రారంభించారు.
 ఆడబిడ్డల ఆరోగ్యం కోసం మహిళా ఆరోగ్యం పథకం ః మంత్రి గంగుల కమలాకర్
ఆడబిడ్డ కన్నీరు పెట్టుకుంటే అరిష్టమని భావించి ఆడబిడ్డల ఆరోగ్యం కోసం మహిళా ఆరోగ్యం ఇంటికి సౌభాగ్యం కార్యక్రమాన్ని చేపట్టిన ఘనత సీఎం కేసీఆర్‌ది అని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఈ గొప్ప కార్యక్రమాన్ని కరీంనగర్ నుండి ప్రారంభించిన మంత్రి హరీష్‌రావుకు కృతజ్ఞతలు తెలిపారు. ఆడబిడ్డల రక్షణ సంక్షేమం ఆరోగ్యం కోసం ఇప్పటివరకు ఏ సీఎం ఆలోచించలేదన్నారు. మహిళా ఆరోగ్యంగా ఉంటే ఆ ఇల్లు ఆరోగ్యంగా ఉంటుందని సీఎం కేసీఆర్ దేవుడిగా ఆరోగ్య మహిళా పథకాన్ని తీసుకువచ్చారన్నారు. ఇలాంటి పథకం ఇటు దేశంలోనే కాదు ప్రపంచంలోని ఏ దేశంలో కూడా లేదని, గొప్ప పథకాలన్నీ తెలంగాణలోనే అమలవుతున్నాయన్నారు.

ఈ కార్యక్రమంలో వైద్య, ఆరోగ్య శాఖ డైరెక్టర్ శ్వేతా మహంతి, నగర మేయర్ సునీల్‌రావు, మ్మెల్యేలు రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ కనుమల్ల విజయ, రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, రాష్ట్ర సివిల్ సప్లయ్ కార్పొరేషన్ చైర్మన్ రవీందర్‌సింగ్, జిల్లా కలెక్టర్ ఆర్‌వి కర్ణన్, పోలీస కమీషనర్ సుబ్బారాయుడు, అదనపు కలెక్టర్లు గరిమ అగర్వాల్, శ్యాంప్రసాద్‌లాల్, జడ్పీ సీఈవో ప్రియాంక, అసిస్టెంట్ కలెక్టర్ లెనిన్ వాత్సల్ టోప్సో, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అనిల్‌కుమార్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రెడ్డవేని మధు, డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపరాణి హరిశంకర్, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జువేరియా, జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి సూపరింటెండెంట్ రత్నమాల, కమీషనర్ సేవా ఇస్లావత్, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News