వైద్యాధికారులు,సిబ్బందితో మంత్రి హరీష్‌రావు టెలీకాన్ఫరెన్స్
హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా థర్డ్ వేవ్‌ను సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు అన్ని జిల్లాల వైద్యాధికారులు, సిబ్బంది సిద్ధంగా ఉండాలని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. రాష్ట్రంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో డైరెక్టర్ ఆఫ్ హెల్త్ శ్రీనివాసరావుతో కలిసి అన్ని జిల్లాల వైద్యాధికారులు, ఆశావర్కర్లతో శుక్రవారం నాడు మంత్రి హరీశ్ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో కరోనా వ్యాక్సిన్ రెండో డోసు లక్ష్యాన్ని వంద శాతం పూర్తిచేయడంతో పాటు 15-18 ఏళ్ల వారికి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేయాలని పిలుపునిచ్చారు.
కొవిడ్‌పై పోరులో మున్సిపల్, పంచాయతీశాఖలతో పాటు, ప్రజాప్రతినిధుల సహకారం తీసుకోవాలని వైద్యాధికారులకు మంత్రి సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా 60 ఏళ్లు పైబడిన వారిలో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారికి ప్రాధాన్యం ఇచ్చి బూస్టర్ డోస్ త్వరగా అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా రాష్ట్రంలో ఆశావర్కర్ల పరిధిలో రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకోని వారు ఒక్కరూ ఉండకూడదనే లక్ష్యంతో పనిచేయాలని నిర్దేశించారు. పిహెచ్‌సిలు, సబ్‌సెంటర్ల స్థాయిలోనే కొవిడ్ రోగులకు మెరుగైన చికిత్సలు అందేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లి ప్రజలు అప్పుల పాలుకాకుండా చూడాలని, అవసరమైతే ప్రజాప్రతినిధుల సహకారంతో స్థానికంగా ఐసోలేషన్ కేంద్రాలను ఏర్పాటుచేయాలన్నారు.
ఇదే సమయంలో అన్ని ఆస్పత్రుల్లో వొపి, గర్భిణులకు సేవలు, దీర్ఘకాలిక రోగులకు సేవలు అందించడంలో ఎలాంటి అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలు అందించి, దేశంలోనే తెలంగాణ ఆరోగ్య రంగాన్ని మొదటి స్థానానికి చేర్చాలని అధికారులు, సిబ్బందికి మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో కోవిడ్, ఒమిక్రాన్ వేరియంట్‌ల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు పలు సూచనలు చేశారు. అన్ని సబ్ సెంటర్లు, పిహెచ్‌సి కేంద్రాల్లో ఐసోలేషన్ కిట్లు, పరీక్ష కిట్లనను సిద్ధం చేయాలన్నారు. లక్షణాలు ఉంటే పరీక్ష చేసి, వెంటనే కిట్లు అందించాలని సూచించారు.బాధితుల ఆరోగ్య పరిస్థితిని రోజువారీ పరిశీలించాలని మంత్రి అధికారులకు ఆదేశాలిచ్చారు. ప్రభుత్వాసుపత్రుల్లో నాణ్యమైన వైద్యం అందుబాటులో ఉందని ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత వైద్యాధికారులపైనా ఉందని మంత్రి గుర్తు చేశారు. కొత్త వేరియంట్ వ్యాప్తి ఎక్కువ, ప్రమాదం తక్కువగా ఉందని భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదన్నారు. నాన్ కోవిడ్ సేవలకు ఎట్టిపరిస్థితుల్లో అంతరాయం కలగకుండా వైద్యాధికారులు ఎప్పటికప్పుడు సిద్ధం కావాలని ఈ సందర్భంగా మంత్రి పేర్కొన్నారు.