సిద్దిపేట: రాష్ట్ర ప్రజలకు మంత్రి హరీష్ రావు వినాయక చవితి పర్వదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… ఈ వినాయక చవితి పర్వదినాన్ని ప్రజలంతా కుటుంబసమేతంగా భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలన్నారు. సకల కార్యాలకు ప్రథమ పూజ చేసేది.. పూజించేది విగ్నేశ్వరున్నే అని చెప్పారు. విగ్నేశ్వరుని అనుగ్రహముతో విఘ్నాలు తొలిగి అన్నింటా శుభం చేకూరాలని ఆకాంక్షించారు. ఆ గణనాథుని దివేనతో తెలంగాణ రాష్ట్రం సీఎం కేసీఆర్ నాయకత్వం లో అన్ని రంగాల్లో అభివృద్ధి లో దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదన్నారు. సిద్దిపేట జిల్లా నేడు ప్రగతి పట్టాభిషేకంగా పరిడవిల్లుతుందన్నారు. కాళేశ్వరం జలాలు జిల్లాను నలుదిశలా నెలను ఒడిసి పట్టి ఈ ప్రాంతం సస్యశ్యామలం అయిందని సంతృప్తి వ్యక్తం చేశారు. నేడు రైతుల కళ్లతో ఆనందాలు వెల్లువిరుస్తున్నాయని ఆనందంగా ఉందన్నారు. నాడు చెరువుల్లో గణపతుల నిమర్జనం చేయాలి అంటే నీళ్లు లేని పరిస్థితి.. కానీ నేడు మండుటెండల్లో కూడా చెరువుల్లో జలకళ సంతరించుకుందన్నారు. రాష్ట్రానికి అప్పుడప్పుడు కొన్ని శక్తులు విఘ్నాలు కలిగించాలని చూస్తున్నారు. విగ్నేశ్వరుని దయతో ఆ విఘ్నాలు రాకుండా తెలంగాణ ప్రాంత అభివృద్ధి కి నిర్విఘ్నంగా అన్ని కార్యాలు నెరవేరాలని ప్రజలందరు సుభిక్షంగా ఉండాలని ఆ విగ్నేశ్వరుణ్ణి ప్రార్ధించారు. ప్రతి ఒక్క ఇంటిలో మట్టి గణపతి ప్రతిమ ను పూజించాలన్నారు. మట్టి గణపతి పూజించడం ఎంతో శ్రేష్టమని చెప్పారు. పర్యావరణాన్ని పరిరక్షణ తో దేవుణ్ణి పూజించాలని పిలుపునిచ్చారు.