హైదరాబాద్: నగరంలోని గాంధీ ఆస్పత్రిని వైద్య,ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు ఆదివారం సందర్శించారు. గాంధీలో రూ.25కోట్ల విలువైన అత్యాధునిక పరికరాలను, రూ.13కోట్లతో ఎంఆర్ఐ యంత్రాన్ని రూ.9 కోట్లతో క్యాత్ ల్యాబ్ ను మంత్రి ప్రారంభించారు. సిఎం కెసిఆర్ నాయకత్వంలో కార్పొరేట్ స్థాయి సౌకర్యాలతో,ప్రజలకు సర్కారు దవాఖానాలపై సంపూర్ణ విశ్వాసం కల్గుతోందని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ… ఇటీవల రూ.2.5 కోట్లతో సిటీస్కాన్ యంత్రం ఏర్పాటు చేసుకున్నామని ఆయన పేర్కొన్నారు. గాంధీలో రూ.100 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టమన్నారు. రూ.30 కోట్లతో ఆర్గాన్ ట్రాన్స్ ప్లాంట్ థియేటర్ కాంప్లెక్స్ నిర్మిస్తామని మంత్రి హరీశ్ తెలిపారు. గాంధీ, పేట్ల బూర్జు, వరంగల్ ఎంజీఎంలో సంతాన సౌఫల్య కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. రెండు నెలల్లో సంతాన సౌఫల్య కేంద్రాలు అందుబాటులోకి వస్తాయన్నారు.