చిన్నకోడూరు: సిఎం కెసిఆర్ పేరు వింటేనే రైతులకు ఎనలేని ధైర్యం వస్తుందని, ఐదేళ్ల కొకసారి వచ్చే మాయగాళ్ల మోజులో పడి మోసపోవద్దని ఆర్థిక, ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. రైతు దేశానికే ధాన్యాగారంగా తెలంగాణ రాష్ట్రం అవతరించిందన్నారు. ఆదివారం చిన్నకోడూరు మండలం ఇబ్రహీంనగర్ గ్రామంలో రైతు వేదిక, బుడగ జంగాల కమ్యూనిటీ హాల్, గ్రామ పంచాయతీ భవనం, మహిళా మండలి భవన్, మురికి కాల్వల నిర్మాణ పనులకు జడ్పీ చైర్ పర్సన్ వేలేటి రోజా శర్మతో కలిసి శంకుస్థాపన చేశారు. అంతకు ముందు పీఎసీఎస్ చైర్మన్ ముల్కల కనకరాజు పోలంలో 4 ఎకరాలలో ఆయిల్‌పామ్ సాగు కోసం మొక్కలు నాటారు. అదే విధంగా బిఆర్‌ఎస్ పార్టీకి గ్రామ వీఓఏలు రూ. 1016 విరాళంగా అందించారు. అనంతరం హరీశ్‌రావు మాట్లాడుతూ నాడు తెలంగాణలో కైకిలి దొరకని పరిస్థితి ఉండేదని నేడు తెలంగాణలో కైకిలోళ్లు దొరకని పరిస్ధితి నెలకొందన్నారు.
సిఎం కెసిఆర్ ఇచ్చిన మాట ప్రకారం ఈ నెలలోపు రైతులందరికీ లక్ష రూపాయల రుణం మాఫీ చేస్తామన్నారు. బాయికాడ మీటర్లు పెడతామని బిజెపి, మూడు గంటలే కరెంట్ చాలని, కాంగ్రెస్ చెబుతుంటే మీకు వెన్నంటే నేనున్నానని ధైర్యంగా మూడు పంటలు పండించాలని రైతులకు సిఎం కెసిఆర్ ధీమా ఇస్తున్నారన్నారు. సిఎం కెసిఆర్‌ను మరోసారి ఆశీర్వదించాలన్నారు. కష్టపడి కాళేశ్వరం కట్టి కాల్వ తీస్తే ఇబ్రహీం నగర్ చెరువు నిండిందన్నారు. 30 ఏళ్ల నుండి చెరువు నిండగా చూడని మీరు ఇగ బతికున్నంత కాలం ఎండగా చూడరన్నారు. ఇబ్రహీంనగర్ ,మందపల్లి వాగుపై ఆరు చెక్ డ్యాములు పొంగుతున్నాయని ఇదే మనం సాధించిన గొప్ప మార్పు అన్నారు. ఇబ్రహీంనగర్‌లో గతేడాది వానాకాలం 1682 ఎకరాలు, ఈ యాసంగిలో 1890 ఎకరాల వరినాట్లు వేశారన్నారు. డిల్లీ నగరం, ఇతర రాష్ట్రాలలో కరెంటు కోతలు ఉన్నాయని తెలంగాణలో మాత్రం 24 గంటల ఉచిత నాణ్యమైన కరెంట్ సరఫరా చేస్తున్న ఏకైక ప్రభుత్వం బీఆర్‌ఎస్ అన్నారు.
ఆయిల్ పామ్ సాగు విరివిగా చేసేందుకు రైతులు ముందుకొస్తే ప్రభుత్వం తరుపున సహకారాన్ని అందిస్తామని తెలిపారు. ఎక్కడికెళ్లినా సిద్దిపేట అంటే మీ గౌరవం, ప్రతిష్ట పెంచామన్నారు. ఐదేళ్ల కొకసారి వచ్చే వాళ్ల మోజు, మాయలోపడొద్దని మీ కష్టాల్లో ఎప్పుడు మీ వెంట ఉంటున్న నన్ను ఆశీర్వదించాలన్నారు. నాపై మీ ప్రేమ ఆధారాభిమానాలు కాపాడుకుంటానని భరోసా కల్పించారు. గ్రామ ప్రజల కోరిక మేరకు కావల్సిన వెంటనే మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం మహిళలకు స్త్రీ నిధి చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కూర మాణిక్య రెడ్డి, గ్రామ సర్పంచ్ సుభాష్, ప్రజాప్రతినిధులు , నాయకులు తదితరులు పాల్గొన్నారు.