Thursday, January 23, 2025

కేంద్ర బిజెపి ప్రభుత్వానిది ఉత్తర భారత దేశానికి ఒకనీతి… దక్షిణ భారత దేశానికి ఒకనీతి..

- Advertisement -
- Advertisement -

Minister Harish rao who Launched Electricity Revenue office

 

సిద్దిపేట:కేంద్ర బీజేపీ ప్రభుత్వానిది ఉత్తర భారత దేశానికి ఒకనీతి. దక్షిణ భారత దేశానికి ఒకనీతిగా వ్యవహరిస్తున్నదని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ హరీశ్ రావు బీజేపీ తీరుపై ధ్వజమెత్తారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల కోసం ఉత్తర భారత దేశంలో ధరలు పెంచలేదని, దక్షిణ భారతదేశ ప్రాంతంలో కాంప్లెక్స్ ఎరువులు, యూరియా, డీఏపీ, పొటాషియం ఎక్కువగా వాడతారని ధరలు పెంచి పక్షపాత వైఖరి కనబరుస్తున్నదని బీజేపీ తీరుపై మంత్రి హరీశ్ దుయ్యబట్టారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో రూ.1 కోటి 71 లక్షల తో నిర్మించిన డివిజినల్ ఇంజనీర్ కార్యాలయ భవనం, విద్యుత్ రెవెన్యూ కార్యాలయంను ఎమ్మెల్యే ఒడితెల సతీశ్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు.

హుస్నాబాద్ లో రూ.1.71 కోట్ల రూపాయలతో విద్యుత్ డీఈ కార్యాలయం ప్రారంభం చేసుకున్నాం. హుస్నాబాద్ పరిసర ప్రాంత ప్రజలు గతంలో కరీంనగర్, సిద్దిపేట వెళ్లే పరిస్థితి ఉండేదని, సీఎం కేసీఆర్ ఆశీస్సులతో ఇక నుంచి ఏలాంటి విద్యుత్ సమస్య పనులకు హుస్నాబాద్ లోనే చేసుకునే వెసులుబాటు కలిగింది. డీఈ అధికారి పోస్టు మంజూరుతో పాటు నూతన భవన ప్రారంభం చేసుకున్నాం. అలాగే హుస్నాబాద్ నాగ సముద్రాల వద్ద 220/132 కేవీ సబ్ స్టేషన్ గతంలో మంజూరు చేసుకున్నామని, పనులు పూర్తి కావొచ్చాయని, రూ.50 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న సబ్ స్టేషన్ ను మార్చి 31వతేది లోపు పూర్తిచేసి ప్రజలకు అందుబాటులో తేవాలని ట్రాన్స్ కో సీఎండీ ప్రభాకర్ రావు, ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డిలకు మంత్రి ఆదేశం.

అదే విధంగా నూతనంగా నిర్మిస్తున్న రామవరం, సీసీ పల్లి సబ్ స్టేషన్ పనులు యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులకు మంత్రి ఆదేశాలు. రామవరం సబ్ స్టేషన్ మార్చి 31లోపు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తాం. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో రైతులకు ఏమైనా మేలు చేస్తుందోనని ఎదురు చూస్తే.. కేంద్రం వైఖరి రైతుల పై భారం వేయడం తప్ప, రైతులకు మేలు చేసిందేమీ లేదు. రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రతీ సంవత్సరం రాష్ట్ర జీఎస్ డీపీలో 4 శాతం అప్పు రూపేణా తీసుకునే అనుమతి, అవకాశం ఉండేదని, కానీ ఈ సారి కేంద్ర ప్రభుత్వం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 3.5 శాతం రాష్టాలకు నేరుగా ఇస్తామని, మరో ఒక అర శాతానికి విద్యుత్ సంస్కరణలు తేవాలని నిబంధనలు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు.

విద్యుత్తు చట్టంలో రీఫామ్స్-సవరణలు చేయాలని.. సంస్కరణలు బాయిలకాడ విద్యుత్ మీటర్లు పెట్టాలని, విద్యుత్ పంపిణీ వ్యవస్థను ప్రయివేటు పరం చేయాలన్నదే కేంద్ర ప్రభుత్వ విధానమని కేంద్రం పై మంత్రి హరీశ్ విమర్శ. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విధానం ఒక్కటే.. నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకూ బాయిలకాడ మీటర్లు పెట్టనని, మీటర్లు పెడితే అర శాతం 5 వేల కోట్లు మన రాష్ట్రానికి రానట్లేనని, దీంతో తెలంగాణకు 5 వేల కోట్ల కోత పడినట్లేనని ఆర్థిక మంత్రి హరీశ్ వెల్లడి. కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఎవరికీ ఏమీ ఇచ్చింది లేదని, ఇచ్చే దాంట్లోనే కోతలు పెడుతున్నది. ఎందుకు ఈ నిబంధనలంటూ.. మా రాష్ట్ర ప్రభుత్వ విధానంలో మా రాష్ట్ర ప్రజలకు 24 గంటల నాణ్యమైన ఉచిత కరెంటు బాయిలకాడ, బోర్లకాడ ఇస్తున్నట్లు, గత ఏడేండ్లుగా అందిస్తున్నట్లు, ఇందుకోసం యేటా 12 వేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తున్నదని., కానీ కేంద్ర బీజేపీ విద్యుత్తు సంస్కరణలు తేవాలని రాష్ట్రాల మెడలపై కత్తి పెడుతున్నదని, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచుతున్నదని మంత్రి ఫైర్.

ఒకప్పుడు 400 రూపాయలు గ్యాస్ సిలిండర్లపై సబ్సిడీ నేరుగా బ్యాంకులో వేస్తామని, కేవలం యేడాది ఇచ్చి యేటా 6 సార్లు 2400 వరకూ ఇచ్చినట్లే ఇచ్చి, ఇవాళ 40 రూపాయలకు బీజేపీ దిగజారిందని వెల్లడి. ఫిబ్రవరి 1వతేది పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మీ రాష్ట్రాలకు ఇచ్చే 4 శాతంలో 3.5 శాతం షరతులు లేకుండా ఇస్తామని, ఒక అర శాతం మాత్రం ఈ యేటా విద్యుత్ సంస్కరణలు అమలు చేస్తేనే ఇస్తామని మెలిక పెట్టినట్లు, విద్యుత్ సంస్కరణలు అమలు చేయడమంటే.. బాయిలకాడ మీటర్లు పెట్టడమే.. రైతుల దగ్గర ముక్కుపిండి వసూళ్లు చేయడమే.. విద్యుత్ పంపిణీని ప్రయివేటు పరం చేయడమేనంటూ.. రైతులకు మీటర్లు పెట్టడమే బీజేపీ విధానమని మంత్రి హరీశ్ వెల్లడి ఎఫ్ సీఐకి సైతం కోత పెట్టినట్లు, రైతులు పండించిన ధాన్యం సేకరించే FCI సబ్సిడీలో దాదాపు 40 వేల కోట్ల రూపాయలు కోత పెట్టినట్లు FCI నిధుల కోత అంటే రాబోయే రోజుల్లో రైతుల దగ్గర నుంచి ధాన్యం కొనడంలో కూడా కోతే పెడతారని, కేంద్రం ధాన్యం కొనుగోలు చేయనని చెప్పకనే కేంద్రం చెబుతున్నదని కేంద్ర బీజేపీపై మండిపడ్డారు.

రైతులకు ఇచ్చే అన్నీ సబ్సిడీలు తగ్గించి రైతులకు భద్రత లేకుండా చేసిందని కేంద్ర బీజేపీ తీరుపై మండిపడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఎరువుల ధరలు పెంచినట్లు వాపోయారు. ఉత్తర భారత దేశంలో యూరియా, డీఏపీ ఎక్కువ వాడకం, దక్షిణ భారతదేశంలో కాంప్లెక్స్ ఎరువుల వాడకం ఎక్కువగా ఉంటుందని.., ఉత్తర దేశంలో యూరియా, డీఏపీ ధరలు పెంపు జోలికి పోకుండా, దక్షిణ భారతదేశంలో కాంప్లెక్స్ ఎరువులకు ధరలు పెంపు చేశారని, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల్లో లబ్ధి పొందేలా.. ఉత్తర దేశానికి ఒకనీతి, దక్షిణ దేశానికి ఒకనీతి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వ తీరుపై మంత్రి హరీశ్ విమర్శ. బీజేపీ ప్రభుత్వం తెలంగాణ పై ఎంత వివక్ష చూపుతుందో.. తెలిసేందుకు కేవలం ఇదొక ఉదాహరణ.

ఉత్తరప్రదేశ్ ఎన్నికలు పూర్తికాగానే డీజీల్, పెట్రోల్ ధరలు పెంపు చేస్తారని.. కేంద్ర బీజేపీ దేశ ప్రజలకు ఏమీ ఇవ్వదు. సబ్సిడీలల్లో కోత, ధరల్లో పెంపు.. ఇలా వివక్ష తప్ప మరేమీ లేదు. తెలంగాణ, దక్షిణ భారతదేశంపై కేంద్ర బీజేపీ వివక్ష చూపుతున్నదని, పక్క కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు జాతీయ ప్రాజెక్టులు ఇచ్చినట్లు.. తెలంగాణకు మొండిచేయి చూపిస్తున్నదని కేంద్రం పై మంత్రి ఫైర్ కేంద్రం బొగ్గుపై సెస్ వేసినట్లు, విద్యుత్ ఉత్పత్తి అయ్యే బొగ్గుపై విపరీతంగా సెస్ పెంచి భారం వేసిందని, ఉచితంగా వచ్చే లోయర్, సీలేరు పవర్ ప్లాంట్ ఆంధ్రకు అప్పగించినట్లు, లోయర్ సీలేరు ఉంటే 10 పైసలకే విద్యుత్ వచ్చేదని, బీజేపీ రాగానే లాక్కుందని.. ఇలా అన్నీ రంగాల్లో తెలంగాణను వివక్ష చూపుతోంది.

ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆర్థిక విధానాలు అవలంభించడం ద్వారా కేంద్రం ఆదుకోకపోయినా.. వివక్ష చూపినా అభివృద్ధిలో తెలంగాణ ముందంజలో ఉన్నదని, రాష్ట్ర ప్రజానీకానికి అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నామని, ఏమీ చేయకుండానే బీజేపీ సోషల్ మీడియా ఫేక్ ప్రచారాన్ని తిప్పి కొట్టాలి. టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్, ప్రతీ యేటా పెట్టుబడి సాయం కింద రైతుబంధు, అలాగే రైతుభీమా.. ఇలా దేశంలో ఏ ముఖ్యమంత్రి అయినా, ఇతర ఏ రాష్ట్రాలలో అయినా ఇస్తున్నారా.. అంటూ చెప్పుకొచ్చారు. బట్టేబాజ్, జూటే బాజ్ పార్టీ బీజేపీ అని, గ్రామ క్షేత్రస్థాయిలో టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు యువత నిజాన్ని, వాస్తవాన్ని గ్రహించి బీజేపీ చేసే గోబెల్స్ ప్రచారాన్ని తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రభుత్వం రైతును కాపాడే ప్రయత్నం చేస్తే., బీజేపీ ప్రభుత్వం రైతును ముంచే ప్రయత్నం చేస్తున్నదని, రైతులకు పెట్టుబడి వ్యయాన్ని పెంపు చేస్తోందని, కొనుగోలు తగ్గిస్తుందని మంత్రి వెల్లడి. బీజేపీ ప్రభుత్వం సిలిండర్లు, ఎరువులు ఇతరత్రాలపై సబ్సిడీ పేరిట కోతలు, వాతలు తప్ప కేంద్ర బీజేపీ ప్రభుత్వం దేశ ప్రజలకు చేసిందేమీ లేదని, టీఆర్ఎస్ పార్టీ నాయకులుగా ఈ విషయాలను ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలని పార్టీ శ్రేణులకు మంత్రి హరీశ్ రావు పిలుపునిచ్చారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News