మెదక్: రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం నిర్వహించు విద్యుత్ విజయోత్సవం కార్యక్రమంతో పాటు సురక్ష దినోత్సవం కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి తన్నీరు హరీశ్‌రావు పాల్గొనున్నారని జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఆదివారం తెలిపారు. నియోజకవర్గ స్థాయిలో విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించు విద్యుత్ విజయోత్సవ కార్యక్రమాలను మెదక్‌లోని సాయిబాలాజీ గార్డెన్ నందు, నర్సాపూర్‌లోని సాయికృష్ణ గార్డెన్ నందు ఉదయం 11 గంటలకు నిర్వహించనున్నామన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు, వినియోగదారులు, విద్యుత్ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు పాల్గొంటారని అన్నారు.
సభలో నాటి కరెంట్ కోతల దుస్థితి, తెలంగాణ వచ్చిన తర్వాత వెలుగు జిలుగులు రాష్ట్రంగా మారిన పరిస్థితిని, విద్యుత్ రంగంలో సాధించిన ప్రగతి, గుణాత్మక మార్పులను వివరించడంతోపాటు సాదించిన విజయాలపై ప్రచురించిన కరపత్రాలు, పుస్తకాలు పంపిణీ చేస్తారని కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా అన్ని విద్యుత్ సబ్ స్టేషన్లను విద్యుత్ దీపాలతో అలంకరించాలని, ప్రతి గ్రామంలో ఆకర్షీణీయమైన ప్లెక్సీలు ఏర్పాటు చేయాలని విద్యుత్ అధికారులకు సూచించారు. అలాగే నాడు గ్రామంలో ఇచ్చిన విద్యుత్ కనెక్షన్లు, నేడు ఇచ్చిన కనెక్షన్లు, ఉచిత విద్యుత్ కోసం ప్రభుత్వం వెచ్చిస్తున్న నిధులు, రైతులకు జరుగుతున్న మేలుతోపాటు వివిధ వృత్తులకు ఇస్తున్న ఉచిత విద్యుత్, పవర్ హాలీడే లేకుండా పరిశ్రమలు, వ్యాపార రంగాలకు నిరంతరాయంగా అందిస్తున్న విద్యుత్‌పై చర్చ జరిగేలా చూడాలన్నారు.
సురక్షదినోత్సవంలో భాగంగా సోమవారం సాయంత్రం 5 గంటలకు స్థానిక రాందాస్ చౌరస్తా నుంచి వైశ్రాయ్ గార్డెన్ వరకు పోలీసు శాఖ ఆధ్వర్యంలో బైకులు, కార్లు తదితర వాహనాలతో ర్యాలీ నిర్వహించబడుతుందని కలెక్టర్ తెలిపారు.అనంతరం పోలీసు సిబ్బంది, అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలతో వైశ్రాయ్ గార్డెన్‌లో ఏర్పాటు చేయు సభలో మంత్రి పాల్గొంటారని అన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు చేస్తున్న కృషి, ప్రెండ్లీ పోలీస్, సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదాల నివారణకు చేస్తున్న కృషిని వివరిస్తారని అన్నారు. అంతేగాక పాస్‌పోర్టు వెరిఫికేషన్ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయడంలో రాష్ట్రం దేశంలోనే నంబర్‌వన్‌గా నిలిచిన విషయాన్ని, టీ టీమ్స్ ద్వారా మహిళలకు కల్పిస్తున్న రక్షణ, భరోసా విషయాలను అవగతం చేస్తారని అన్నారు. ఇట్టి కార్యక్రమాలను అధికారులు, ప్రజాప్రతినిధుల సమష్టి భాగస్వామ్యంతో విజయవంతం చేయాలని కలెక్టర్ కోరారు.