Tuesday, November 5, 2024

నుమాయిష్ మినీ భారత్

- Advertisement -
- Advertisement -

నాంపల్లి: నుమాయిష్ లో విభిన్న సంస్కృతులు, ఆహార అలవా ట్లు వివిధ రాష్ట్రాల ఉత్పత్తులకు వేదికగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను మరింత ఇనుమడింపజేస్తోందని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి, ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షులు టి. హరీశ్‌రావు పేర్కొన్నారు. దేశ, విదేశీయు లు విశేషంగా ఆకట్టుకుంటున్న నుమాయి ష్ ఎంతో ఘన చరిత్ర కలిగి ఉందని, ఏటా సందర్శకులు తమ కుటుంబాలతో కలిసి ఇక్కడికి రావడం తమ జీవిన శైలితోపాటు గొప్ప అనుభూతిగా భావించి ఆస్వాదిస్తున్నారన్నారు. ఆదివారం సాయంత్రం నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో 82వ అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన (నుమాయిష్) ప్రారంభోత్సవ వేడుకలకు విచ్చేసి ప్రసంగించారు. నుమాయిష్ మినీ భారత్‌గా మారిందని, అన్ని రాష్ట్రాల వారి వస్తువులు అందుబాటులో ఉన్నాయన్నారు. ఇంట్లో హాయిగా కూర్చొని సెల్‌ఫోన్‌లో క్లిక్ చేస్తే చాలు వస్తువులు మీ ఇంటివద్దకే వస్తాయి కానీ నుమాయిష్‌కి వచ్చే అనుభూతిని మాత్రం కోల్పోతున్నారని పేర్కొన్నారు.

ఏటా విజయవంతంగా నిర్వహించి ఎంతో పేరు ప్రతిష్ఠలు సాధించిన నుమాయిష్ వ్యాపార వృద్ధి, సంబంధాలకు వేదికగా నిలుస్తోందని, ఏటా వివిధ శాఖల మద్య సమన్వయం, సొసైటీ వర్గాల సహకారంతో విజయవంతంగా నిర్వహిస్తున్నారని ప్రశంసించారు. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు రాష్ట్రాల ఉత్పత్తుల ప్రదర్శన, వ్యాపారం, సొసైటీ విద్యాసంస్థలు, విద్యార్థులకు నాణ్యమైన విద్యానందించేందుకు నుమాయిష్ ఎంతో దోహదం చేస్తోందని పేర్కొన్నారు. నుమాయిస్ ద్వారా వచ్చే ఆదాయాన్ని తెలంగాణలో వెనకబడిన ప్రాంతాల్లో విద్యాసంస్థలు నెలకొల్పి మెరుగైన, నాణ్యతా ప్రమాణాలతో బోధిస్తున్నారని ఇక్కడే చదివిన విద్యార్థులు దేశ, విదేశాల్లో ఉన్నత స్థానాల్లో పనిచేస్తున్నారని హరీశ్‌రావు పేర్కొన్నారు. ముఖ్యంగా మహిళా విద్యకు అత్యంత ప్రాధాన్యంతోపాటు వారికి సాధికారతకు పెద్దపీట వేస్తోందని కితాబిచ్చారు. నుమాయిష్, విద్యాసంస్థల ద్వారా సుమారు పదివేల మందికి ప్రత్యక్ష, పరోక్షంగా ఉపాధి అవకాశాలు పొందుతున్నారన్నారు.

సొసైటీ బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని, ఈ దిశగా తన వంతు కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. సందర్శకులు రాత్రివేళలో నగరంలో వివిధ చోట్లకు తమ గమ్యస్థలాలకు చేర్చేందుకు ప్రత్యేక ఆర్టీసీ బస్సులను త్వరలో నడపనున్నామని ఈ మేరకు ఆర్టీసీ ఎండికి నిర్దేశించానని హరీశ్‌రావు వెల్లడించారు. నుమాయిష్‌ను అధిక సంఖ్యలో ప్రజలు సందర్శించాలని ఆహ్వానించారు. రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలి మాట్లాడుతూ అన్ని రాష్ట్రాల వ్యాపారాభివృద్ధ్ది, ఔత్సాహికుల వస్తు ఉత్పత్తులకు నుమాయిష్ వేదికగా నిలుస్తోందన్నారు. సందర్శకులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా శాఖల మధ్య సమన్వయంతో పనిచేయాలని కోరారు. వారి భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని, లోపల, బయట కట్టుదిట్టమైన పోలీస్ బందోబస్తుతో గట్టి నిఘా ఏర్పాటు చేస్తున్నామని వివరించారు.

రాష్ట్ర పశుసంవర్థ్ధకశాఖ మంత్రి టి.శ్రీనివాస్‌యాదవ్ నుమాయిష్‌ను అధికారికంగా ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం మంత్రులు బెలూన్లను గాలిలోకి వదిలారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రోడ్ల, భవనాల శాఖమంత్రి ప్రశాంత్ రెడ్డి, ఎగ్జిబిషన్ సొసైటీ ఉపాధ్యక్షుడు మార్గం ఆశ్విన్, కార్యదర్శి సాయినాథ్ దయాకర్‌శాస్త్రీ, సొసైటీ సీనియర్ ప్రతినిధులు వినయ్‌కుమార్, వనం విరేందర్, మార్గం ఆదిత్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News