Friday, December 20, 2024

ఆర్డినెన్స్ ఫ్యాక్టరీతో ఆటలా?

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : దేశ రక్షణ రంగంలో కీలక పాత్ర పోషిస్తున్న మెదక్ సహా ఇతర ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలను ప్రైవేటు పరం చేయవద్దని రాష్ట్ర ఆర్థిక వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు కేంద్రాన్ని డిమాండ్ చేశారు. దేశ భద్రత, 74 వేల మంది ఉద్యోగులను దృష్టిలో ఉంచుకొని వెంటనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరుతూ శనివారం కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్‌కు మంత్రి హరీశ్‌రావు లేఖ రాశారు.

25 వేల మంది భవిష్యత్తు అంధకారంలో పడుతుంది

డిఫెన్స్ రంగంలో ఉన్న ఏడు ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించడం ద్వారా ఆయా సంస్థల మధ్య పోటీ నెలకొంటుందని తెలిపారు. దీంతో నూతన ఆయుధాల అభివృద్ధి నిలిచిపోతుందని, ఇది మేకిన్ ఇండియా స్ఫూర్తిని దెబ్బతీస్తుందని లేఖలో పేర్కొన్నారు. మెదక్‌లోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీకి, సిబ్బందికి గత ఆర్థిక సంవత్సరంలో కావాల్సినంత పని ఉండేదని, దాదాపు రూ.930 కోట్ల ఆర్డర్లను సమయానికి పూర్తి చేశారని గుర్తు చేశారు. సంస్థ సిబ్బంది ఎలాంటి సవాళ్లనైనా స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నారని, కానీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సంస్థకు పెద్దగా పని అప్పగించలేదని తెలిపారు. దీనిని సాకుగా చూపి ఆర్డినెన్స్ ఫ్యాక్టరీని ‘సిక్ ఇండస్ట్రీ’గా ప్రకటిస్తారని కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. ఇదే జరిగితే ప్రత్యక్షంగా 2,500 మంది ఉద్యోగులు, పరోక్షంగా 5 వేల మంది ఉపాధి దెబ్బతింటుందని, మొత్తంగా సుమారు 25 వేల మంది భవిష్యత్తు అంధకారంలో పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ‘ఆయుధ కర్మాగార తెలంగాణ ఉద్యోగుల సమాఖ్య’ ప్రతినిధులు తన వద్దకు వచ్చి ప్రైవేటైజేషన్‌ను అడ్డుకోవాలని విజ్ఞప్తి చేశారని మంత్రి తెలిపారు. ఆరు డిమాండ్లను తన ద్వారా మీ ముందు ఉంచుతున్నారని పేర్కొన్నారు.

ఆరు డిమాండ్లు
1. మూడు రైతు చట్టాల మాదిరిగానే డిఫెన్స్ రంగ సంస్థల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి
2. పరిశోధనల విభాగాన్ని మరింత పటిష్టం చేయాలి.
3. మిషనరీని ఆధునీకరించాలి, ఉద్యోగులకు నైపుణ్య శిక్షణ ఇవ్వాలి.
4. పరిపాలన, కొనుగోలు విధానాలను సరళీకరించాలి.
5. ఆర్మీ అవసరాలకు అనుగుణంగా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీకి ఆర్డర్లు ఇవ్వాలి.
6. ప్రసార భారతిలో మాదిరిగానే ఉద్యోగులకు భద్రత కల్పించాలి.
ఈ డిమాండ్లను పరిగణలోకి తీసుకొని ప్రభుత్వ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరుతున్నానని మంత్రి హరీశ్‌రావులో తన లేఖలో పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News