నిర్మల్: నిర్మల్ నియోజకవర్గ ప్రజలే నా బలం బలగం ప్రజల ఆశీర్వాదంతో మూడువసారీ విజయం సాధిస్తానని నియోజకవర్గ బిఆర్‌ఎస్ అభ్యర్థి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. సిఎం కెసిఆర్ సహకారంతో నిర్మల్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధిలో ముందుంచానని, మరోసారి ఆశీర్వదించి భారీ మెజార్టీతో గెలిపిస్తే మీరందరూ గర్వపడేలా మరింత అభివృద్ధి చేస్తానని తెలిపారు. గురువారం నిర్మల్ ఆర్డిఓ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి బిఆర్‌ఎస్ అభ్యర్థిగా ఇంద్రకరణ్ రెడ్డి నామినేషన్ పత్రాలు అందజేశారు. జడ్పీ చైర్మన్ విజయలక్ష్మీ రాంకిషన్ రెడ్డి, బిఆర్‌ఎస్ సీనియర్ నాయకులు సత్యనారాయణ గౌడ్ , మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, కౌన్సిలర్ నల్లూరి పోశెట్టితో కలిసి నాలుగు సెట్ల నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి అందజేశారు. అంతకముందు తన నివాసంలో ప్రత్యేక పూజలు చేశారు.
నామినేషన్ వేసిన అనంతరం మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తన నివాసం వద్ద బిఆర్‌ఎస్ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడారు. నామినేషన్ సందర్భంగా ఇంత పెద్ద ఎత్తున నిర్మల్‌కు తరలివచ్చిన ప్రతి ఒకరికి పేరుపేరున కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించామన్నారు. ఇక్కడి ప్రజల కోరిక మేరకు ముఖ్యమంత్రి సహకారంతో నిర్మల్ జిల్లాగా ఏర్పడిందన్నారు. మెడికల్ కాలేజ్, కలెక్టరేట్ కాంప్లెక్స్ ఎస్పీ కార్యాలయం ఏర్పాటు చేసుకొని ప్రజల వద్దకు పాలన తెచ్చామన్నారు. ప్రజలకు అందుబాటులోకి వైద్యం అందుబాటులోకి వచ్చిందన్నారు. వ్యవసాయ రంగాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశ్యంతో సాగునీటి కోసం ప్రాజెక్ట్, కెనాల్ , చెక్‌డ్యామ్ నిర్మించుకొని పంట పొలాలకు సాగునీరు అందిస్తున్నామన్నారు. బిజెపి, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో తెలంగాణ తరహాలో ఒక పథకాన్ని అమలు చేస్తున్నారన్నారు.
టికెట్లు కొనుక్కొని ఎన్నికల నిలబడ్డ బిజెపి, కాంగ్రెస్ అభ్యర్థులకు ప్రజలు తగిన బుద్ధి చెప్పాలన్నారు. పార్టీనీ వీడుతున్న వారికి మళ్లీ నో ఎంట్రీ అని ఎన్నికల వేళ తల్లిలాంటి బిఆర్‌ఎస్ పార్టీని వీడుతున్నారని, వారికి తిరిగి బిఆర్‌ఎస్‌లో స్థానం కల్పించేది లేదని స్పష్టం చేశారు. అలాంటి వారికి బిఆర్‌ఎస్ నో ఎంట్రీ చెప్పుతామన్నారు. పార్టీ కోసం కష్టపడి పని చేసిన వారికి తగిన గుర్తింపు ఉంటుందన్నారు.