భువనగిరి: యదాద్రి భువనగిరి జిల్లాలో 2 ఎకరాల విస్తీర్ణంలో రూ. 3.17 కోట్ల వ్యయంతో అటవీ శాఖ కార్యాలయ సముదాయాన్ని మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, జగదీష్ రెడ్డి గురువారం ప్రారంభించారు. 6968 చదరపు అడగుల విస్తీర్ణంలో రెండు అంతస్తుల్లో నిర్మించిన ఈ కాంప్లెక్స్ లో జిల్లా అటవీ శాఖ అధికారి కార్యాలయం, భువనగిరి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ కార్యాలయం, కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ క్యాంప్ ఆఫీస్ తో పాటు కంపౌండ్ వాల్ ను నిర్మించారు. నర్సీరీ సైట్, పగోడాలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ…. ప్రజల ఆకాంక్షలకు, ఆశలకు అనుగుణంగా పరిపాలన ఉండాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అధికార వికేంద్రీకరణ ద్వారా పాలన సులభతరం చేశారన్నారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణతో రాష్ట్ర ప్రజలకు ఎంతో మేలు జరిగిందని తెలిపారు. మరో వైపు అడవుల సంరక్షణ, అటవీ శాఖలో మౌలిక వసతుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని పేర్కొన్నారు. జిల్లాల పునర్విభజన అనంతరం కొత్త జోనల్ వ్యవస్థ అమలులోకి రావడం వల్ల అటవీ శాఖకు కొత్త రూపు వచ్చిందని చెప్పారు.
వసతులను మెరుగుపరచడంతో పాటు అవసరమైన మౌలికవసతుల కల్పన కోసం కృషిచేస్తున్నామని అన్నారు. హరితహారం కార్యక్రమం ద్వారా పెద్ద ఎత్తున మొక్కలు నాటుతున్నామని, రాష్ట్ర వ్యాప్తంగా పచ్చదనం పెరిగి సకాలంలో వర్షాలు కురుస్తున్నాయని అన్నారు. అడవులు తక్కువగా ఉన్న ఉమ్మడి నల్గొండ జిల్లాలో అడవుల పెంపకంపై అటవీ అధికారులు మరింత దృష్టి సారించాలని సూచించారు. అనంతరం హరితహార కార్యక్రమంలో భాగంగా మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, జగదీశ్ రెడ్డి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా రెడ్డి, జెడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డి, ఆయిల్ ఫేడ్ చైర్మన్ రామకృష్ణ రెడ్డి, ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్ రెడ్డి, ఎమ్మెల్సీ నర్సిరెడ్డి, అటవీ శాఖ స్పెషల్ సీఎస్ శాంతి కుమారి, పీసీసీఎఫ్ ఆర్. ఎం.డొబ్రియల్ తదితరులు పాల్గొన్నారు.