నిర్మల్: ప్రాజెక్టులలోకి వచ్చి చేరుతున్న వరదను ఎప్పటికప్పుడు పర్యవేక్షించిడంతో పాటు ఇన్ ఫ్లోను బట్టి నీటిని బయటకు వదిలేలా అధికారులు చర్యలు తీసుకోవాలని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సూచించారు. నిర్మల్ జిల్లాలో భారీ వర్షాల కారణంగా కలిగిన నష్టాలపై మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి జిల్లా అధికారులతో కలెక్టరేట్‌లో సమీక్ష సమావేశం నిర్వహించారు. వరదల వల్ల ముంపుకు గురైన ప్రాంతాల పరిస్థితిని, పంట నష్టం, పునరావాస ఏర్పాట్లను అధికారులను అడిగి తెలుసుకున్నారు. వ్యవసాయ, ఆర్అండ్ బి, విద్యుత్ శాఖ, పంచాయితీ రాజ్, రెవెన్యూ శాఖల పరిధిలో జరిగిన నష్టం వివరాలు తెలుసుకున్నారు. ఆయా శాఖల పరిధిలో జరిగిన నష్టం వివరాలు, అంచనాలతో ప్రాథమిక నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు. భారీ వర్షాలతో తలెత్తిన పరిస్థితి, ప్రస్తుతం తీసుకున్న పునరావాస చర్యలు, తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు మంత్రి దిశానిర్ధేశం చేశారు. మరో రెండు రోజులు పాటు భారీ వర్షాలు కొనసాగే సూచనలు ఉండటంతో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నిర్మల్ జిల్లాలోని జలాశయాల్లో ప్రస్తుత పరిస్థితిపై ఆరా తీశారు.
భారీ వర్షాల వల్ల దెబ్బతిన్న రోడ్లను వెంటనే పునరుద్ధరించాలని, చెరువులు, కాలువల గండ్లను పూడ్చాలని ఆదేశించారు. భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఇబ్బందుల్లేకుండా అధికార యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా ఉండాలన్నారు. అన్నిశాఖల అధికారులు క్షేత్రస్థాయిలో ఉండి, పరిస్థితిని పర్యవేక్షించాలని సూచించారు.
ఈ సమీక్ష సమావేశంలో జడ్పి చైర్ పర్సన్ కె. విజయలక్ష్మి రెడ్డి, ముధోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, కలెక్టర్ ముష్రఫ్ అలీ ఫారూఖీ, ఎస్పి ప్రవీణ్ కుమార్, నీటిపారుదల, మున్సిపల్, పంచాయతీ, వ్యవసాయ, ఇతర సంబంధిత ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు.