నిర్మల్: ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యను అందించాలని, బడి పిల్లల భవితకు బంగారు బాటలు వేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు మన ఊరు-మన బడి, ‘మన బస్తీ-మన బడి’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని అటవీ, పర్యావణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. బుధవారం ఎల్లపల్లి గ్రామంలో మన ఊరు – మన బడి కార్యక్రమంలో మొదటి విడతలో పనులు పూర్తయిన పాఠశాలలో ప్రారంభోత్సవం చేశారు.
అనంతరం నిర్వహించిన సభలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత మౌలిక వసతుల కల్పనలో దేశంలో మన రాష్ట్రం ముందంజల్లో ఉందన్నారు. విద్యారంగం బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందని తెలిపారు. విద్యకు అధిక ప్రాధాన్య ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం సర్కారు స్కూళ్లను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టిందని వెల్లడించారు.
మన ఊరు – మన బడి పథకం క్రింద రాష్ట్ర వ్యాప్తంగా రూ.7,289 కోట్లతో 12 రకాల మౌళిక వసతుల కల్పన కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టత్మకంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో సకల వసతులు కల్పించేందుకు కృషి చేస్తుందని తెలిపారు. పాఠశాల విద్యలో విద్యార్థులకు ఎలాంటి ఆటంకాలు లేకుండా అన్ని వసతులు కల్పిస్తుందన్నారు. ఇలా అన్ని సౌకర్యాలు కల్పించడంతో ఉపాధ్యాయులు కూడా ప్రశాంత వాతావరణంలో పాఠాలు బోధించే అవకాశం కలిగిందన్నారు.
గ్రామాలలోని పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం విద్యాబోధన చేపట్టి, దశల వారీగా డిజిటల్ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టి, విద్యార్థుల అభ్యసన సామర్థ్యాన్ని పెంచేందుకు కృషి చేస్తుందన్నారు. విద్యార్థులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, మీ భవిష్యత్‌ను ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలని సూచించారు. నిర్మల్ జిల్లాలో మొదటి విడతలో రూ. 82 కోట్లతో 260 స్కూళ్ళను ఆధునీకరిస్తున్నామని, మూడు దశల్లో అన్ని పాఠశాలల్లో పనులు పూర్తి చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ముశ్రఫ్ ఫారూఖీ అలీ, జడ్పీ చైర్ పర్సన్ విజయలక్ష్మి రెడ్డి, ఇతర ప్రజాప్రతినిదులు, అధికారులు పాల్గొన్నారు.